సాప్ట్ వేర్ శారద ఇప్పుడు తెలుగు రాష్ర్టాల్లో హాట్ టాపిక్. సాప్ట్ వేర్ ఇంజనీరింగ్ ఉద్యోగం చేసే శారద లాక్ డౌన్ కారణంగా ఉద్యోగం కోల్పోవడంతో తండ్రి నిర్వహిస్తోన్న కూరగాయల షాపులో కూర్చోవడం మొదలు పెట్టింది. తన తెలివి తేటలతో వ్యాపారం జోరుగా చేసింది. సాప్ట్ వేర్ ఇంజనీర్ అన్న ట్యాగ్..కూరగాయలు అమ్మడం ఏంటి? అన్న సానుభూతి..ఈ రెండింటికి మించి బాలీవుడ్ నటుడు సోనుసూద్ ట్వీట్ చేసి శారది ఉద్యోగం ఇస్తానంటూ వదిలిన ఒక్క ట్విట్ తో శారద పేరు మారు మ్రోగిపోయింది. ఈ కారణంగా శారద సోషల్ మీడియాలో ఓ వెలుగు వెలిగిపోయింది. తాజాగా శారద మరోసారి వార్తల్లో హైలైట్ అయింది.
శారద కూరగాయల బండి షాపులో దుండగులు ఎవరో కూరగాయల్ని రాత్రికి రాత్రే దొంగిలించారు. కూరగాయలన్నింటిని దోచుకెళ్లి బండిని అక్కడే వదిలేసారు. ఈ ఘటన శ్రీనగర్ కాలనీలో చోటు చేసుకుంది. శారద షాపు అక్కడే నిర్వహిస్తోన్న సంగతి తెలిసిందే. సాయంత్రం వరకూ కూరగాయలు అమ్మిన శారద చీకటి పడే సరికి బండిని అక్కడే వదిలేసి..ఆ కూరగాయల మీద పెద్ద పరదా వేసి ఇంటికెళ్లిపోయింది. ఇదే అదునుగా భావించిన కూరల దొంగలు వాటిని ఎత్తుకెళ్లిపోయారు. మరి సాప్ట్ వేర్ శారద ఇంత అమాయకంగా ఇలా ఎలా వ్యవరించిందో. అసలే కష్టకాలం. నిత్యావసర సరుకుల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి.
అదీ టైమ్ కి తెచ్చుకోవాలి. కొన్ని చోట్ల క్యూ కూడా కట్టాల్సిన పరిస్థితి ఉంది. దాదాపు 5 వేల రూపాయల సరకు దొంగలపాలు అయిందని శారద విచారం వ్యక్తం చేసింది. అయినా తను బాధపడలేదని..పోయిన దాన్ని మళ్లీ కష్టంతో సంపాదిస్తానని ధీమా వ్యక్తం చేసింది. మొత్తానికి శారద పేరు మళ్లీ సోషల్ మీడియాలో జోరుగా ట్రోల్ అవుతోంది. ఇక శారదే కాదు కరోనా కాలంగా చాలా మంది ఉద్యోగాలు కోల్పోయారు. బీటెక్…ఎమ్ టెక్ ల..బీఎస్సీలు..ఎమ్మెస్సీలు చేసి ఉపాధి హామీ పనులకు వెళ్తోన్న వారిని చాలా మందినే చూస్తున్నాం. చూసారా! కంటికి కనిపించని వైరస్ జనాలతో ఎలా ఆడుకుంటుందో.