సతీష్ కే రాజంపేట టిక్కెట్టా ?

అవును పార్టీలో జరుగుతున్న పరిణామాలను గమనిస్తే అదే అనుమానం అందరిలోన మొదలైంది. తెలుగుదేశంపార్టీ ఎంఎల్ఏ మేడా మల్లికార్జునరెడ్డి వైసిపిలో చేరిన విషయం అందరికీ తెలిసిందే. ఎన్నికలకు ముందు జరిగిన ఈ పరిణామం చంద్రబాబును ఇబ్బంది పెట్టింది. అధికార పార్టీ ఎంఎల్ఏ ప్రధాన ప్రతిపక్షంలోకి మారటమన్నది నిజంగా చంద్రబాబుకు షాక్ అనే చెప్పాలి. అటువంటి రాజంపేట నియోకవర్గంలో మేడాకు ప్రత్యామ్నాయంగా కొత్త గట్టి అభ్యర్ధని రంగంలోకి దించాలని చంద్రబాబు నిర్ణయించారు. ఇప్పటికైతే రేసులో టిడిపి నేతలు బత్యాల చెంగల్రాయలు లాంటివాళ్ళు పోటీ పడుతున్నా చంద్రబాబు దృష్టంతా ఓ ఎన్ఆర్ఐమీదే ఉందట.

పార్టీలో నేతల్లో ఏ ఒక్కరికి టిక్కెట్టిచ్చినా మిగిలిన వాళ్ళు అభ్యర్ధి గెలుపుకు సహకరించేది అనుమానమే అని పార్టీ వర్గాలు చంద్రబాబుకు చెప్పాయట. ఇంటెలిజెన్స్ నివేదికలో కూడా అదే విషయం స్పష్టమైందని సమాచారం. అందుకనే తెరపైకి కొత్త అభ్యర్ధని పోటీలోకి దించితే బాగుంటుందని అనుకున్నారట. అందుకనే ఓ ఎన్ఆర్ఐని రంగంలోకి దింపాలని నిర్ణయించినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అమెరికాలోని తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా (తానా)కు అధ్యక్షుడిగా ఉన్న సతీష్ వేమనను రంగంలోకి దింపవచ్చని కూడా పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

చంద్రబాబుకు విదేశాలన్నా, ఎన్ఆర్ఐలన్నా ఎంత మోజో అందరికీ తెలిసిందే. పైగా చంద్రబాబుకు సతీష్ వేమన బాగా సన్నిహితుడనే ప్రచారం కూడా ఉంది. కాబట్టి సతీష్ ను రంగంలోకి దింపితే బాగుంటుందని అనుకుంటున్నారట. ప్రత్యక్ష రాజకీయాలకు సంబంధం లేని వ్యక్తి కాబట్టి, చంద్రబాబుకు బాగా సన్నిహితుడనే ముద్ర ఎటూ ఉంది కాబట్టి స్ధానిక నేతలందరూ మాట్లాడకుండా పార్టీ గెలుపుకు పని చేస్తారని చంద్రబాబు అంచనా వేస్తున్నారు. అయితే, నాలుగున్నరేళ్ళ పాలనలో చంద్రబాబు తీవ్ర ప్రజా వ్యతిరేకతను మూటకట్టుకున్న విషయం తెలిసిందే. పార్టీకి ఏమాత్రం సంబంధం లేని ఓ ఎన్ఆర్ఐని అందులోను షికాగో సెక్స్ స్కాండల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న సతీష్ ను ఎన్నికల్లో పోటీ చేయిస్తే జనాలు ఎలా ఓట్లేస్తారని అనుకున్నారో ?