ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో… పొత్తులో భాగంగా జనసేనకు 24 సీట్లు కేటాయించడంపై తీవ్ర చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో… ఇంతకాలం పార్టీ కోసం అహర్నిశలు పాటుపడిన వారు.. ఆర్థికంగా ఎంతో వ్యయప్రయాసలకు ఓర్చిన వారు.. కాపులకు రాజ్యాధికారం వస్తాదని ఎన్నో ఆశలు పెట్టుకున్నవారు.. పదేళ్లుగా జెండా మోస్తున్నవారు.. కాపుల మేలు కోరేవారు ఈ విషయాన్ని తీవ్రంగా ఖండిస్తున్నారు!
ఈ నేపథ్యంలో ఇంతకాలం పార్టీ కోసం నిజాయితీగా పనిచేసినవారు పవన్ కల్యాణ్ పై తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు. కార్యకర్తల అభిప్రాయాలు, కోరికలు, లక్ష్యాలను దృష్టిలో ఉంచుకుని పవన్ వ్యవహరిస్తారని భావించినట్లు చెబుతున్నారు. చంద్రబాబు క్షేమం కోసం ఒంటెద్దుపోకడలకు పోతారని వారు భావించకపోవడం వ్యవహారం చివరి నిమిషం వరకూ వచ్చే వరకూ తెలియలేదని అంటున్నారు. ఈ సమయంలో హైపర్ ఆదీ రియాక్ట్ అయ్యారు.
ఇందులో భాగంగా.. నిన్నమొన్నటి వరకూ జెండా మోసిన కార్యకర్తలే.. ఇప్పుడు ఆ జెండాను నేలపై పడేసి, నిప్పంటిస్తుంటే చాలా బాదగా ఉందని చెప్పుకొచ్చారు. డబ్బుల కోసం పార్టీని, కులాన్ని అమ్ముకునే వ్యక్తి పవన్ కల్యాణ్ కాదని అన్నారు. గత పదేళ్లుగా ఎలాంటి అవినీతికీ పాల్పడకుండా పార్టీని నడుపుతున్న వ్యక్తి పవన్ అని కొనియాడారు. దీంతో అసలు సిసలు జనసైనికులు ఆదిపై నిప్పులు కక్కుతున్నారని తెలుస్తుంది.
10ఏళ్లు భుజంపై మోసిన జెండాను నేలపై వేసి తొక్కే స్థాయిలో కార్యకర్త మనసు విరిగిపోయిందంటే… పవన్ చేసిన పని ఎంత దారుణమైందో అర్ధం చేసుకోవాలని ఆదికి సూచిస్తున్నారు. గత పదేళ్లుగా ఎలాంటి అవినీతి చేయలేదని అంటున్నారు.. అధికారంలో లేకుండా, కనీసం ఎమ్మెల్యే కూడా కాకుండా అదెలా సాధ్యమని ప్రశ్నిస్తున్నారు!! చంద్రబాబు ఎటువంటి అవినీతీ చేయలేదు కాట్టి.. పవన్ కల్యాణ్ ఆయనతో కలిశారని ఆది చెప్పాలనుకున్నారా అనేది మరో ప్రశ్న!
ఇదే సమయంలో… తన పిల్లల కోసం దాచిన డబ్బుని కౌలు రైతులకు పంచిన మహానుబావుడు పవన్ కల్యాణ్ అని అంటున్నారు హైపర్ ఆది. దీంతో… పవన్ కల్యాణ్ తన సంపాదనలో గరిష్టంగా 10శాతం ఓట్ల కోసం ఖర్చు పెట్టి ఉండొచ్చు… కానీ తాము పార్టీ కోసం తమకున్న దానికంటే ఎక్కువగా.. అప్పులు చేసి మరీ ఖర్చుపెట్టాము.. ఇందులో ఎవరు ఎక్కువ త్యాగం చేశారో తెలుసుకునే జ్ఞానం హైపర్ ఆదికి ఆ భగవంతుడు కలిగించాలని.. పలువురు జనసైనికులు కోరుతున్నారని తెలుస్తుంది!
