ఓటర్లు తప్ప అభ్యర్ధుల్లో లోకల్ ఎవరైనా ఉన్నారా ?

విశాఖపట్నం పార్లమెంటు నియోజకవర్గంలో మొదటి నుండి విచిత్రమైన పరిస్ధితి కనిపిస్తోంది. అక్కడ ఓటర్లు మాత్రమే లోకల్. పోటీ చేస్తున్న అభ్యర్ధుల్లో ఎక్కువమంది నాన్ లోకలే. ప్రస్తుతం పోటీ చేస్తున్న అభ్యర్ధుల విషయాన్ని చూస్తే చాలు బాగా అర్ధమవుతుంది. వైసిపి తరపున ఎంవివి సత్యనారాయణ పోటీ చేస్తున్నారు. టిడిపి తరపున శ్రీ భరత్ పోటీలో ఉన్నారు. జనసేన తరపున జేడి లక్ష్మీనారాయణ రంగంలో ఉన్నారు.  బిజెపి అభ్యర్ధి పురందేశ్వరి సొంతూరు అందరికీ తెలిసిందే. సరే ఇతర పార్టీల అభ్యర్ధులున్నా వారి ఊసే ఇక్కడ వినిపించటం లేదులేండి.

వైసిపి అభ్యర్ధిది గోదావరి జిల్లా. వ్యాపార రీత్యా వచ్చి విశాఖలో ఎంవివి రియాల్టర్ గా సెటిలయ్యారు. టిడిపి అభ్యర్ధి భరత్ తాత, మాజీ ఎంపి ఎంవివిఎస్ మూర్తిది కూడా విశాఖ కాదు. కాకపోతే భరత్ ఇక్కడ పుట్టారు లేండి. ఇక జనసేన అభ్యర్ధి జేడి లక్ష్మీనారాయణ సొంతూరు కర్నూలు జిల్లాలో ఉంది. బిజెపి అభ్యర్ధి దగ్గుబాటి పురంధేశ్వరిది కృష్ణాజిల్లా అని అందరికీ తెలిసిందే.

మొదటినుండి కూడా ఈ నియోజకవర్గం నాన్ లోకల్ కే పెద్ద పీఠ వేస్తోంది. సిట్టింగ్ ఎంపి కంభంపాటి హరిబాబుది కూడా ప్రకాశం జిల్లా. అంతకుముందు ఎన్నికల్లో గెలిచిన  ఎంపిలు తిక్కవరపు సుబ్బరామిరెడ్డి, నేదురుమల్లి జనార్ధనరెడ్డి, ఉమా గజపతిరాజుది కూడా విశాఖ కాదు. తిక్కవరపు, నేదురుమల్లి ఇద్దరిదీ నెల్లూరు జిల్లా అన్న విషయం తెలిసిందే. ఇక ఉమాగజపతిది అసలు ఈ రాష్ట్రమే కాదు కేరళలోని పాల్ఘాట్. అంతకుముందు పోటీ చేసిన భాట్టం శ్రీరామమూర్తి, కొమ్మూరు అప్పలస్వామి, ద్రోణంరాజు సత్యనారాయణలు స్ధానికలయ్యుంటారు.

అదేమిటో ఎప్పుడు ఎన్నికలు జరిగినా విశాఖపట్నం పార్లమెంటు స్ధానమంటే ఎక్కువసార్లు నాన్ లోకల్ నేతలే ఎగబడతారు. జనాలు కూడా అదేమానందమో కానీ నాన్ లోకల్ నేతలనే గెలిపిస్తారు. గెలిచారంటే మళ్ళీ పెద్దగా అందుబాటులో కూడా ఉండరు. ఆ విషయం తెలిసినా సరే నాన్ లోకలే ముద్దు. కాబట్టి ఓటర్లకు కూడా వేరే ఆప్షన్ లేదు. చూశారా విశాఖపట్నం నియోజకవర్గంలో ఓటర్లు మాత్రమే లోకల్.