ఎన్నికలు సమయం దగ్గరపడుతుండటంతో అటు ప్రచారాలతో పార్టీలు, ఇటు రిపోర్టింగ్స్ తో మీడియా హడావిడి పెరిగిన నేపథ్యంలో… మరోపక్క ఆయా సంస్థల సర్వేల హల్ చల్ మొదలైంది. పైగా ఎన్నికలకు ఇంకా నెలన్నర రోజులు మాత్రమే సమయం అని అంటున్న నేపథ్యంలో… ఇప్పటివరకూ వచ్చిన సర్వే ఫలితాలు, తాజాగా విడుదలపైన ఫలితాలు ఒక విషయాన్ని మాత్రం స్పష్టంగా చెబుతున్నాయి.
వాస్తవానికి ఇప్పటివరకూ వచ్చిన సర్వేల్లో మెజారిటీ సర్వేల ఫలితాలు వచ్చే ఎన్నికల్లో వైసీపీదే విజయం అని స్పష్టం చేశాయి. ఇదే సమయంలో టీడీపీ – జనసేన గట్టిగా పుంజుకుంటాయని వెల్లడించాయి. అంటే… గతంలో వచ్చిన 151 స్థానాల్లో వైసీపీకి పాతిక నుంచి ముప్పై స్థానాలు కోల్పోవడం జరుగుతుందని.. గతంలో 23 స్థానాలకే పరిమితమైన టీడీపీ వాటిని రెట్టింపు చేసుకుంటుందని చెబుతున్నాయి.
ఇదే సమయంలో గతంలో ఒక్కస్థానానికే పరిమితమైన జనసేన కచ్చితంగా ఆ నెంబర్ ను పెంచుకుంటుందని సర్వే ఫలితాలు చెబుతున్నాయి. ఈ క్రమంలో తాజాగా ఇండియా టీవీ – సీ.ఎన్.ఎక్స్ ఒపీనియన్ పోల్ చేసిన సర్వే ఫలితాలను పరిశీలిస్తే… ఏపీలో మరోసారి వైసీపీనే అధికారంలోకి వస్తుందని తేల్చింది. ఇందులో భాగంగా… 2024 లోక్ సభ ఎన్నికల్లో వైసీపీకి 15 సీట్లు, టీడీపీకి 10 సీట్లు వచ్చే అవకాశాలున్నాయని తెలిపింది.
అంటే… 2019లో 22 ఎంపీస్థానాలు గెలుచుకున్న వైసీపీ ఈసారి సుమారు 7 ఎంపీ సీట్లను కోల్పోతుందని ఈ సర్వే ఫలితాలు చెబుతున్నాయన్నమాట. ఇదే సమయలో గత ఎన్నికల్లో 3 స్థానాలకే పరిమితమైన టీడీపీ.. ఈ సారి ఇంకో ఏడు స్థానాలను సాధించుకునే అవకాశం ఉందన్నమాట. ఈ నేపథ్యంలో ఈ లోక్ సభ స్థానాలను అసెంబ్లీ స్థానలకు కన్వర్ట్ చేసి ఒకసారి పరిశీలిస్తే… అసెంబ్లీ ఎన్నికల్లోనూ వచ్చే ఫలితాలపై ఒక అంచనా వచ్చే అవకాశం ఉంది.
ఇందులో భాగంగా… వైసీపీకి 105 అసెంబ్లీ సీట్లలో గెలిచే అవకాశం ఉండగా.. టీడీపీ – జనసేన కూటమికి 70 స్థానాలు దక్కే అవకాశం ఉందన్నమాట. ఈ లెక్కన చూసుకుంటే… ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవసరం అయిన మ్యాజిక్ ఫిగర్ 88 కంటే 17 సీట్లు ఎక్కువగా వైసీపీ సాధిస్తుందని తెలుస్తుంది. ఇదే సమయంలో మ్యాజిక్ ఫిగర్ కంటే 18 స్థానాలు తక్కువగా టీడీపీ – జనసేన కూటమి దక్కించుకుంటుందని ఒక క్లారిటీకి రవొచ్చు!
ఏది ఏమైనా… వచ్చే ఎన్నికల్లో వైసీపీనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశాలు పుష్కలంగా, క్లియర్ గా ఉండటంతోపాటు… టీడీపీ – జనసేన కూటమి కూడా గత ఎన్నికలతో పోలిస్తే రెట్టింపుకు మించి బలపడే అవకాశాలున్నాయని తెలుస్తుంది. తాజాగా వెలువడిన ఈ అంచనాలు… ఏపీలో ప్రస్తుత పరిస్థితికి దగ్గరగా ఉన్నాయనే మాటలు పరిశీలకుల వద్ద నుంచి వినిపిస్తుండటం గమనార్హం!!