జగన్మోహన్ రెడ్డి మాటలు విన్న తర్వాత అందరిలోను అవే అనుమానాలు మొదలయ్యాయి. పాదయాత్రలో భాగంగా శ్రీకాకుళం జిల్లా పలాసలో జరిగిన బహిరంగ సభలో జగన్ మాట్లాడుతూ, రానున్న ఎన్నికల్లో తనకు డిపాజిట్లు కూడా రావన్న విషయం తెలిసే జనాలను మభ్య పెట్టేందుకు చంద్రబాబునాయుడు రోజుకో కొత్త సినిమా చూపిస్తున్నట్లు జగన్ ధ్వజమెత్తారు.
చంద్రబాబు పాలనంతా జగన్ మాటల్లో చెప్పాలంటే అరాచకాలు, అప్రజాస్వామిక విధానాలు, అక్రమాలు, అవినీతి, వైఫల్యాలతోనే సాగినట్లు మండిపడ్డారు. పాదయాత్ర ముగింపు దశకు చేరుకున్న కారణంగా జగన్ బహిరంగ సభకు జనాలు భారీ ఎత్తున హైజరయ్యారు. తన వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే రోజుకో రాష్ట్రానికి వెళుతూ ఎల్లో మీడియాతో సానుకూలంగా రాయించుకుంటున్నట్లు జగన్ ఎద్దేవా చేశారు.
తమిళనాడుకు వెళ్ళి స్టాలిన్ తో సాంబార్ ఇడ్లీ తింటున్న చంద్రబాబని, కర్నాటకకు వెళ్ళి కాఫీ తాగుతున్న చంద్రబాబు అంటూ తన మీడియాలో చంద్రబాబు రాయించుకుంటున్నట్లు ఎద్దేవా చేశారు. ఆ పక్కనే ఉన్న ఒడిస్సా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ దగ్గరకు వెళ్ళి జిల్లాలోని వంశధాకా, నాగావళి నదుల సమస్యల గురించి మాత్రం మాట్లాడరంటూ మండిపడ్డారు. మొత్తానికి జగన్ తిత్లీ తుఫాను ధాటికి బాగా దెబ్బతిన్న ప్రాంతాల్లో తిరుగుతున్నా జనాలు మాత్రం బాగా స్పందిస్తున్నారు. అప్పట్లో తిత్లీ తుపాను వల్ల దెబ్బతిన్న ప్రాంతాల్లో జగన్ పర్యటించటం లేదని చంద్రబాబు అండ్ కో విమర్శలు చేసిన విషయం అందరికీ తెలిసిందే. అప్పట్లో ఆ విషయాన్ని చంద్రబాబుకు మద్దతిచ్చే మీడియా కూడా బాగా హైలైట్ చేసింది.
కానీ తిత్లీ దెబ్బతిన్న ప్రాంతాల్లోనే జగన్ చేస్తున్న పాదయాత్రకు మాత్రం జనాలు సానూకూలంగా స్పందిస్తున్నారు. పైగా జిల్లాలో టెక్కలిలో తిరుగుతున్నపుడు మంత్రి కింజరాపు అచ్చెన్నాయడు పై తమకున్న కోపాన్ని స్ధానికులు వెళ్ళగక్కటం విశేషం. జిల్లాలో ఇఫ్పటి వరకూ జగన్ పాదయాత్ర చేసిన చోట్లంతా జనాలు బ్రహ్మరథం పట్టారు. బహుశా మరో పది రోజుల్లో పాదయాత్రను ఇచ్ఛాపురంలో ముగించే అవకాశం ఉంది. అందుకనే జనాలు కూడా అంచనాలకు మించి స్పందిస్తున్నారు.
జనాల స్పందన చూసిన తర్వాత వచ్చే ఎన్నికల్లో వైసిపి మెరుగైన ప్రదర్శనే చేస్తుందని అంచనా వేసుకుంటున్నారు. పోయిన ఎన్నికల్లో జిల్లాలోని 9 సీట్లలో వైసిపి మూడు నియోజకవర్గాలు గెలిచింది. పాదయాత్రకు స్పందిస్తున్న జనాలను చూస్తే వచ్చే ఎన్నికల్లో మరిన్ని సీట్లు గెలుచుకునే అవకాశాల కన్పిస్తున్నాయి. మరి ఏమవుతుందో చూడాల్సిందే.