ఇదే సమయంలో రెండు చోట్ల పోటీ చేస్తే కనీసం ఒక్క చోట కూడా గెలిపించుకోలేకపోయిన జనసైనికులకు.. ఇప్పుడు అన్ని సీట్లు తీసుకో, ఇన్ని సీట్లు తీసుకో అని అడిగే హక్కు లేదన్నట్లుగా హైపర్ ఆది వ్యాఖ్యానించారు! దీంతో… హైపర్ ఆదికి రాజకీయ జ్ఞానం మరీ స్వల్పం అనిపిస్తుందనే కామెంట్ చేస్తున్నారు పరిశీలకులు. ఏ నియోజకవర్గంలోని ఏ నాయకుడూ కేవలం ఒక పార్టీ కార్యకర్తలు ఓట్లు వేస్తేనో, ఒక సామాజిక ఓటర్లు ఓట్లు వేస్తేనో గెలిచిపోరు!
అన్ని సామాజికవర్గాల ఓటర్ల మనసు గెలుచుకునే ప్రయత్నం చేస్తేనే… అంతా కలిసి తలోచెయ్యి వేస్తే… సదరు అభ్యర్థి ఎమ్మెల్యే అవుతాడు. 2019లో గెలిపించుకోలేదు కాబట్టి… ఇప్పుడు పవన్ పాతిక లోపు టిక్కెట్లకు తలాడించినా.. మీరు కూడా తలాడించాలని హైపర్ ఆది ఫుల్ టైం జనసైనికులకు సూచించడంపై పలువురు ఎద్దేవా చేస్తున్నారని అంటున్నారు. ఈటైపు రాజకీయ జ్ఞానం చాలా ప్రమాదమని సూచిస్తున్నారని సమాచారం.
ఉదాహరణకు… టీడీపీకి ఇప్పుడు 24 సీట్లు ఇబ్బంది వచ్చింది. బీజేపీ కూడా కలిస్తే మరికొన్ని సీట్లలో ఇబ్బంది రావొచ్చు. అంతమాత్రన్న.. చంద్రబాబు మైకుల ముందుకు వచ్చి.. గత ఎన్నికల్లో 23 మాత్రమే గెలిపించారు.. అలాంటి మీకు 175 స్థానాల్లోనూ టీడీపీనే పోటీ చేయాలని ప్రశ్నించే హక్కు లేదు అని అడిగితే అంతకు మించిన అజ్ఞానం ఉంటుందా?
2014లో ప్రతిపక్షానికి పరిమితమైన జగన్… 2019లో చరిత్ర సృష్టిచడానికి రెడ్డి సామాజికవర్గం, వైసీపీ కార్యకర్తలు మాత్రమే కారణమా? సమాజంలోని అన్ని సామాజికవర్గాల ప్రజానికం నమ్మితే.. వారిని ఒప్పించగలిగే శక్తి నాయకుడు అనేవాడికి ఉంటే.. ఫలితం కచ్చితంగా వస్తుంది! పంచన బ్రతికేద్దాం అనుకునేవారికి ఎప్పటికీ రాదు అనేది ఈ సందర్భంగా పలువురి అభిప్రాయంగా ఉంది!
ఇదే సమయంలో మరో లాజిల్ లాగారు హైపర్ ఆది! పవన్ డబ్బులకు అమ్ముడైపోయే వ్యక్తి అయితే… టీడీపీ కంటే వైసీపీ వద్దే ఎక్కువ డబ్బు ఉంటుంది.. మరి వాళ్లు ఎందుకు కొనుక్కోలేదో ఆలోచించండి అన్నట్లుగా జనసైనికులను ప్రశ్నించారు! ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే… ఐదేళ్లు అధికారంలో ఉన్న వైసీపీ వద్దే ఎక్కువ డబ్బు ఉంటే… 14ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన బాబు వద్ద ఇంకా ఎక్కువ ఉంటుంది కదా? హైపర్ ఆది మళ్లీ లాజిక్ మిస్స్ అనేది ఇక్కడ వినిపిస్తున్న కామెంట్!!
ఏది ఏమైనా… తన వ్యక్తిగత అవసరాలకోసమో., లేక తనకు ఉన్న రాజకీయ పరిజ్ఞానం మేరకో., అదీగాక.. పవన్ పై సొంత అభిమానులే నిప్పులు కక్కుతుంటే చూడలేకో కానీ హైపర్ ఆది స్పందించడం వరకూ ఓకే కానీ… ఆ స్పందనలో జనసైనికులపై సంధించిన ప్రశ్నలు, చేసిన సూచనలు మాత్రం… అసలు సిసలు కార్యకర్తలకు మంట పుట్టించేలా ఉన్నాయని.. గెస్ట్ అప్పీరియన్స్ కార్యకర్తలకు ఈ బాధ అర్ధం కాదని అంటున్నారని తెలుస్తుంది!!