సర్వే అంతా బోగస్సేనా ? పరువు పోయిందా ?

తెలుగుదేశంపార్టీకి జాకీలేసి లేపే ఓ మీడియా ప్రచురించిన సర్వే కథనం బొగస్సే అని తేలిపోయింది.  రాబోయే ఎన్నికల్లో టిడిపికి 135 అసెంబ్లీ సీట్లు వస్తాయని సదరు మీడియా  సర్వే కథనం ప్రచురించిన గంటల్లోనే అదంతా ఒట్టి బోగస్ అని తేలిపోవటం ఆశ్చర్యంగా ఉంది. ఏబిపి మీడియా కోసం లోక్ నీతి, సిఎస్ డిఎస్ సంస్ధ నిర్వహించిన సర్వే అంటూ కథనం వచ్చింది ఆంధ్రజ్యోతిలో. ఆ సర్వే కథనంపైనే ఇపుడు వివాదం మొదలైంది.

నిజానికి సర్వేలు జరిపిన ప్రతీ జాతీమ మీడియా కూడా వైసిపికే స్పష్టమైన ఆధిక్యత వస్తుందని తేల్చేశాయి. దాంతో టిడిపి శ్రేణుల్లో గుబులు మొదలైంది. పోలింగ్ తేదీ దగ్గర పడుతున్న కొద్దీ క్షేత్రస్ధాయిలో వాస్తవాలు కూడా జాతీయ మీడియా సర్వేలే నిజమనేట్లున్నాయి. ఇటువంటి సమయంలో చంద్రబాబుకు మద్దతుగా నిలబడే ఓ మీడియా పెద్ద ప్లాన్ వేసింది. అదేమిటంటే టిడిపికి 135 అసెంబ్లీ సీట్లు, 22 దాకా పార్లమెంటు సీట్లలో గెలుపు ఖాయమని చెప్పేసింది.

నిజానికి తాను ప్రచురిస్తున్న కథనం అంతా బోగస్ అని యాజమాన్యానికి కూడా తెలుసు. అలాంటపుడు ఏదో ఓ సర్వే పేరుతో సర్వే ఫలితాలను ప్రచురించేటపుడు సదరు సంస్ధ యాజమాన్యంతో ముందుకు మాట్లాడుకోవాలన్నది కనీస ఇంగితం. అలాంటిది తమిష్టం వచ్చిన సంస్ధల పేర్లుపెట్టేసి సర్వే ఫలితాలను ప్రచురించేస్తే ఆ సంస్ధ ఎందుకూరుకుంటుంది.

ఇక్కడ జరిగిందదే. లోక్ నీతి, సిఎస్ డిఎస్ జరిపిన సర్వే పేరుతో చాలా పెద్ద కథనాన్నే ప్రచురించేసింది. కథనం అచ్చయిన గంటల్లోనే సదరు సర్వే సంస్ధ యాజమాన్యం ట్విట్టర్ వేదికగా స్పందించింది. తమ సంస్ధల పేరుతో ప్రచురితమైన కథనానికి తమకు సంబంధం లేదని తేల్చేసింది. ఆ మీడియాలో వచ్చిందంతా బోగస్ సర్వేనే అని చెప్పేసింది. నిజానికి తప్పుడు సర్వేలు ప్రచురించినందుకు సదరు మీడియా సిగ్గుతో తలొంచుకోవాలి. కానీ అదే ఉంటే అసలా తప్పుడు సర్వే ఎందుకు ప్రచురిస్తుంది.