టిడిపి మాజీ ఎంఎల్ఏ జంప్..జూలై 5 ముహూర్తం ?

అనంతపురం జిల్లాలోని  తెలుగుదేశంపార్టీ మాజీ ఎంఎల్ఏ గోనుగుంట్ల సూర్యనారాయణ (వరదాపురం సూరి) బిజెపిలో చేరనున్నట్లు సమాచారం. బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్ షా తో ఇప్పటికే రెండుసార్లు భేటీ అయ్యారట. జూలై 5వ తేదీన ఢిల్లీలో షా సమక్షంలోనే వరదాపురం సూరి కమలం కండువా కప్పుకునేందుకు రంగం సిద్ధమైందట.

బిజెపిలో చేరేందుకు వీలుగానే సూరి తన రాజీనామా లేఖను చంద్రబాబునాయుడుకు పంపారని పార్టీ వర్గాలు అంటున్నాయి. జిల్లాలోని ధర్మవరంలో 2014లో ఎంఎల్ఏగా గెలిచిన సూరి పార్టీని వదిలేయటమంటే టిడిపికి పెద్ద దెబ్బనే చెప్పాలి. ఎందుకంటే ఆంగ, ఆర్ధిక బలం పుష్కలంగా ఉన్న సూరికి ప్రత్యామ్నాయంగా టిడిపి మరో నేతను తయారు చేసుకోవటం అంత ఈజీ కాదు.

చంద్రబాబు అధికారంలో ఉన్నపుడు సూరి నియోజకవర్గంలో ఎన్నో అరాచకాలు చేశారు. అప్పటి ప్రతిపక్షం వైసిపి నేతలపై విచ్చలవిడిగా దాడులు చేయించటం, కేసులు పెట్టి జైళ్ళకు పంపటం లాంటివి ఎన్నో చేశారు. ఇక ఆర్ధికంగా ఎదిగేందుకు నియోజకవర్గంలో జరిగిన ప్రతి అభివృద్ధి కార్యక్రమం తన కనుసన్నలోనే జరిగేట్లు చూసుకున్నారు. మైనింగ్ తదితర వ్యవహారాల్లో ఏకపక్షంగా వ్యవహరించి అడ్డదిడ్డంగా వందల కోట్లు సంపాదించుకున్నారు.

అధికారంలో ఉండగా ఆకాశమే హద్దుగా చెలరేగిపోయిన సూరి టిడిపి ఓడిపోగానే బిజెపిలో చేరటానికి రెడీ అయిపోయారు. తనపై ఎక్కడ కేసులు పడతాయో ? ఎప్పుడు అరెస్టు చేస్తారో ? అన్న భయంతోనే సూరి బిజెపిలో చేరి రక్షణ పొందే ఆలోచన చేసినట్లు చెబుతున్నారు. మొత్తానికి కారణాలేవైనా బలమైన నేతలు టిడిపిని వదిలేస్తుండటం మాత్రం ఖాయమని తేలిపోతోంది.