ప్రతిపక్షమైనా..జనాల్లో బలం లేకపోయినా పార్టీ అయినా ? అర్ధవంతమైన ప్రశ్న వేసినప్పుడు స్పందిచాల్సిన అవసరం ప్రభుత్వంపై తప్పక ఉంటుంది. అధికార పక్షంపై విమర్శలు, ఆరోపణలు సహజం. కానీ వాటితో సంబంధం లేకుండా ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజల తరుపున ప్రశ్నించిన పార్టీలకు తప్పక సమాధానం చెప్పి తీరాల్సిందే. ఆ బాధ్యత ఎలాంటి ప్రభుత్వంపైనైనా ఉంటుంది. ఇక్కడ పార్టీలతో సంబంధం లేకుండా ప్రభుత్వాలు సమాధానం చెప్పాలి. సరిగ్గా ఇప్పుడు అదే పరిస్థితి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ఎదురైంది. ఎక్కడ తప్పించుకున్నా ఇక్కడ తప్పించుకోవడానికి ఆస్కారం లేకుండా జనసేనాని పవన్ కళ్యాణ్ సూటిగా నే ఓ ప్రశ్నకు జవాబు చెప్పి తీరాలని డిమాండ్ చేస్తున్నారు. ఇంతకీ జనసేనాని డిమాండ్ ఏంటి? జగన్ మోహన్ రెడ్డి చెప్పాల్సిన సమాధానం దేనికి? అంటే అసలు మ్యాటర్లోకి వెళ్లాల్సిందే.
ఏపీలో భవన నిర్మాణ రంగ కార్మికుల కోసం ప్రభుత్వం ఓ నిధిని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. దీనికి భారీగానే నిధులు సమకూరాయి. అయితే జగన్ సర్కార్ ఈ నిధిలోని 450 కోట్ల రూపాయల్ని ఇతరత్రా అంశాలకు ఖర్చు చేసిందిట. మరి ఈ విషయం పవన్ కళ్యాణ్ కి ఎలా తెలిసిందో? ఏమో గానీ! భవన నిర్మాణ కార్మికులకే చెందాల్సిన నిధుల్ని ఎందుకు దారి మళ్లించారో చెప్పాలని డిమాండ్ చేసారు. ఇలాంటి పరిస్థితి కేవలం జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత…కొత్త ఇసుక విధానం అమలులోకి వచ్చిన తర్వాతే వచ్చిందని మండిపడ్డారు.
ఎన్నడులేని ఆర్ధిక ఇబ్బందుల్ని భనవ నిర్మాణ కార్మికులు ఎదుర్కున్నారని..కొంతమందైతే ఆ బాధలు తాళ్లలేక ఆత్మహత్యలే చేసుకున్నారన్నారు. అలా ఏర్పాటైన నిధిని వాళ్ల కోసం వాడకుండా సొంత అవసరాలకు వాడుకున్నారని ఆరోపించారు. ఇది కార్మిక ఉల్లంఘన చట్టం కిందకు వస్తుందన్నారు. దీనికి ప్రభుత్వం వెంటనే సమాధానం చెప్పాలని డిమాండ్ చేసారు. మరి పవన్ ఆరోపణలు నిజమే అయినా? ప‌్రభుత్వం ఇతర అవసరాల కోసం నిధులు మళ్లించడం నిజమే ? అయితే! దీనికి కచ్చితంగా జగన్ మోహన్ రెడ్డి సమాధానం చెప్పాల్సిందే.