ఎక్కడైనా ఓవర్ యాక్షన్ చేస్తే మొదటికే మోసం వస్తుందన్న విషయం అందరికీ తెలిసిందే. రాజకీయాల్లో ఓవర్ యాక్షన్ విషయంలో మరీ జాగ్రత్తగా ఉండాలి. అన్నీ పార్టీలు తమ వెంట పడుతున్నాయి కదా అని ఇష్టం వచ్చినట్లు ఆడితే మొదటికే మోసం రావటం ఖాయం. ఈ విషయం గతంలో చాలా సార్లు రుజువైంది. ఇదంతా ఎందుకంటే, కాకినాడకు చెందిన చలమలశెట్టి సునీల్ గురించే అని అర్ధమయ్యుంటుంది. తూర్పుగోదావరి జిల్లాలోని కాకినాడకు చెందిన సునీల్ సామాజికవర్గం పరంగా కానీండి ఆర్దికంగా కానీండి గట్టి స్ధితిలోనే ఉన్నారనే ప్రచారం జరుగుతోంది. కాబట్టి ఏ పార్టీలో అయినా టిక్కెట్టు రావటం చాలామంది నేతలకన్నా సులువే.
అయితే ఇక్కడే తేడా కొడుతోంది. 2009లో ప్రజారాజ్యంపార్టీ తరపున కాకినాడ ఎంపిగా పోటీ చేసి ఓడిపోయారు. తర్వాత కొంత కాలం రాజకీయాలకు దూరంగా ఉండి వైసిపిలో చేరారు. 2014లో వైసిపి తరపున పోటీ చేసి రెండోసారి కూడా ఓడిపోయారు. కొంతకాలం కాకినాడ పార్లమెంటు నియోజకవర్గానికి ఇన్చార్జిగా కార్యక్రమాలు చేశారు. తర్వాత ఏమైందో ఏమో జగన్ పాదయాత్ర సందర్భంగా జిల్లాలో ఎక్కడా కనబడలేదు. తర్వాత సునీల్ ను పార్టీ నుండి బయటకు పంపేశారు. తర్వాత మళ్ళీ రాజకాయాలకు దూరమైపోయారు.
మరికొద్ది రోజుల్లో 2019 ఎన్నికలు వస్తున్నాయి కదా ? అందుకనే మళ్ళీ రాజకీయాల్లో యాక్టివ్ అయ్యారు. టిడిపి అధినేత చంద్రబాబునాయుడును అమరవాతిలో కలిశారు. పార్టీలో చేరనున్నట్లు చెప్పారు. టిక్కెట్టు గురించి కూడా మాట్లాడుకున్నారు. ఏమైందో ఏమో వెంటనే జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ తో భేటీ అయ్యారు. జనసేనలో చేరుతున్నట్లు చెప్పారు. ఎవరితో భేటీ అయినా కాకినాడ పార్లమెంటు సీటులో టిక్కెట్టే ప్రధాన డిమాండ్. అందులో తప్పు కూడా లేదు. కానీ ఇక్కడే సునీల్ తో అందరికీ సమస్యలొస్తున్నాయని సమాచారం.
అదేమిటంటే, కాకినాడ పార్లమెంటు పరిధిలోని జగ్గంపేట అసెంబ్లీలో తన బంధువు ముత్యాల శ్రీనివాస్ కు ఇవ్వాలని కండీషన్ పెడుతున్నారట. నిజానికి ఏ పార్టీ అధినేతకైనా కండీషన్ పెట్టేంత సీన్ సునీల్ కు లేదు. సునీల్ దగ్గర డబ్బుండటమే ప్లస్ పాయింట్ అయితే డబ్బులున్నవారు బోలెడుమందుంటారు. జగన్ దగ్గర కుడా ఇలాగే మాట్లాడి వైసిపికి దూరమయ్యారు. తర్వాత చంద్రబాబుతో కూడా అలాగే బేరాలుపెట్టి మళ్ళీ తిరిగి చూడలేదు. ఇపుడు పవన్ తో కూడా అలాంటి బేరాలే పెడుతున్నట్లు వినికిడి. జనసేన అంటే అభ్యర్ధుల కొరతుంది కాబట్టి సునీల్ కండీషన్ ఏమైనా చెల్లుబాటవుతుందేమో తెలీదు. మొత్తానికి రాజకీయాలకే కొత్తైన సునీల్ కూడా అసెంబ్లీ టిక్కెట్ల విషయంలో సీనియర్లలాగ కండీషన్లు పెడితే మొదటికే మోసం వస్తుందని గ్రహిస్తే బాగుంటుంది.