టిడిపికి గుడ్  బై చెప్పేశారు

గుంటూరు జిల్లాలోని మరీ సీనియర్ నేత, మాజీ ఎంపి రాయపాటి సాంబశివరావు తెలుగుదేశంపార్టీకి గుడ్ బై చెప్పేశారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ప్రకటించారు. తొందరలోనే టిడిపికి రాజీనామా చేసి బిజెపిలో చేరబోతున్నట్లు రాయపాటి ప్రకటించారు.

మొన్నటి ఎన్నికల్లో టిడిపి ఘోర పరాజయం తర్వాత చాలామంది నేతలు టిడిపిలో నుండి బయటకు వచ్చేయాలని ప్రయత్నిస్తున్నారు. ముందుగా వైసిపిలో చేరాలని అనుకున్నా కుదరలేదు. దాంతో వేరే దారిలేక బిజెపిలో చేరుతున్నారు. ఇప్పటికే నాలుగురు రాజ్యసభ ఎంపిలు టిడిపిలోకి ఫిరాయించిన విషయం తెలిసిందే. ఓ ఎంఎల్సీ కూడా పదవికి రాజీనామా చేసి బిజెపిలో చేరారు.

వీరే కాకుండా అక్కడక్కడ చాలామంది నేతలు టిడిపికి రాజీనామా చేసేసి కమలం కండువా కప్పుకుంటున్నారు. వీలైనంత మంది టిడిపి నేతలు బిజెపిలోకి చేర్చుకోవటం ద్వారా చంద్రబాబునాయుడును పెద్ద దెబ్బ తీయాలని బిజెపి నేతలు చాలానే కష్టపడుతున్నారు. ఇందులో భాగంగానే రాయపాటి చేరుతున్నారు.

టిడిపి నేతలు బిజెపిలో చేరుతున్నారు సరే మరి వీళ్ళ వల్ల కమలం పార్టీకి ఏమాత్రం లాభం ఉంటుందంటే అనుమానమనే చెప్పాలి. ఇప్పటి వరకూ బిజెపిలో చేరిన టిడిపి నేతల్లో చాలామంది  జనబలం ఉన్న వాళ్ళు కాదు. కాకపోతే ఆర్ధికంగా బలవంతులైన వాళ్ళు అయ్యుండాచ్చు.  ఏదోరకంగా బిజెపి బలం పెరిగిపోతోందని ఆ పార్టీ నేతలను భ్రమల్లో ఉంటే ఎవరూ చేయగలిగేదేమీ లేదు.