చరిత్రలో మరో చీకటిరోజు!

అదిగదిగో కారంచేడు.. అక్కడ ఒకనాడు కొన్ని వర్గాల బ్రతుకే చేదు… పెద్దోళ్ల దురాగతాలను ప్రశ్నిస్తే ఆ బ్రతుకే చెడు.. ఇలా జరుగుతుందనో ఏమో.. ఆ ఊరి పేరులోనే కారం..చెడు..!

పెద్దోళ్లకో నీతి.. పేదోళ్ళకి మరో రీతి.. ఈ తరం జనం బైస్కోపుల్లో మాత్రమే చూసే అకృత్యాలకు వేదిక.. ఆ వాటిక..!

ఒరిస్సా మారుమూల ప్రాంతాల్లో.. తెలంగాణ తండాల్లో జరిగే అకృత్యాలు కారంచేడులో నిత్యకృత్యాలు.. నీ చెరువు నీకు బరువు.. పెద్దోళ్ల నీటి చెరువు వారి పరువు.. అటు నువ్వెళ్తే ఖబడ్దార్.. ఉన్నోళ్ళు ఎక్కడైనా బలాదూరు.. అదీ ఆ ఊరు..!

అలాంటి ఊళ్ళో హక్కులు ఎండమావి.. అక్కడ దళితుల బావి.. పెద్దోళ్ల పశువులు కడిగేస్తే.. కుడితి బకెట్లూ కడిగేస్తుంటే ఇదేమి చోద్యమని ప్రశ్నించినందుకు మొదలైంది రచ్చ… పెరిగింది కచ్చ.. పెత్తందారీ అహంకారానికి.. సొమ్ము తెచ్చిన అధికారానికి విఘాతం ఏర్పడితే… జరగదా ఘోరకలి… ఎనిమిది మంది దళితులు బలి.. రక్తం రుచి మరిగిన పులికి అప్పటికి తీరిందేమో ఆకలి..!?

పల్లె పిడుగైంది.. రక్తపు మడుగైంది.. నాగరికత మరుగైంది.. ఆర్తనాదం మారుమ్రోగింది.. హింసకు గంట మోగింది..!

అంతే.. పల్లె పట్నం.. ఊరూవాడా..తేడాపాడా… దిగివచ్చింది సర్కారు.. పద్మారావు ఝులిపిస్తే ‘కత్తి’ బొజ్జ తారకం పఠిస్తే తారకమంత్రం.. ఫలించింది తిరుగుబాటు తంత్రం.. ఊరు చల్లబడింది.. దౌర్జన్యం పాతబడింది..!

కారంచేడు సరే… ఇప్పటికీ అక్కడో..ఇక్కడో.. ఎక్కడో ఓ చోట అదే అహంకారపు పాట పెద్దోళ్ల నోట..! పదోడి బ్రతుకు బాట.. ఇప్పటికీ.. ఎప్పటికీ అదే ముళ్ళబాట..!! సమసమాజం… నవసమాజం.. నలిగిపోయేలా చెయ్యడమే పెద్దోళ్ల ఇజం..ఇది నిజం!