ఓటమి కన్ఫామా… వర్ల రామయ్యను బరిలోకి దింపండి!

రాజ్యసభ ఎన్నికల టాపిక్ రాగానే… టీడీపీలోని ఎస్సీ, బీసీ నేతలపై చంద్రబాబు వైఖరి స్పష్టంగా కనిపిస్తుంటుంది. ఎవరికి రాజ్యసభ సీటు ఏ పరిస్థితుల్లో కేటాయించారనేది ప్రజలు గ్రహిస్తున్నారన్ని తెలిసినా… బాబుకు ఏమాత్రం భయం ఉండదు! అభాసుపాలైనవారికి ఏమీ ఉండదు అనే కామెంట్లు వినిపిస్తుంటాయి!! యుద్ధమన్నాక ఎవరొకరు చావడం తప్పదు కానీ… ఎప్పుడూ ప్లాన్ ప్రకారం ఒకరినే చంపడం ఏమిటో బాబుకు, చంపించుకుంటున్నవారికి, వారి వారి వర్గాలకు తెలియాలి!!

ఒకసారి గతానికి వెళ్తే… రాష్ట్ర విభజన అనంతరం రెండు తెలుగు రాష్ట్రాల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల సమయంలో తెలంగాణలో ముఖ్యమంత్రి అభ్యర్థిగా వెనుకబడిన వర్గానికి చెందిన ఆర్ కృష్ణయ్యను తెలుగుదేశం పార్టీ ప్రకటించిన సంగతి తెలిసిందే. తెలంగాణలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేమనే విషయం తెలిసి కూడా చంద్రబాబు ఆర్ కృష్ణయ్య పేరును ప్రతిపాదించడం వెనుక ఆయన వెనకున్న సామాజికవర్గాలను ఏపీలోనూ వాడుకునే ప్రయత్నం చేశారనే విమర్శలు ఉన్నాయి.

ఇదే క్రమంలో 2014లో టీడీపీ నుంచి ఇద్దరిని రాజ్యసభకు పంపే అవకాశం వచ్చింది. ఈ సమయంలో బాబుకు ఎస్సీ, బీసీలు గుర్తుకు రాలేదు!! కచ్చితంగా గెలిచే అవకాశం ఉండటంతో… తన సొంత సామాజికవర్గానికి చెందిన గరికపాటి మోహనరావుకు ఒక సీటు, పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన తోట సీతారామలక్ష్మికి మరో సీటు ఇచ్చారు! తెలంగాణకు చెందిన మోత్కుపల్లి నరసింహులు కోరినా బాబు లైట్ తీసుకున్నారు.

అనంతరం… 2016లో టీడీపీ తరఫున ముగ్గురిని రాజ్యసభకు పంపే అవకాశం వచ్చినప్పుడు.. అప్పుడు బీజేపీతో పొత్తులో ఉండటంతో ఎన్డీఏ కోటాలో సురేష్‌ ప్రభుకి అవకాశం ఇచ్చారు. ఇక మిగిలిన ఇద్దరిలో టీజీ వెంకటేష్‌ కు.. అప్పటికే రాజ్యసభ సభ్యుడిగా ఉన్న సుజనా చౌదరికి చంద్రబాబు కట్టబెట్టారు. టీడీపీకి చెందిన దళిత నేత జేఆర్‌ పుష్పరాజ్‌ కు సీటిస్తానని చివరి నిమిషంలో హ్యాండ్ ఇచ్చారు.

అది అక్కడితో అయిపోలేదు… 2018లో టీడీపీకి రెండు రాజ్యసభ స్థానాలు దక్కే పరిస్థితి ఉన్నప్పుడు సీఎం రమేష్‌ కు రెండోసారి అవకాశం ఇచ్చారు. మరో సీటు వర్ల రామయ్యకు ఇస్తానని చెప్పి ఆఖరి నిమిషంలో కనకమేడల రవీంద్రకుమార్‌ కు ఇచ్చారు. 2020లో మాత్రం బాబుకు దళితులపై ప్రేమ వచ్చింది.. గెలుపు అసాధ్యం కావడంతో ఆ సీటును వర్ల రామయ్యకు ఇచ్చారు!!

