టిడిపి ఎంపీ సీఎం రమేష్ కి దెబ్బ మీద దెబ్బ తగిలింది. గత కొద్ది రోజులుగా ఆయనకు ఎదురైనా పరిణామాలు ఆయనను ప్రొద్దుటూరు రాజకీయాల్లో ఒక మెట్టు కిందకి పడేలా చేసాయి అని చెప్పొచ్చు. ప్రొద్దుటూరు వర్గపోరు నేపథ్యంలో కూడా ఆయనకీ ఊహించని షాక్ ఎదురైంది. ఇప్పుడు ఐటి దాడుల ఎఫెక్ట్ కలవర పెట్టిస్తోంది. ఎలక్షన్స్ దగ్గర పడుతున్న నేపథ్యంలో ఈ అంశాలన్నీ ఓటు బ్యాంకుపై ప్రభావితం చేసే అవకాశం లేకపోలేదు. దీనిపై పూర్తి కథనం కింద చదవండి.
ప్రొద్దుటూరు కౌన్సిలర్ల రాజీనామా ఎఫెక్ట్:
ప్రొద్దుటూరులో కౌన్సిలర్ల మూకుమ్మడి రాజీనామా సంచలనం రేపింది. ఈ వ్యవహారంతో ప్రొద్దుటూరు టిడిపి లో వర్గపోరు భగ్గుమంది. మరోసారి వరదరాజులు రెడ్డి, సీఎం రమేష్ ల మధ్య ఉన్న ఆధిపత్య పోరు తెరపైకి వచ్చింది. సీఎం రమేష్ వర్గ కౌన్సిలర్లంతా వరదరాజులరెడ్డి తీరుకు నిరసనగా రాజీనామా చేశారు. వరదరాజులరెడ్డి వ్యవహారం సీఎం దృష్టికి తీసుకెళ్లాలని, పార్టీ బాగు కోసమే చేస్తున్నట్టు వారు తెలిపారు. దీంతో వరదరాజులు రెడ్డికి చెక్ పెట్టొచ్చు అని భావించారు. కానీ సీన్ రివర్స్ అయింది. అధిష్టానం ఝలక్ ఇచ్చింది.
ఈ విషయంపై వారితో మాట్లాడిన చంద్రబాబు నేతలకు చీవాట్లు పెట్టారు. నేతలే రోడ్డెక్కి ఇలా వ్యవహరిస్తే ప్రజలు అసహ్యించుకుంటారని అన్నారు. సమస్య ఉంటే కూర్చుని మాట్లాడుకోవాలి కానీ వీధికెక్కడం ఏమిటని మందలించారు. త్వరలోనే అభ్యర్థిని ప్రకటిస్తామని తెలిపారు. అప్పటివరకు నియోజకవర్గం బాధ్యతలు మంత్రి ఆదినారాయణరెడ్డి చూసుకుంటారని వెల్లడించారు.
మాజీ ఎమ్మెల్యే లింగారెడ్డి, వరదరాజులు రెడ్డి, రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్, మున్సిపల్ చైర్మన్ రఘువీరారెడ్డిలతో కూడిన కమిటీని వేస్తున్నామని చెప్పారు. అభ్యర్థిని అనౌన్స్ చేసేవరకు అన్ని వ్యవహారాలు ఈ కమిటీనే నిర్వర్తిస్తుందని తెలిపారు. ఈ అంతర్గత పోరులవల్ల పార్టీ స్థానికంగా బలహీన పడుతుందని, ప్రత్యర్థి పార్టీకి బలం చేకూరుతుందని హెచ్చరించినట్టు సమాచారం. పార్టీకి నష్టం తెచ్చేవారిని మోసే పరిస్థితి లేదని వార్నింగ్ ఇచ్చారు.
అభివృద్ధికి పోటీ పడి పని చేయకుండా వివాదాలు పడితే ప్రజల్లో చులకన అవుతారని హితవు పలికారు. ఆ ఎపిసోడ్ తో ఒకింత టిడిపి నేతలపై ప్రజలు కూడా అసంతృప్తి కనబరిచారు. ఈ మొత్తం డ్రామాలో టిడిపి పై స్థానికంగా కొంతమేర నెగటివ్ ఇమేజ్ పడిందనే చెప్పొచ్చు.
ఐటి దాడులు ఎఫెక్ట్
ఇప్పటికే వర్గపోరుతో ఇమేజ్ డౌన్ అయిన సీఎం రమేష్ కి ఐటీ దాడులు మరొక దెబ్బ అని చెప్పవచ్చు. స్థానికంగా టిడిపి ఇమేజ్ మరింత డౌన్ అయ్యే ప్రమాదం ఉంది. బిజెపి కుట్రగా ఐటి దాడులను ఖండిస్తున్నప్పటికీ నిప్పులేనిదే పొగ ఎలా వస్తుంది అనుకుంటున్నారట జనం.
ఆయన చూపించిన ఆదాయానికి లెక్కలకు పొంతన లేకపోవడంతోనే ఐటి దాడులు జరిగాయని జోరుగా ప్రచారం సాగింది. ఈ ఎఫెక్ట్ ఎన్నికలపైన పడే అవకాశం లేకపోలేదు. ఈ రెండు అంశాలతో టిడిపి స్థానికంగా బలహీనపడిందని చర్చలు జరుగుతున్నాయి. ఎన్నికల్లో గట్టి దెబ్బే తగులుతుంది అనికుంటున్నారు జనం. ఇక సీఎం రమేష్ ఇళ్లపై జరిగిన ఐటి దాడుల వివరాలు కింద ఉన్నాయి చదవండి.
ఐటి దాడులు వివరాలు
టిడిపి ఎంపీ సీఎం రమేష్ ఇంటి పై ఐటి అధికారులు దాడులు నిర్వహించారు. కడప జిల్లా ఎర్రగుంట మండలం పోట్ల దుర్తిలోని ఇంటి పై కూడా అధికారులు దాడులు జరిపారు. హైదరాబాద్ లోని రమేష్ ఇంటి పై 10 మంది ఐటి అధికారులు సోదాలు నిర్వహించారు. ఏక కాలంలో 25 నుంచి 30 చోట్ల 100 మంది ఐటి అధికారులు దాడులు జరిపారు. ఆయన చూపించిన ఆదాయానికి, లెక్కలకు పొంతన లేకపోవడంతో ఐటీ అధికారులు సోదాలు చేపట్టినట్టు తెలుస్తోంది. ఆస్తుల పత్రాలు, ఇతర డాక్యుమెంట్లను అధికారులు స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తోంది.
ఈరోజు ఉదయం 8 గంటల సమయంలో పోట్లదుర్తిలోని సీఎం రమేశ్ నివాసానికి 15 మంది ఐటీ అధికారులు చేరుకున్నారు. ఆ సమయంలో రమేశ్ సోదరుడు సీఎం సురేశ్ మాత్రమే ఇంట్లో ఉన్నారు. అధికారులు ఆయన్ని బయటకు పంపించివేసి ఇంటి తలుపులు మూసివేశారు. ఐటీ అధికారులు అన్ని గదుల్లోనూ తనిఖీలు చేపడుతూ పలు దస్త్రాలను పరిశీలించినట్టు సమాచారం. మరోవైపు జూబ్లీహిల్స్‌లోని సీఎం రమేశ్ నివాసంతో పాటు ఆయనకు చెందిన రుత్విక్ అనే సంస్థ కార్యాలయాల్లో ఐటీ అధికారులు సోదాలు జరిపారు.