చంద్రబాబుతో పొత్తులపై కాంగ్రెస్ లో రివర్స్

తెలంగాణా ఎన్నికల్లో చేసిన ప్రయోగం విఫలమవ్వటంతో ఏపిలో కాంగ్రెస్, టిడిపి పొత్తులపై అనుమానాలు పెరిగిపోతున్నాయి. అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం రెండు పార్టీల మధ్య పొత్తుకు అవకాశం దాదాపు లేనట్లే. తెలంగాణాలో తెలుగుదేశంపార్టీతో పొత్తు పెట్టుకున్నందు వల్లే దారుణంగా దెబ్బ తిన్నామని చాలామంది సీనియర్ నేతలు భావిస్తున్నారు. బయటకు అందరూ చెప్పకపోయినా పొంగులేటి సుధాకర్ రెడ్డి సీనియర్ నేతలు బాహాటంగానే చెప్పిన విషయం అందిరికీ తెలిసిందే. తెలంగాణాలో వికటించింది కాబట్టి ఏపి ఎన్నికల్లో కూడా పొత్తుల ప్రభావం తప్పక ఉంటుంది. అందుకనే ఏపిలో పొత్తులు వద్దని రెండు పార్టీల నేతలు అభిప్రాయపడుతున్నట్లు సమాచారం.

 

నిజానికి తెలంగాణాలో తెలుగుదేశంపార్టీ పరిస్ధితి ఏంటో ఏపిలో కాంగ్రెస్ పరిస్ధితి అంతే అని చెప్పాలి. కాకపోతే తెలంగాణాలో టిడిపి ఒక ఎంఎల్ఏ ఉన్నారు. ఏపిలో కాంగ్రెస్ కు ఆ ముచ్చట కూడా లేరు. తెలంగాణాలో చంద్రబాబు పొత్తు పెట్టుకున్నది పార్టీని బతికించుకోవటానికే తప్ప కాంగ్రెస్ పై ప్రేముండికాదు. అయితే, చంద్రబాబు వ్యూహాలు దారుణంగా దెబ్బ కొట్టేశాయి. ఇక, ఏపి పరిస్ధితి చూస్తే సేమ్ టు సేమ్ అనే అనుకోవాలి. టిడిపితో పొత్తు పెట్టుకోవటం వల్ల ఎక్కడైనా నాలుగు సీట్లు వస్తాయేమోనని కాంగ్రెస్ నేతల్లో కొందరు ఆలోచిస్తున్నారు. అయితే, అది జరిగే పనికాదని అందరికీ తెలుసు.

 

పోయిన ఎన్నికల్లో మొత్తం 175 నియోజకవర్గాల్లో పోటీ చేసిన కాంగ్రెస్ కు మహా అయితే ఓ నాలుగు నియోజకవర్గాల్లో డిపాజిట్లు వచ్చుంటాయేమో ? రాష్ట్ర విభజనతో కాంగ్రెస్ పార్టీ తన భవిష్యత్తుకు తానే సమాధి కట్టేసుకుంది. కాంగ్రెస్ పార్టీపై జనాల్లోని ఆగ్రహం ఇప్పటితో పోయేది కాదు. ఈ విషయం అందరికీ తెలుసు. కాబట్టి ఏపిలో విషయం తెలిసీ కాంగ్రెస్ తో పొత్తులు పెట్టుకునేంత తెలివి తక్కువ నేత కాదు చంద్రబాబు. పొత్తుల వల్ల అవతలి వాళ్ళు నాశనమైపోయినా పర్వాలేదు  తాను మాత్రం లాభంపడాలన్నది చంద్రబాబు సిద్ధాంతం. అటువంటి చంద్రబాబు పొత్తులు పెట్టుకోవటం ద్వారా కోమాలో ఉన్న కాంగ్రెస్ కు ప్రాణం పోస్తాడని ఎవరు అనుకోవటం లేదు.

 

అదే సమయంలో గడచిన నాలుగున్నరేళ్ళుగా చంద్రబాబు అవినీతి పాలనపై కాంగ్రెస్ పార్టీ పోరాటాలు చేసింది. చంద్రబాబు అవినీతిపై పిసిసి అధ్యక్షుడు రఘువీరారెడ్డి ఏకంగా ప్రజా కోర్టులో చార్జిషీటే విడుదల చేశారు. అటువంటి స్ధితి నుండి రేపటి ఎన్నికల్లో కాంగ్రెస్ పొత్తు పెట్టుకుంటే వస్తాయనుకుంటున్న నాలుగు ఓట్లు కూడా పోతాయన్నది మెజారిటీ కాంగ్రెస్ నేతల ఆందోళనగా తెలుస్తోంది. అందుకే రఘువీరెడ్డి పొత్తులను వ్యతిరేకిస్తున్నారట. మాజీ సిఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి లాంటి మరికొందరు సీనియర్లు కూడా పొత్తులు వద్దని తాజాగా కొత్త పల్లవి అందుకున్నారని సమాచారం. సరే పొత్తైనా ఇంకోటైనా చంద్రబాబు రాష్ట్ర స్ధాయిలో మాట్లడరు కదా ? ఎన్నికలు దగ్గరకు వస్తున్న సమయంలో చంద్రబాబు ఏం చేస్తారో చూద్దాం.