సుజనా పై సిబిఐ సీరియస్ ? రెండో నోటీసు

తనను విచారించేందుకు  జారీ చేసిన నోటీసులను కొట్టేయాలంటూ సుజనా చౌదరి కోర్టులో కేసు వేయటాన్ని సిబిఐ సిరీయస్ గా తీసుకుందట. మొదటి నోటీసుకు సమాధానం ఇవ్వకుండా తప్పించుకున్న సుజనాకు రెండోసారి కూడా నోటీసు జారీ చేసింది. మేనెల 4వ తేదీన బెంగుళూరులోని కార్యాలయంలో విచారణకు హాజరుకావాలంటూ తాజా నోటీసులో చెప్పింది.

బ్యాకుంలకు టోకరా వేయటం ద్వారా కోట్ల రూపాయల ప్రజాధనాన్ని  కొల్ల గొడతారు. ఏదో పేరుతో బ్యాంకుల నుండి వందలు, వేల కోట్ల రూపాయలు అప్పులుగా తీసుకుంటారు. కంపెనీల విస్తరణ పేరుతో అప్పులు తీసుకుంటారు కానీ చివరకు డొల్ల కంపెనీలకు తరలిస్తారు. చివరకు అప్పులూ కట్టరు, కంపెనీలను విస్తరించరు. ఇది స్ధూలంగా టిడిపి రాజ్యసభ సభ్యుడు, కేంద్ర మాజీ మంత్రి సుజనా చౌదరిపై ఉన్న ఆరోపణలు.

వివిధ బ్యాంకుల్లో దాదాపు రూ 8 వేల కోట్లు అప్పులు తీసుకుని ఎగొట్టిన చరిత్రుంది సుజనాకు. సుజనా కంపెనీలపై సిబిఐ దాడులు చేసినపుడు రబ్బర్ స్టాంపులు, లెటర్ హెడ్లు దొరికాయి. అవన్నీ ఎక్కడివంటే ఎవరూ చెప్పలేదు. మరింత లోతుగా దర్యాప్తు చేస్తే అవన్నీ డొల్ల కంపెనీలని, బ్యాంకుల నుండి తీసుకున్న అప్పు డబ్బును డొల్ల కంపెనీలకే తరలించారని సిబిఐ గుర్తించింది.

విచారణకు హాజరకమ్మని నోటీసులిస్తే స్టే కావాలంటూ తాజాగా సుజనా కోర్టుకెక్కారు. తనపై విచారణ జరిపాలనుకుంటున్న సిబిఐ అధికారాలనే ప్రశ్నిస్తున్నట్లుంది సుజనా వాదన.  జరిగిన కోట్లాది రూపాయల కుంభకోణంలో తన పాత్ర లేదంటున్న సుజనా అదే విషయాన్ని విచారణకు హాజరై చెప్పవచ్చు. కానీ అసలు విచారణ జరిపే అధికారమే సిబిఐకి లేదన్నట్లుగా అడ్డుగోలు వాదన మొదలుపెట్టారు. మరి సుజనా కేసుపై కోర్టు ఏమని స్పందిస్తుందో చూడాలి. చూడబోతే చంద్రబాబు దగ్గర సుజనా ట్రైనింగ్ బాగానే తీసుకున్నట్లు లేదూ ?