జనసైనికుల కలను నిజం చేస్తూ… వారి ఆశలు నెరవేరుస్తూ… జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వారాహి రధాన్ని రోడ్ల మీదకు తెస్తున్నారు. ఈ నెల 14 నుంచి గోదావరి జిల్లాలలో భారీ టూర్ ప్లాన్ చేశారు. అన్నవరం టు భీమవరం వయా చించినాడ బ్రిడ్జ్ అన్నట్లుగా సాగనున్న ఈ యాత్రకు సంబంధించి ఇప్పటికే కో-ఆర్డినేటర్లను కూడా నియమించేశారు. అయితే తాజాగా పవన్ వెళ్తున్న రూట్లపై ఆసక్తికరమైన చర్చ నడుస్తుంది.
అన్నవరంలో పూజ అనంతరం వారాహి రధం తన ప్రయాణాన్ని కొనసాగించనుంది. ఈ సందర్భంగా వారాహి వెళ్ళే రూట్లును చూస్తే… ప్రత్తిపాడు, పిఠాపురం, కాకినాడ, కాకినాడ రూరల్, ముమ్మిడివరం, అమలాపురం, పి.గన్నవరం, రాజోలు… అనంతరం నరసాపురం, పాలకొల్లు, భీమవరం నియోజకవర్గాల్లో యాత్ర కొనసాగనుంది. వీటిలో నరసాపురం, పాలకొల్లు, భీమవరం పశ్చిమగోదావరి జిల్లాలోకి వస్తాయి.
అయితే… ఈ నియోజకవర్గాలను పవన్ ఎంపిక చేసుకున్నారా.. చంద్రబాబే గత ఎన్నికల ఫలితాలను పరిగణలోకి తీసుకుని ఆఫర్ చేశార అనే చర్చ నడుస్తున్న తరుణంలో… కొత్త అంశం తెరపైకి వచ్చింది. ఇవన్నీ తమకు బలమున్న సీట్లు అని జనసేన బలంగా భావిస్తోంది. ఈమేరకు తాజా సర్వే ఫలితాలు కూడా ఇదే విషయాన్ని వెళ్లడి పరిచాయని చెబుతుంది.
అయితే ఈ సందర్భంగా… ఈ సీట్లలో తామెంత బలంగా ఉన్నామో చెప్పే క్రమంలో చంద్రబాబుకు షాకిచ్చే స్టేట్ మెంట్స్ కూడా జనసేన నేతల వైపునుంచి రావడం గమనార్హం. అదేమిటంటే… పొత్తు లేకపోయినా కూడా ఇవి జనసేన గెలిచే సీట్లు అని! అవును… ప్రస్తుతం గోదావరి జిల్లాల్లోని జనసేన నేతలు, కార్యకర్తలు ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నారు. ఫలితంగా… “యాత్రలో ఎక్కడా టీడీపీ పేరు ప్రస్థావించకుండా జాగ్రత్తలు” తీసుకోబోతున్నారని తెలుస్తుంది.
అయితే పైన పేర్కొన్న సీట్లలోని కొన్నింటిలో టీడీపీకి గతమెంతో ఘనం అనే చరిత్ర ఉంది. దాంతో ఆ స్థానాలను వదులుకోవడానికి తమ్ముళ్లు సుముఖత వ్యక్తం చేయడం లేదు. అయితే అయితే జనసేన మాత్రం వ్యూహాత్మకంగా ఈ సీట్ల కోసమే రధయాత్ర చేస్తోంది అని తెలుస్తోంది. మరి పొత్తు పొడవకముందే మొదలైపోయిన ఈ కొత్త రచ్చ ఎలాంటి చర్చకు దారితీస్తోంది, ఫలితంగా ఎలాంటి ఫలితాలు ఇవ్వబోతోందనేది వేచి చూడాలి!