రేపు (జూలై 24)న ఢిల్లీలో వైఎస్ జగన్ నిరసన తెలపనున్న సంగతి తెలిసిందే. ఏపీలో కూటమి ప్రభుత్వం కొలువుదీరినప్పటి నుంచీ జరుగుతున్న దాడులు, అత్యాచారాలు, హత్యలు, దారుణాలు, అకృత్యాలు, ఆటవిక చర్యలకు నిరసనగా “హత్యా రాజకీయాలు ఆపాలి” అంటూ జగన్ హస్తిన వేదికగా తన ఆవేదనను వినిపించనున్నారు. ఈ మేరకు ఈరోజు వైసీపీ నేతలు, శ్రేణులూ హస్తినకు బయలుదేరనున్నట్లు తెలుస్తోంది.
ఈ నేపథ్యంలో… ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోడీ అపాయింట్మెంట్ కోరారు జగన్. ఈ సమయంలో జగన్ కు మోడీ అపాయింట్ మెంట్ ఇస్తే అది ఏపీలో కూటమి నేతలకు పెద్ద సమస్యే అనే మాటలు వినిపిస్తున్నాయి. పైగా.. కేంద్రంలో బీజేపీకి జగన్ చేసిన సహాయాలకు అపాయింట్మెంట్ ఇవ్వాల్సిందే అనే మాటలూ వినిపిస్తున్నాయి. ఒక వేళ జగన్ కు మోడీ అపాయింట్మెంట్ ఇవ్వకపోతే అది మోడీకి పెద్ద సమస్య అనే కొత్త చర్చ తాజాగా తెరపైకి వచ్చింది.
అవును… జగన్ కు మోడీ అపాయింట్మెంట్ ఇస్తే సంగతి కాసేపు పక్కనపెడితే… ఇవ్వకపోతే అనే చర్చ తెరపైకి వచ్చింది. ఈ నేపథ్యంలో జగన్ కు మద్దతు పలికే ఇండియా కూటమిలోని తృణముల్ కాంగ్రెస్, డీఎంకే, శరద్ పవార్ పార్టీలు… రాహుల్ తో భేటీ అరేంజ్ చేసే అవకాశాలున్నాయనే ఓ చర్చ ఇప్పుడు పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది. ఇప్పటికిప్పుడు జగన్, ఇండియా కూటమిలో చేరిపోకపోయినా.. రాజ్యసభలో వారికి మద్దతు ఇస్తే సరిపోతుందనేది కండిషన్ అయ్యే అవకాశం ఉంది.
ప్రస్తుతం రాజ్యసభలో బీజేపీ బిల్లులు పాస్ చేయించుకోవాలంటే… కచ్చితంగా జగన్ కి ఉన్న 11 మంది ఎంపీల మద్దతు అవసరం అనే మాటలు వినిపిస్తున్నాయి. ఇదే సమయంలో… రేపు ఢిల్లీలో జగన్ కు ఎవరు మద్దతుగా నిలబడతారు అనేదీ చర్చనీయాంశం అవుతుంది. పైగా… ప్రతిపక్షంలోకి వచ్చేసిన తర్వాత జగన్ చేపడుతున్న ఈ కార్యక్రమం… రాష్ట్ర స్థాయి నుంచి జాతీయ స్థాయి వరకూ తీవ్ర చర్చనీయాంశం అయ్యేలా ప్లాన్ చేస్తున్నారని చెబుతున్నారు.
ఈ నేపథ్యంలో ఢిల్లీలో జగన్ నిరసనకు ఏన్నో కొన్ని పార్టీల మద్దతు అయితే అవసరం అనే చెప్పాలి. ఉంటే… మంచిదని కూడా అనుకోవచ్చు. ఈ నేపథ్యంలో జగన్ కు ఇండియా కూటమిలోని పార్టీలు కొన్నైనా మద్దతుగా నిలిస్తే.. అంతకంటే ముందు రాహుల్ గాంధీని జగన్ కలిస్తే ఇది కచ్చితంగా జాతీయ రాజకీయాల్లో అత్యంత కీలక పరిణామంగా మారే అవకాశం ఉందని అంటున్నారు.
రాజకీయాల్లో శాస్వత శత్రువులూ, శాస్వత మిత్రులూ ఉండరు కాబట్టి… ఈ విషయంలో జగన్ ఎలాంటి ఆలోచన చేస్తారు అనేది ఆసక్తిగా మారింది. అదే జరిగితే షర్మిళ నోటికి తాళం పడటంతో పాటు.. ఇండియా కూటమి పూర్తి మద్దతు జగన్ పోరాటాలకు ఉండే అవకాశం ఉందని అంటున్నారు. అదే జరిగితే… ఇప్పటికే అంపశయ్యపై ఉందని చెబుతున్న బీజేపీకి కచ్చితంగా పెద్ద డ్యామేజ్ అని చెబుతున్నారు. మరి జగన్ ఏమి ఆలోచిస్తారో వేచి చూడాలి!