మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గత కొంతకాలంగా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తారని జోరుగా ప్రచారం జరగగా ఆ ప్రచారాన్ని నిజం చేస్తూ ఆయన పదవికి రాజీనామా చేశారు. కాంగ్రెస్ పార్టీ అవమానించడం వల్లే తాను రాజీనామా చేశానని రేవంత్ రెడ్డి కంట్రోల్ లో పని చేయడం తనకు అస్సలు ఇష్టం లేదని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వెల్లడించడం గమనార్హం. ప్రజల కోసమే రాజీనామా చేశానని కోమటిరెడ్డి చెప్పడం కొసమెరుపు.
అయితే మునుగోడు ఉపఎన్నికను తెలంగాణ రాష్ట్రంలోని అన్ని పార్టీలు సీరియస్ గా తీసుకున్నాయి. ఉపఎన్నిక ఫలితాలు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేసే ఛాన్స్ అయితే ఉందని అన్ని పార్టీల నేతలు భావిస్తున్నారు. తెలంగాణలో 2018 తర్వాత నాలుగు ఉపఎన్నికలు జరగగా రెండుసార్లు బీజేపీ విజయం సాధిస్తే రెండుసార్లు టీఆర్ఎస్ విజయం సాధించింది. పదవీకాలం పూర్తికాక ముందే కోమటిరెడ్డి రాజీనామా చేయడంతో ఉపఎన్నిక అనివార్యమైంది.
బలమైన నేత కావడంతో పాటు కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉండటం, తెలంగాణలో బీజేపీ పుంజుకోవడం ఆ పార్టీకి ప్లస్ అని చెప్పవచ్చు. ఈ ఉపఎన్నికలో గెలవడానికి బీజేపీ అన్ని ప్రయత్నాలు చేస్తోందని ఖర్చు విషయంలో బీజేపీ వెనుకాడటం లేదని బోగట్టా. కేసీఆర్ ఈ నియోజకవర్గంలో పెండింగ్ పనులను పూర్తి చేయడంతో పాటు బలమైన నేతలను పార్టీలోకి తీసుకుంటున్నారు. అభ్యర్థుల ఎంపిక, ప్రచారం విషయంలో కేసీఆర్ జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
కాంగ్రెస్ పార్టీ స్ట్రాటెజీ కమిటీని ఏర్పాటు చేసి ఉపఎన్నికలో గెలుపు దిశగా అడుగులు వేస్తోంది. అయితే కాంగ్రెస్ నుంచి అభ్యర్థి ఎంపిక మాత్రం కష్టంగానే మారిందని బోగట్టా. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా లేఖ స్పీకర్ ఆమోదం పొందితే ఎన్నికల కమిషన్ నుంచి నోటిఫికేషన్ వెలువడే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు. ఈ ఉపఎన్నిక అన్ని పార్టీలను తెగ టెన్షన్ పెడుతుండటం గమనార్హం.