చంద్రబాబును ఆ  సెంటిమెంటే భయపెడుతోందా

‘జగన్ వి రాజకీయ యాత్రలు..చిత్తశుద్ది లేదు’…జగన్ పాదయాత్రపై చంద్రబాబు తాజా స్పందన. జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చూసిన తర్వాత చంద్రబాబునాయుడు తెగ బాధపడిపోతున్నట్లే కనబడుతోంది. ఎందుకంటే 341 రోజుల పాటు 3648 కిలోమీటర్లు తిరగటమంటే మామూలు విషయం కాదు. 14 మాసాలు జనాల్లోనే ఉండటమంటే చిన్న విషయం కాదు. మానసికంగా ఎంతో ధృడంగా ఉంటేకానీ, ఎంతో కసి ఉంటేకాని సాధ్యంకాదు. జగన్ చేసిన పాదయాత్ర అధికారం కోసమే అనటంలో సందేహమే లేదు. అధికారం రాదని తెలిసిన తర్వాత కూడా వేల కిలోమీటర్ల పాదయాత్ర చేయటానికి జగన్ కేమన్నా పిచ్చా ? త్వరలో జరగనున్న ఎన్నికల్లో అధికారంలోకి రావాలన్న కసి, చంద్రబాబు మీద జనాల్లో ఉన్న వ్యతిరేకత నుండి లబ్దిపొందాలన్న ఆలోచన, అధికారంలోకి వస్తామన్న నమ్మకం ఉండబట్టే ఇంతటి సాహసం చేశారు.

మొత్తానికి జగన్ చేసిన పాదయాత్ర రాజకీయాల్లో కొత్త చరిత్రను సృష్టించిందనే చెప్పాలి. రాబోయే ఎన్నికల్లో జనాలు ఏ విధమైన తీర్పు ఇస్తారో చూడాల్సిందే. కానీ చంద్రబాబు మాత్రం విచిత్రంగా స్పందిస్తున్నారు. జగన్ చేసిన పాదయాత్రను, తిరగరాసిన చరిత్రను చాలా చిన్నదిగా చూపే ప్రయత్నం చేస్తున్నారు. చంద్రబాబు ప్రయత్నాలు చూస్తుంటే అభద్రతనే సూచిస్తోంది. వచ్చే ఎన్నికల్లో తిరిగి అధికారంలోకి వస్తామన్న నమ్మకమే ఉంటే అసలు జగన్ పాదయాత్రపై మాట్లాడాల్సిన అవసరమే లేదు.

పాదయాత్ర గురించి, జగన్ గురించి చాలా చీప్ గా మాట్లాడారు చంద్రబాబు. అలా మాట్లాడటంలోనే చంద్రబాబు అక్కసు బయటపడిపోతోంది. జగన్ పాదయాత్ర పేరుతో ప్రజల వద్దకు వెళ్ళటంలో తప్పులేదట. తాను కూడా గతంలో పాదయాత్ర చేసిన విషయాన్ని గుర్తుచేశారు. తాను చేసిన పాదయాత్ర పవిత్రభావంతో చేశానని చెప్పటమే విచిత్రంగా ఉంది. నాలుగు రోజులు జగన్ పాదయాత్ర చేస్తే రెండు రోజులు కోర్టుకు వెళ్ళటంతోనే సరిపోతోందంటూ ఎద్దేవా చేశారు. జగన్ ప్రతీ శుక్రవారం కోర్టుకు హాజరవుతున్నది వాస్తవమే. జగన్ కోర్టుకు హాజరవుతున్నారంటే అది ఆయన వ్యక్తిగతం. జగన్ కోర్టుకు హాజరవ్వటంలో చంద్రబాబు పుణ్యం కూడా ఉందన్న విషయం అందరికీ తెలిసిందే.

జగన్ ది రాజకీయ యాత్రలని, అందులో చిత్తశుద్ది లేదని చంద్రబాబు తీర్పిచ్చేశారు. జగన్ చేసిన పాదయాత్రలో చిత్తశుద్ది ఉందా లేదా అన్నది తీర్పు చెప్పాల్సింది జనాలే కానీ చంద్రబాబు కాదు. అయినా జగన్ పాదయాత్రను అంత హేళనగా మాట్లాడుతున్నారంటే జగన్ అంటే చంద్రబాబులో ఉన్న భయమే కనబడుతోంది. ఎందుకంటే, పాదయాత్ర అన్నది ఓ సెంటిమెంటుగా మారిపోయింది. వైఎస్ పాదయాత్ర చేసిన తర్వాతే సిఎం అయ్యారు. చంద్రబాబు కూడా పాదయాత్ర చేసిన తర్వాతే అధికారంలోకి వచ్చారు. ఇపుడు జగన్ విషయంలో కూడా అదే  సెంటిమెంటు వర్కవుటవుతుందేమో అన్న భయమే చంద్రబాబులో కనబడుతోంది.