జనసేనాని పవన్ కళ్యాణ్ చారిత్రక తప్పిదం.!

జనసేన అధినేత పవన్ కళ్యాణ్, ఇప్పటిదాకా రాజకీయాల్లో చేసిన ప్రతీదీ చారిత్రక తప్పిదాల లిస్టులోకే వెళుతుందని ఆఫ్ ది రికార్డుగా ఆయన అభిమానులే చెబుతుంటారు.! ప్రజారాజ్యం పార్టీ దగ్గర్నుంచి, ఇప్పటిదాకా రాజకీయంగా పవన్ కళ్యాణ్ అస్సలేమీ నేర్చుకోలేదని ఆయనతో విసిగి వేసారిన చాలామంది రాజకీయ నాయకులు చెప్పడం చూస్తున్నాం.

ప్రజారాజ్యం పార్టీకి సంబంధించిన యూత్ వింగ్ అధ్యక్షుడుగా అప్పట్లో పవన్ కళ్యాణ్ పని చేశారు. దాని పేరు యువ రాజ్యం. కానీ, ప్రజారాజ్యం పార్టీ వెంట, 2009 ఎన్నికల తర్వాత కొనసాగలేకపోయారు పవన్ కళ్యాణ్. కాంగ్రెస్ పార్టీలో ప్రజారాజ్యం పార్టీని కలిపేయాలన్న దిశగా అప్పట్లో చిరంజీవి నిర్ణయం తీసుకోవడమే అందుక్కారణం.

ఇక, సొంత కుంపటి జనసేన పార్టీని స్థాపించిన పవన్ కళ్యాణ్, 2014 ఎన్నికల్లో టీడీపీ – బీజేపీ కూటమికి మద్దతిచ్చి ఊరుకున్నారు. అప్పుడే, పవన్ కళ్యాణ్ పోటీ చేసి, తనతోపాటు ఓ డజను మందికైనా టిక్కెట్లు ఇచ్చుకుని వుంటే, జనసేన పార్టీకి ఇప్పుడు రాష్ట్ర పార్టీ అనే స్థాయి దక్కి వుండేది.

2019లో విడిగా పోటీ చేయడమూ జనసేన పార్టీకి పెద్ద దెబ్బే.! ఆ ఎన్నికల్లో టీడీపీతో కలిసి అయినా, లేదంటే వైసీపీ నుంచి అందిన ‘పొత్తు ప్రతిపాదన’ అంగీకరించడం ద్వారా అయినా పోటీ చేసి వుంటే.. జనసేన పార్టీ, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ప్రాతినిథ్యం పొంది వుండేది.

ఇప్పుడు, టీడీపీతో జనసేన పొత్తు పెట్టుకుంది. ఇంకోపక్క బీజేపీ – జనసేన మధ్య పొత్తు నడుస్తోంది. కానీ, బీజేపీ – టీడీపీ మధ్య ఎలాంటి పొత్తూ లేదు. ఇదొక గందరగోళ పరిస్థితి. ఈ గందరగోళం నడుమ, టీడీపీ నిర్వహిస్తున్న బహిరంగ సభలో పవన్ కళ్యాణ్ పాల్గొంటున్నారు. అది కూడా, నారా లోకేష్ ‘యువగళం’ పాదయాత్ర ముగింపు నేపథ్యంలో ఏర్పాటు చేస్తున్న బహిరంగ సభ.

ఓ వైపు, టీడీపీ నుంచి అవమానాలంటూ జనసేన నేతలు, కార్యకర్తలు మొత్తుకుంటోంటే, ఈ సమయంలో పవన్ కళ్యాణ్ ఇలాంటి నిర్ణయం తీసుకోవడం సబబేనా.? అన్నది జనసైనికుల్లోనే వ్యక్తమవుతున్న అభిప్రాయం. ఇదొక చారిత్రక తప్పిదం అవుతుందన్న భావన జనసేన వర్గాల్లోనే ఆఫ్ ది రికార్డుగా వ్యక్తమవుతోంది.

సీట్ల పంపకాలపై స్పష్టతనిచ్చి, పార్టీ శ్రేణుల్ని సమాయత్తపరిచాక, టీడీపీ – జనసేన అగ్రనాయకత్వాలు ఒక్క వేదికపై కనిపిస్తే బావుంటుందేమోగానీ, ఆ విషయమై ఎలాంటి స్పష్టతా లేకుండా ఈ కలయిక ఏంటన్నది ప్రధానంగా వినిపిస్తోన్నవాదన.