విశాఖపై హెచ్‌సీయూ షాకింగ్ రిపోర్ట్..!

ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చాక అభివృద్ధి వికేంద్రీకరణ పేరుతో మూడు రాజధానుల ప్రతిపాదనను తెరపైకి తీసుకొచ్చింది. విశాఖను ఏపీకి ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్‌గా చేయాలని ప్రభుత్వం అనుకున్నప్పటి నుంచి అటు రాజధాని అమరావతి రైతుల నిరసనలు, ప్రతిపక్షాల నుంచి అడ్డంకులు, వరుస ప్రమాదాలు జరుగుతున్నా ప్రభుత్వం మాత్రం ఈ విషయంలో వెనకడుగు వేయడం లేదు. ఎలాగైనా విశాఖను ఏపీ పరిపాలన రాజధానిగా మార్చేందుకు సిద్దమయ్యిది. వీటికి సంబంధించిన బిల్లులు కూడా ఇప్పటికే ఏపీ గవర్నర్ వద్దకు వెళ్లాయి.

అయితే ఇలాంటి తరుణంలో విశాఖపై HCU (హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ) ఓ షాకింగ్ రిపోర్ట్‌ను బయటపెట్టంది. కృష్ణా గోదావరి బేసిన్ పరిధిలో ఫాల్ట్ లైన్ (భ్రంశ రేఖ) ఉందని ఆ కారణంగా విశాఖలో భూకంపాలు, సునామీ ముప్పు పొంచి ఉందని అధ్యయనంలో వెల్లడించింది. నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఓషనోగ్రఫీ మరియు హైదరాబాద్‌ సెంట్రల్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు కలిసి చేసిన అధ్యయనంలో ఈ అంశాన్ని బయటపెట్టారు. గోదావరి ప్రాణహిత గ్రాబెన్‌ నుంచి నాగావళి వంశధార షియర్‌జోన్‌ వరకు చీలిక ఏర్పడిందని అన్నారు. అయితే నదుల నుంచి సముద్రంలోకి నీరు వెళ్ళే క్రమంలో ఎన్నో రకాల వ్యర్థాలు వచ్చి అందులో చేరుతుంటాయని ఇలా జరుగుతుండడం వలన సముద్ర గర్భంపై లక్షలాది టన్నుల అదనపు భారంపడి ఒత్తిడి పెరుగుతూ పోతుందని చెప్పుకొచ్చింది.

16 మిలియన్‌ సంవత్సరాల కిందనే ఓ ఫాల్ట్ లైన్ ఏర్పడిందని, ప్రస్తుతం ఆ ఫ్రాక్చర్ లైన్ యాక్టివ్‌గా లేదని ఆ ఫ్రాక్చర్ లైన్‌లో భారం పడితే మళ్లీ ఏ క్షణంలోనైనా యాక్టివేట్ అయ్యి భూకంపాలు, సునామీలు సంభవించవచ్చని తేల్చి చెప్పారు. అయితే దీనిపై స్పందించిన ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఆ రీసెర్చ్‌ను ఖండించారు. విశాఖపై లేని పోని అపోహాలను కల్పించి ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని అన్నారు. చూస్తూ ఉంటే విశాఖ ప్రజలతో మాకు రాజధాని వద్దని చెప్పించేలా ఉన్నారని ఖచ్చితంగా ఇది ప్రతిపక్షాలు ఆడిస్తున్న డ్రామా అని అన్నారు.