పవన్ కళ్యాణ్‌ని మర్చిపోవడమే వైఎస్ జగన్‌కి క్షేమమా.?

ఓ కొత్త వాదన తెరపైకొచ్చింది. నిజానికి, ఇది కొత్త వాదన కాదు. పాత వాదనే.! రాజకీయాలన్నాక విమర్శలు మామూలే. సో, జనసేన పార్టీ మీద విమర్శలు చేయకూడదంటూ వైసీపీ గురించి ఎలా ఎవరైనా ఉచిత సలహాలు ఇవ్వగలరు.? జనసేన ఏమన్నా వైసీపీని విమర్శించకుండా వుంటుందా.?

కాకపోతే, 175 లోక్ సభ నియోజకవర్గాల్నీ ఈసారి గెలిచేస్తామన్న ధీమాతో వున్నప్పుడు, జనసేన పార్టీని ‘ఇగ్నోర్’ చేయడమే వైసీపీకి చాలా చాలా మంచిది. ఇదే విషయాన్ని ఇటీవల వైసీపీకి చెందిన కొందరు ముఖ్య నేతలు, తమ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి తెలియజేసేందుకు ప్రయత్నించారట.

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పేరుని నేరుగా ప్రస్తావించడానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అస్సలు ఇష్టపడరు. అందుకే, ‘దత్త పుత్రుడు’ అంటూ విమర్శిస్తుంటారు పవన్ కళ్యాణ్‌ని వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.

రాను రాను ఈ ‘దత్త పుత్రుడు’ అన్న విమర్శ ఫేడవుట్ అయిపోతూ వస్తోంది. ఈ విమర్శల వల్ల వైసీపీ నానాటికీ ప్రజల్లో చులకన అయిపోతోంది. ‘పవన్ కళ్యాణ్‌ని రాజకీయంగా తప్పు పట్టడానికేమీ లేదు గనుక, వైసీపీ ఆ దత్త పుత్రుడు ప్రస్తావన తెస్తోంది. పెళ్ళిళ్ళ ప్రస్తావన కూడా అంతే..’ అన్న మాట జన బాహుళ్యంలోకి గట్టిగా వెళ్ళిపోయింది.

ఏ అధికార పార్టీకి అయినా, ప్రజల్లో కొంత వ్యతిరేకత ఖచ్చితంగా వుంటుంది. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలితే, అధికార పార్టీకి అనుకూలం. అలా చీలకూడదని జనసేన వ్యూహం పన్నింది. దాన్ని సహజంగానే వైఎస్ జగన్ జీర్ణించుకోలేకపోతున్నారు.

కానీ, జనసేనను టార్గెట్ చేసే విధానం ఇది కాదు.! ఇదే విషయాన్ని జగన్‌కి తెలియజేసేందుకు వైసీపీ సీనియర్లు కొందరు ప్రయత్నిస్తున్నప్పటికీ ఫలితం వుండటంలేదు. వైఎస్ జగన్ ఈ విషయమై పునరాలోచన చేస్తే మంచిది. లేదంటే, అది ‘కాస్ట్‌లీ మిస్టేక్’ అవ్వొచ్చు.