వ్యూహాల్లో చంద్రబాబు ఎవరిని ఫాలో అవుతున్నారో తెలుసా ?

‘పార్టీ అభ్యర్ధలకు టిక్కెట్లను ముందస్తుగా ప్రకటించేస్తా’… చంద్రబాబునాయుడు తాజా ప్రకటన.

 

చంద్రబాబు ప్రకటన చూసి పార్టీ నేతలంతా విస్తుపోయారు. ఎందుకంటే, టిక్కెట్లను ముందస్తుగా ప్రకటించటం చంద్రబాబునాయుడు నైజానికి విరుద్ధం. చివరకు మంత్రులు, సిట్టింగ్ ఎంఎల్ఏలకు కూడా టిక్కెట్లపై భరోస ఇవ్వరు. కానీ తన నైజానికి విరుద్ధంగా టిక్కెట్లను ముందుగా ప్రకటిస్తానని చెప్పి అందరినీ ఆశ్చర్యంలో ముంచేశారు. కారణం ఏమిటంటే, తెలంగాణాలో కెసియార్ అనుసరించిన వ్యూహాలనే తాను కూడా అమలు చేసి ఫలితం పొందాలని చంద్రబాబు అనుకుంటున్నట్లుంది. అంటే 24 గంటలూ విమర్శిస్తున్న కెసియారే వ్యూహాలను చివరకు చంద్రబాబు అనుసరించక తప్పటం లేదని అర్ధమవుతోంది.

 

ఎన్నిక ఏదైనా సరే చివరి నిముషం వరకూ నాన్చి అభ్యర్ధుల్లో బిపిని పెంచేసి నామినేషన్లు వేయటానికి ఇంకొక్క రోజే గడువుందనగా అభ్యర్ధిని ప్రకటించటమే చంద్రబాబు నైజం. అలా ఎందుకు  చేస్తారో చంద్రబాబుకే తెలియాలి. నిజానికి నియోజకవర్గంలో ఎవరికి టిక్కెట్టివ్వాలనే విషయంలో ముందుగానే ఓ నిర్ణయానికి వచ్చేస్తారు. కానీ దాన్ని అధికారికంగా ప్రకటించటానికి మాత్రం ఇష్టపడరు. అభ్యర్ధులను బాగా టెన్షన్ కు గురిచేసి చివరకు పోటీ చేయాలనుకుంటున్న వారికి బ్రతుకు మీద విరక్తి పుట్టిన తర్వాత కానీ టిక్కెట్లు ఖరారు చేయరు. తన ధోరణి వల్ల చాలా ఎన్నికల్లో అభ్యర్దులు నష్టపోయిన సందర్భాలు చాలా ఉన్నాయి. అయినా తన ధోరణిని మార్చుకోవటానికి ఇష్టపడరు.

 

అలాంటిది రానున్న ఎన్నికల్లో పోటీ చేయబోయే అభ్యర్ధులను ముందుగానే ప్రకటించేస్తానని చంద్రబాబు చెప్పినా ఎవరికీ నమ్మకం కుదరటం లేదు. సరే, అభ్యర్ధుల ఎంపికపై ఇఫ్పటికే చాలా సర్వేలే చేయించారు. ప్రతీనెల చేయిస్తున్న సర్వేల వల్ల 40 నియోజకవర్గాల్లో సిట్టింగులపై ఇఫ్పటికే నిర్ణయానికి వచ్చారట. ప్రతీ జిల్లాలోను కనీసం మూడు నియోజకవర్గాల్లో కొత్త వారికి అవకాశం ఇవ్వాలని కూడా నిర్ణయించుకున్నారట. ముగ్గురు మంత్రులకు కూడా షాక్ తప్పదని పార్టీ వర్గాలంటున్నాయి. మొత్తం మీద 40 మంది ఎంఎల్ఏలకు పోటీ చేసే అవకాశం దక్కేది అనుమానమేనట. అనంతపురంలో ఐదుగురు, ఉభయ గోదావరి జిల్లాల్లో ఓ 10 మందికి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో 8 మందికి, ప్రకాశం జిల్లాలో ముగ్గురికి, కర్నూలు జిల్లాలో ఇద్దరికి టిక్కెట్లు దక్కే అవకాశాలు లేవని సమాచారం.

 

ఇంతకీ చంద్రబాబు ముందస్తు టిక్కెట్ల ప్రకటన నిర్ణయానికి తెలంగాణా సిఎం కెసియారే అని స్పష్టమవుతోంది. తెలంగాణాలో సెప్టెంబర్ 6వ తేదీన 105 మంది సిట్టింగులకు కెసియార్ టిక్కెట్లను ప్రకటించిన విషయం అందరికీ తెలిసిందే. అంటే దాదాపు మూడు నెలల ముందే అభ్యర్ధులను ప్రకటించారు. దాని వల్ల తమపై ఉన్న వ్యతిరేకతను, అసంతృప్తులను సర్దుబాటు చేసుకోవటానికి అభ్యర్ధులకు అవకాశం వచ్చింది. ఆ విషయంపైనే చంద్రబాబు దృష్టి పడిందట. ఎలాగూ చంద్రబాబు పాలనపై జనాల్లో బాగా వ్యతిరేకతుంది. అయితే, వ్యతిరేకత అంతా ఎంఎల్ఏల మీదే కానీ తన మీద కాదన్నది చంద్రబాబు వాదన. కాబట్టి ముందుగా టిక్కెట్లను ప్రకటించేస్తే కెసియార్ గెలిచినట్లే తాను కూడా రెండోసారి గెలవచ్చన్నది చంద్రబాబు ఆలోచన. చంద్రబాబు ఆలోచన వరకూ బాగానే ఉందికానీ జనాలు ఏమి ఆలోచిస్తారో చూడాల్సిందే.