చంద్రబాబుకే షాకిచ్చిన ఫిరాయింపు మాజీ మంత్రి

’ఏరు దాటే వరకూ బోటు మల్లన్న…ఏరు దాటిన తర్వాత బోడి మల్లన్న’ అన్న సామెతలాగుంది ఫిరాయింపు మాజీ మంత్రి ఆది నారాయణరెడ్డి వ్యవహారం. మొన్నటి ఎన్నికలకు ముందు వరకూ నోటికొచ్చినట్లు వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై నోరు పారేసుకున్న విషయం అందరూ చూసిందే. మంత్రి పదవి కోసమే వైసిపిలో నుండి టిడిపిలోకి ఫిరాయించిన ఆది తన పదవీ కాలంలో బాగానే  సంపాదించుకున్నారు.

ఫిరాయింపు మంత్రి హోదాలో అడ్డదిడ్డమైన వ్యవహారాల్లో తలదూర్చి నాలుగు చేతులా బ్రహ్మాండంగా సంపాదించుకున్నారు. అంటే ఈ విషయాన్ని ఆదే స్వయంగా చెప్పిన విషయం గుర్తుండే ఉంటుంది. సరే మొన్నటి ఎన్నికల్లో వైసిపి కథేంటో తేల్చేస్తానన్నారు. జగన్ అసలు పులివెందులలో గెలవటమే కష్టమన్నారు. ఇలా చాలా పెద్ద మాటలే మాట్లాడారు.

తీరా ఎన్నికలు వచ్చేసరికి బొక్క బోర్లా పడ్డారు. ఇంతకీ విషయం ఏమిటంటే తన ఓటమికి చంద్రబాబే కారణమంటున్నారు. ఎంపిగా తాను ఓడిపోవటానికి అసెంబ్లీ అభ్యర్ధుల్లో చంద్రబాబు సెలక్షన్ లో తప్పులు జరగటమే కారణమట. అంటే చంద్రబాబు చేసిన తప్పుల వల్లే తాను ఓడిపోయానంటున్నారు.

అలాంటి ఆది తొందరలో తాను బిజెపిలో చేరటం ఖాయమంటున్నారు. తనకు దేశభక్తి ఎక్కువట. అందుకనే బిజెపిలో చేరాలని నిర్ణయించుకున్నట్లు చెప్పటమే కాస్త ఎబ్బెట్టుగా ఉంది. తాను పార్టీమారనని టిడిపిలోనే కంటిన్యు అవుతానని చెప్పటాన్ని ఇపుడు ఆది నారాయణ రెడ్డి తప్పు  పడుతున్నారు.