అనుమానం పెనుభూతమైంది. వారు ఎంతో అన్యోన్యంగా జీవిస్తున్న క్రమంలో ఆ భర్త మదిలో వచ్చిన అనుమానం భార్య మరణానికి కారణమైంది.
ముంబైకి చెందిన కుమార్ భోహిర్ కు వీణతో 12 సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. వీరికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. వీణ ఓ సీఏ సంస్థలో పని చేస్తోంది. కుమార్ ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నాడు. వీరి జీవితం సజావుగానే సాగుతోంది. అయితే కొన్నాళ్ల క్రితం నుంచి వీణ మరో వ్యక్తితో కాస్త చనువుగా ఉంటోంది. అయితే ఆ వ్యక్తితో మాట్లాడవద్దని కుమార్ పలుమార్లు వీణను హెచ్చరించాడు. కేవలం ఆఫీసు పనిమీదే అతనితో చనువుగా ఉంటున్నానని తమ మధ్య ఏం లేదని వీణ తెలిపింది. అయినా కుమార్ వినిపించుకోలేదు. వాస్తవానికి వీణ అతనితో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నట్టు ప్రాథమిక ఆధారాలు దొరికినట్టు తెలుస్తోంది.
జనవరి 2న వీణ ఇంట్లో నుంచి అదృశ్యమైంది. దీంతో కుమార్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అయినా ఆమె ఆచూకీ దొరకలేదు. మంగళవారం కుమార్ వీణ పని చేసే సంస్థ వద్దకు వెళ్లగా అక్కడికి వీణ వచ్చింది. దీంతో అతను ఆఫీసు లోపలికి వెళ్లి ఇంటికి రావాలని కోరాడు. దానికి వీణ నిరాకరించింది. దాంతో వారిద్దరి మధ్య గొడవ జరిగింది. సహనం కోల్పోయిన కుమార్ తన వెంట తెచ్చుకున్న కత్తితో ఆమె పై దాడి చేశాడు. ఇష్టమొచ్చినట్టు పొడవడంతో వీణ రక్తపు మడుగులో పడి అక్కడికక్కడే చనిపోయింది. అనంతరం కుమార్ నేరుగా పోలీస్ స్టేషన్ కెళ్లి లొంగిపోయాడు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకోని దర్యాప్తు చేస్తున్నారు.