కేసీయార్ సాయాన్ని కోరుతున్న చంద్రబాబు.?

ఆంధ్రప్రదేశ్‌లో భారత్ రాష్ట్ర సమితి పోటీ చేయడం దాదాపు ఖాయమైపోయింది. ఓ ఆరు ఎంపీ సీట్లలో బీఆర్ఎస్ పోటీ చేసే అవకాశం వున్నట్లు తెలుస్తోంది. అలాగే, 10 నుంచి 12 వరకు అసెంబ్లీ సీట్లలోనూ బీఆర్ఎస్ పోటీ చేయొచ్చన్న ప్రచారం జరుగుతోంది.

భారత్ రాష్ట్ర సమితి అనే పేరు ఖరారైనప్పుడే ఆంధ్రప్రదేశ్‌లో కేసీయార్‌కి మద్దతుగా పలు ఫ్లెక్సీలు వెలిశాయి. నిజానికి, కేసీయార్ జాతీయ ఆలోచన చేయక ముందు కూడా గులాబీ ఫ్లెక్సీలు ఆంధ్రప్రదేశ్‌లో రెపరెపలాడాయి.

గతంలో వైసీపీకి అనుకూలంగా పనిచేసింది ఆంద్రప్రదేశ్‌లో తెలంగాణ రాష్ట్ర సమితి. ఈ క్రమంలో వైసీపీ వ్యూహాత్మకంగానే గులాబీ జెండాలకు ఏపీలోకి తీసుకొచ్చింది. అయితే, ఆ తర్వాత పరిస్థితులు మారాయి. వైఎస్ షర్మిల నుంచి తెలంగాణలో కేసీయార్ పెద్ద తలనొప్పి ఎదుర్కొంటున్నారు. షర్మిలతో రాజకీయంగా వైసీపీకి సంబంధాల్లేవని వైసీపీ నేతలు చెబుతున్నా, వైసీపీ ప్రోద్భలంతోనే తెలంగాణలో వైఎస్ షర్మిల పార్టీ పెట్టారన్నది నిర్వివాదాంశం.

ఈ నేపథ్యంలో కేసీయార్‌ని తమవైపుకు తిప్పుకునేందుకు తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు ప్రయత్నిస్తున్నారు. ‘ఏపీలో మాకు సాయం చెయ్యండి.. తెలంగాణలో మీకు మేం సాయం చేస్తాం.?’ అంటూ చంద్రబాబు తాజాగా కేసీయార్‌కి బంపర్ ఆఫర్ ఇచ్చారట. అయితే, ఈ విషయమై కేసీయార్ ఇంతవరకు ఎలాంటి సమాధానం చంద్రబాబుకి చెప్పలేదంటున్నారు. కొన్ని చోట్ల భారత్ రాష్ట్ర సమితికి చెప్పుకోదగ్గ స్థాయిలో ఆంధ్రప్రదేశ్‌లో ఓట్లు దక్కుతాయన్న గట్టి నమ్మకం అయితే కేసీయార్‌కి వుంది.

రాజకీయంగా గత కొన్నాళ్ళ నుంచి సైలెంటయిపోయిన కొందరు నేతల్ని బీఆర్ఎస్ ద్వారా మళ్ళీ లైమ్‌లైట్‌లోకి తెచ్చేందుకు కేసీయార్.. ఏపీలో సరికొత్త రాజకీయాన్ని ప్రయోగించబోతున్నారట.