చంద్రబాబుకు వర్ల షాక్

క్షేత్రస్ధాయి నుండి అందుకుతున్న ఫీడ్ బ్యాక్ ప్రకారం అలాగే అనుకోవాల్సొస్తోంది. తెలుగుదేశంపార్టీ ప్రభుత్వంలో దళితులెవరూ సంతోషంగా లేరని, పదవులిస్తారే కానీ అధికారాలు మాత్రం ఉండవని సీనియర్ నేత వర్ల రామయ్య ఆరోపించి  చంద్రబాబుకు పెద్ద షాకే ఇచ్చారు.  ఈ మధ్యనే మాజీ మంత్రి రావెల కిషోర్ బాబు కుడా ఇటువంటి ఆరోపణలే చేసిన సంగతి తెలిసిందే. అయితే, పార్టీలో నుండి బయటకు వెళ్ళేటపుడు రాళ్ళేయటం మామూలేనని చాలామంది అనుకున్నారు. అదే సమయంలో రావెల చేసిన ప్రకటనపై పార్టీలోని ఎస్సీ మంత్రులు మండిపడ్డారు కూడా. సరే, ఎలాగూ పార్టీలో నుండి బయటకు వెళ్ళిపోయాడు కాబట్టి రావెల ప్రకటనను అధికార పార్టీ చాలా లైట్ గా తీసుకుంది.

 

మరి ఇఫుడు చంద్రబాబుకు దోమకుడితే తాను గోక్కునేంతటి స్వామి భక్తిపరుడు, చంద్రబాబు మౌత్ పీస్ ల్లో ఒకరిగా ప్రచారంలో ఉన్న వర్ల రామయ్య కూడా అదే మాట అంటున్నారు. నెల్లూరులో వర్ల మాట్లాడుతూ, తెలుగుదేశంపార్టీ ప్రభుత్వం దళితులకు పదవులు మాత్రమే ఇస్తుంది కానీ అధికారం మాత్రం ఇవ్వదని కుండబద్దలు కొట్టినట్లు చెప్పారు. సమాజంలో వేళ్ళూనికునిపోయిన సామాజిక రుగ్మతల నిర్మూలనకు ప్రభుత్వం గనుక చర్యలు తీసుకోకపోతే దళితుల ఆగ్రహాన్ని చూడాల్సొస్తుందని కూడా ఘాటుగానే హెచ్చరించారు.

 

నాలుగున్నరేళ్ళ పాలనలో చంద్రబాబుపై అన్నీ వర్గాల్లోను వ్యతిరేకత పెరిగిపోయిందిన బాగా ప్రచారంలో ఉంది. చంద్రబాబు సామాజికవర్గంలోని కొందరు తప్ప మిగిలిన అన్నీ నియోజకవర్గాల్లో మెజారిటీ సెక్షన్లు మండిపోతున్నది కూడా వాస్తవమే. ఎన్నికలు తరముకొస్తున్న నేపధ్యంలో దళితుల ఆగ్రహంపై పార్టీలో సీనియర్ నేత, ఏపిఎస్ ఆర్టీసి ఛైర్మన్ వర్ల రామయ్య సొంత ప్రభుత్వంపైనే హెచ్చరికలు జారీ  చేయటంపై పార్టీలో తీవ్ర చర్చ జరుగుతోంది. తమ ప్రభుత్వం కోసం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నాదళితుల కళ్ళల్లో మాత్రం సంతోషమన్నదే కనబడబటం లేదని చెప్పటం గమనార్హం. పైగా రాష్టంలొ ఇప్పటికీ కుల వివక్ష కొనసాగుతోందన్న పెద్ద బాంబే పేల్చారు.

 

రాష్ట్రంలో దళిత అధికారులను బాగా ఇబ్బందులకు గురిచేస్తున్నట్లు కూడా వర్ల చేసిన ఆరోపణలు పార్టీలో పెద్ద దుమారమే రేపేట్లుంది. అణగారిన వర్గాలకు పార్టీలో ప్రాధాన్యత దక్కటం లేదని చెప్పటం ఆశ్చర్యంగా ఉంది. వర్ల మాట్లాడిన సమావేశంలో మంత్రులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డితో పాటు పొంగూరు నారాయణ కూడా పాల్గొనటం గమనార్హం. తాజాగా వర్ల చేసిన వ్యాఖ్యలు, వర్లలోని అసంతృప్తి చూస్తుంటే మొన్న రావెల చేసిన ఆరోపణలు వాస్తమే అని తేలిపోయింది. రావెల అంటే పార్టీలో నుండి బయటకు వెళిపోయేటపుడు ఆరోపణలు చేశాడు సరే. మరి ఆర్టీసీ ఛైర్మన్ గా ఉన్న వర్ల కూడా అవే ఆరోపణలు చేయటంలో అర్ధమేంటి ?