ఇందులో భాగంగా… 2020 జూలో జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో ఓడిపోతామని తెలిసిన చంద్రబాబు… వర్ల రామయ్యను బరిలోకి దింపారు. దీంతో… ఆ ఎన్నికల్లో 23 మంది టీడీపీ ఎమ్మెల్యేలున్నప్పటికీ 17 ఓట్లు మాత్రమే వచ్చాయి. అంటే టీడీపీ ఓట్లు వర్లకు కూడా పూర్తి స్థాయిలో పడలేదన్నమాట. పోటీలో ఉన్నది దళిత నేత కావడం వల్లే నిర్లక్ష్యం చేసినట్లు పార్టీలో చర్చ జరుగుతోంది. దీంతో… టీడీపీలో దళితులకున్న గౌరవం ఏపాటిదో స్పష్టమైందనే కామెంట్లు వినిపించాయి!

కట్ చేస్తే… మరోసారి రాజ్యసభ ఎన్నికలకు సమయం ఆసన్నమైంది. రాజ్య‌స‌భ‌లో అధికారికంగా క‌న‌క‌మేడ‌ల ఒక్కరే టీడీపీ రాజ్యస‌భ స‌భ్యుడు. ఆయ‌న ప‌ద‌వీ కాలం కూడా ఏప్రిల్ రెండుతో ముగుస్తోంది. అయితే.. ఇప్పుడు టీడీపీకి ఉన్న బలం రీత్యా రాజ్యస‌భ‌లో ప్రాతినిధ్యం సంపాదించుకునే అవ‌కాశం లేదు! అయినప్పటికీ టీడీపీ త‌న అభ్యర్థిని అయితే బ‌రిలోకి దింప‌నుంద‌ని తెలుస్తోంది. ఈ సమయంలో కూడా ఒక పేరు తెరపైకి వచ్చిందని అంటున్నారు!!

ప్రస్తుత బ‌లాబ‌లాల ప్రకారం.. రాజ్యస‌భలో ఒక్క సీటును పొందాల‌న్నా 44 మంది ఎమ్మెల్యేల మ‌ద్దతు అవ‌స‌రం అవుతుంది. అయితే టీడీపీకి గ‌త ఎన్నిక‌ల్లో ద‌క్కింది 23 మంది ఎమ్మెల్యేలే కాబట్టి… వారిలో రెబ‌ల్స్ త‌దిత‌రులు పోనూ ఇప్పుడు మిగిలింది 18!! అంటే… 44 మంది ఎమ్మెల్యేల మ‌ద్దతుకు టీడీపీ చాలా దూరంలో ఉంది! అయితే ఇటీవ‌ల అభ్యర్థుల ప్రక‌ట‌న‌తో వైసీపీ త‌ర‌ఫున ప‌లువురు అసంతృప్తులు స‌హ‌జంగానే త‌యార‌య్యే అవ‌కాశం ఉంది. వారంతా చేరినా కూడా 44 కష్టమని అంటున్నారు. పైగా వారిపై అనర్హత కత్తి వేళాడుతూ ఉంది!!

అయినప్పటికీ చంద్రబాబు రాజ్యసభ ఎన్నికల బరిలోకి దిగాలని ఫిక్సయ్యారని తెలుస్తుంది. ఈ సమయంలో “సరైన” అభ్యర్థికోసం పెద్దగా రీసెర్చ్ అవసరం లేకుండా.. దళిత నేత కోసం చూస్తున్నారని.. వెంటనే వర్ల రామయ్య పేరు తట్టిందని.. మరోసారి రామయ్య “అందుకు” రెడీ అయిపోతున్నారని చర్చ నడుస్తుంది!