విజయవాడలో అధికార పార్టీ నాయకురాలు హల్ చల్ చేసిన సంగతి తెలిసిందే. కాజా టోల్ ప్లాజా దగ్గర తన వాహనానికి టోల్ రుసుము అడిగినందుకు రెచ్చిపోయిన వడ్డెర కార్పొరేషన్ ఛైర్మన్ దేవళ్ళ రేవతి, టోల్ గేట్ సిబ్బందిపై రెచ్చిపోయింది. అడ్డువచ్చిన టోల్ ప్లాజా సిబ్బందిపై భౌతికదాడికి పాల్పడింది. దీంతో రేవతితో వాగ్వాదానికి దిగారు టోల్ గేట్ సిబ్బంది. ఆమె భౌతిక దాడికి పాల్పడడంతో చేసేది ఏమీ లేక, కాసేపటి తర్వాత ఆమె వాహనాన్ని టోల్ సిబ్బంది వదిలిపెట్టారు. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు రావడం తో సీఎం వైఎస్ జగన్ స్పందించారు. ఆమెను వెంటనే తాడేపల్లి రావాల్సిందిగా ఆదేశించారు. బాధ్యాతయుతమైన పదవిలో ఉన్న రేవతి అలా ప్రవర్తించడంపై సీఎం ఒకింత ఆగ్రహంతో ఉన్నట్లు తెలుస్తోంది. ఘటనపై వివరణ కోరడమే కాకుండా.. ఆమెపై సీరియస్ యాక్షన్ తీసుకోవాలని ముఖ్యమంత్రి డిసైడ్ అయినట్లు ప్రచారం జరుగుతోంది. సీఎంఓ నుంచి ఫోన్ రావడంతో దేవుళ్ల రేపతి హుటాహుటిన తాడేపల్లి వెళ్లారు. సీఎంఓ లో రిపోర్ట్ చేసిన తక్షణమే పదవి నుండి తొలిగించే అవకాశం ఉందంటూ వార్తలు వస్తున్నాయి.
మరోవైపు కాజా టోల్ ప్లాజా సిబ్బంది దేవుళ్ల రేవతిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. టోల్ ఫీజు చెల్లించేందుకు నిరాకరించడమే కాకుండా తమపై దాడికి దిగినందుకు చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. బాధితుల ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు రేవతిపై కేసు నమోదు చేశారు.