నడిరోడ్డు పై భార్యను నరికి చంపిన భర్త

భార్య వివాహేతర సంబంధం పెట్టుకుందన్న అనుమానంతో ఓ భర్త దారుణానికి పాల్పడ్డాడు. అందరూ చూస్తుండగానే అర్ధరాత్రి పూట నడి రోడ్డు పై నరికేశాడు. ఈ సంఘటన విశాఖపట్నంలో జరిగింది.

విశాఖపట్నంలోని పండావీధిలో మోహన్ రావు, నాగమణి దంపతులు నివసిస్తున్నారు. వీరు 2004లో ప్రేమించుకొని పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు. మోహన్ రావు విశాఖలోనే కొత్తరోడ్డులో ట్రాన్స్ పోర్టు లో పనిచేసేవాడు. ఇంట్లో పరిస్థితుల వల్ల నాగమణి కూడా ఫుడ్ ఎక్స్ దుకాణంలో పనిచేసేది. ఈ నేపథ్యంలో భార్య పై మోహన్ రావు అనుమానం పెంచుకున్నాడు. దీంతో భార్యభర్తల మధ్య మనస్పర్ధలు ఏర్పడ్డాయి. 

మోహన్ రావు, నాగమణి దంపతులు

భార్య భర్తల మధ్య గొడవలు జరగటంతో నాగమణి పిల్లలను తీసుకొని తన అమ్మగారింటికి వెళ్లిపోయింది. పెద్ద మనుషుల వద్ద పంచాయతీ పెట్టి నాగమణిని మోహన్ రావు ఇంటికి పంపించారు. ఇలా ఓ రెండు మూడు సార్లు అయ్యింది. ఈ మధ్య మోహన్ రావు ఫోన్ పోయింది. అది నాగమణి తీసుకొని అందులో వేరే సిమ్ వేసుకొని నాగమణి వాడుతుంది. అది మోహన్ రావుకు తెలిసింది. వేరే సిమ్ వేసుకొని వివాహేతర సంబంధం నడుపుతుందని మోహన్ రావు అనుమానం పెంచుకున్నాడు.

హత్యకు గురైన నాగమణి

నాగమణి మీద అనుమానం పెంచుకున్న మోహన్ రావు నాగమణిని చంపాలని ప్లాన్ వేసుకున్నాడు. శనివారం నాగమణి పనిచేసే ఫుడ్ ఎక్స్ ముందు కాపలా కాసిన మోహన్ రావు నాగమణి బయటికి రాగానే తను తెచ్చుకున్న కత్తితో నాగమణి ఛాతి, కడుపులో దాదాపు 8 కత్తిపోట్లు పొడిచాడు. సున్నితమైన ప్రదేశాలలో దాడి జరగడంతో నాగమణి రక్తపు మడుగులో అక్కడికక్కడే చని పోయింది. పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. 

క్షణికావేశంలో దాడికి పాల్పడడంతో చిన్నారులు అనాథలయ్యారని పలువురు ఆవేదన వ్యక్తం చేశారు. మోహన్ రావు తల్లి ప్రోత్సాహంతోనే ఈ ఘాతుకం జరిగిందని వాపోయారు. కుటుంబ పరిస్థితుల వల్లనే నాగమణి పనికి వెళ్లిందని దానిని అలుసుగా తీసుకొని అనుమానంతో వేధించేవాడన్నారు. అయినా కూడా నాగమణి నెట్టుకొచ్చిందని లేని పోని నిందలతో నిండు ప్రాణాన్ని బలితీసుకున్నాడని నాగమణితో పనిచేసే తోటి వారు తెలిపారు.  

నాగమణి బాగుండేదని పనిరిత్యా అందరితో మాట్లాడేది కానీ అక్రమ సంబంధం పెట్టుకోలేదని వారు తెలిపారు. ప్రేమించి పెళ్లి చేసుకున్నందుకు నాకీ కష్టాలు వచ్చాయని అప్పుడప్పుడు వాపోయేదని వారన్నారు. నాగమణి పై అనవసరంగా అనుమానం పెంచుకొని నిండు జీవితాన్ని ఆగం చేసుకున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. తల్లి చనిపోవడం, తండ్రి జైలు పాలు కావడంతో పిల్లల పరిస్థితేంటని అంతా చర్చించుకున్నారు. అనవసరంగా జీవితాలు ఆగం చేసుకున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. 

అర్ధరాత్రి వేళ అందరూ చూస్తుండగానే నడి రోడ్డు పై ఘాతుకం జరగడంతో అంతా దిగ్బ్రాంతి చెందారు. ముందు మామూలుగా వచ్చి ఇంటికివెళుదాం రమ్మని చెప్పి మాట్లాడుతూనే మోహన్ రావు ఘాతుకానికి పాల్పడ్డాడు. ఎవరూ ఊహించని రీతిలో మోహన్ రావు దాడిచేశారని సాక్షులు తెలిపారు. అందరూ ఆపుదామని ప్రయత్నించే లోపే ఘోరం జరిగిపోయిందన్నారు.