చంద్రబాబు మీడియా బాగా అతిచేసిందా ?

తెలంగాణా ఎన్నికల ఫలితాలు చూసిన  తర్వాత అందరిలోను అదే అభిప్రాయం వ్యక్తమవుతోంది. దశాబ్దాల పాటు అలవాటు పడిపోయిన దారిలోనే చంద్రబాబునాయుడుకు తలబొప్పి కట్టింది. ఎక్కడైనా సరే మీడియా మ్యానెజ్ మెంటు ద్వారా మాత్రమే చంద్రబాబు మామూలుగా తన టార్గెట్ రీచ్ అవుతుంటారు. ఉన్నది లేనట్లు, లేనిదాన్ని ఉన్నట్లు మీడియా ద్వారా చంద్రబాబు జనాలకు కలరింగ్ ఇస్తుంటారు. ఈ విద్య చంద్రబాబుకు మంచినీళ్ళు తాగినంత సులభం. అలాంటిది మొదటిసారి తెలంగాణా ఎన్నికల్లో చంద్రబాబుకు దిమ్మతిరిగింది, చంద్రబాబుకు మద్దతుగా మీడియాలో అత్యధికం ఏకమైనా జనాలు నమ్మేలేదు. తెలంగాణా ఎన్నికల్లో మహాకూటమిని చీ కొట్టటం ద్వారా జనాలు చంద్రబాబును తెలంగాణాకు పూర్తిగా దూరం పెట్టేశారన్నది స్పష్టంగా అర్దమవుతోంది.

 

పేరుకే మహాకూటమికి కాంగ్రెస్ పెద్దన్నే అయినప్పటికి వాస్తవంగా కూటమిని నడిపింది మాత్రం చంద్రబాబే అన్న విషయం తెలిసిందే. మహాకూటమిని పరుగులు పెట్టించింది మాత్రం చంద్రబాబే.  తెలంగాణాలోని మెజారిటీ మీడియాలో వార్తలు, కథనాలు తదితరాలు కాంగ్రెస్ కు అనుకూలంగా వచ్చిన సందర్భాలు ఎవరైనా చూశారా ? కాంగ్రెస్ తో చంద్రబాబు పొత్తు పెట్టుకున్న కారణంగానే చంద్రబాబుకు మద్దతుగా నిలిచే మీడియా కూడా కాంగ్రెస్ ను భుజాన మోసింది. ఇంత చేసినా మహాకూటమికి, చంద్రబాబుకు ఫలితం దక్కలేదు.

 

ఎన్నికలు ఊపందుకున్న దగ్గర నుండి మహాకూటమి గెలిచిపోతోందని, టిఆర్ఎస్ ఇక ఇంటికి పోవాల్సిందేనంటూ ఒకటే ఊదరగొట్టింది మీడియా. ప్రతీ నియోజకవర్గాన్ని దగ్గరుండి మరీ మహాకూటమికి అనుకూలంగా సదరు మీడియా హైలైట్ చేసింది. సరే, ఎన్ని మాయోపాయాలు చేసినా కట్టు కథలు వినిపించినా మీడియా మాటను జనాలు నమ్మలేదు.

 

పైగా చంద్రబాబుపై తమకున్న స్పష్టమైన వ్యతిరేకతను చాలా బలంగా చాటి చెప్పారు. హోలు మొత్తం మీద అర్దమవుతున్నదేమంటే మీడియా మద్దతున్నంత మాత్రానా చంద్రబాబు ప్రతీసారి సక్సెస్ అవుతారని అనుకోవటం భ్రమే. బహుశా తెలంగాణాలో పోషించిన పాత్రనే మీడియా ఏపిలో త్వరలో జరుగనున్న ఎన్నికల్లో కూడా పోషిస్తుందనటంలో సందేహం లేదు. మరి ఏపి జనాలు కూడా తెలంగాణా జనాల్లాగ తెలివితో వ్యవహరిస్తారా ? చూడాల్సిందే ?