హస్తినలో బీజేపీ పెద్దలు, పవన్ కు ఎంతో విలువ ఇస్తుంటారు కానీ.. ఏపీ బీజేపీ నేతలే పవన్ కి తగిన ప్రాధాన్యం ఇవ్వరు.. అని ఇంతకాలం భావించిన వారి అభిప్రాయాలు ఒక్కసారిగా మారిపోయే విషయం ఒకటి వెలుగులోకి వచ్చింది!
2014 ఎన్నికల సమయంలో టీడీపీతో నేరుగా దోస్తీ చేశారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. అనంతరం అధికారికంగా విడాకులు తీసుకుని.. అనంతరం బిజేపీతో కలిసి ఉంటున్నారు! ఇలా బీజేపీతో కలిసి ఉంటున్నా కూడా అప్పుడప్పుడూ చంద్రబాబుతో హోటల్స్ లోనూ, ఇంటిలోనూ కలుస్తుంటారు. అది వేరే సంగతి!! అయితే.. తాజాగా వెలుగులోకి వచ్చిన అంశం వల్ల… పవన్ ని బీజేపీ పెద్దలు అంతగా పట్టించుకోవడం లేదని, అది హస్తిన స్థాయిలోనే జరుగుతుందని తేలిపోయింది!
అవును… ఏపీలో మిత్రపక్షాలము అని చెప్పుకుంటున్న బీజేపీ – జనసేనలు కలిసి కనిపించిన సంఘటనలు అత్యంత అరుదు! కలిసి ప్రెస్ మీట్ లు పెట్టిందీ లేదు, కలిసి పోరాటాలు చేస్తున్నదీ లేదు. కానీ.. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో కలిసి పోటీ చేస్తామని చెప్పుకుంటుంటారు ఏపీ బీజేపీ నేతలు! అయితే ఈ విషయంలో ఏపీ బీజేపీ నేతల తప్పేమీ లేనట్లుందని తెలుస్తోంది!
ఎందుకంటే… త్వరలో జరగబోయే ఎమ్మెల్సీ ఎన్నికలలో మూడు స్థానాలకు పోటీ చేయాలని బీజేపీ నిర్ణయించుకుంది. పవన్ కు సోము వీర్రాజు కనీసం చెప్పలేదు.. పిలిచి మాట్లాడ లేదు అని అంతా అనుకున్నారు! అయితే… ఇందులో సోము వీర్రాజు తప్పేమీ లేదని, ఆయన అన్ని విషయాలు జాతీయస్థాయి నేతలకు చెబుతున్నారని.. సోము అన్నీ చెప్పే చేస్తున్నారని జీవీఎల్ క్లారిటీ ఇచ్చారు!
దీంతో… జీవీఎల్ చెప్పినట్లు, ఏపీలో.. జనసేనతో కలిసి ఏమి చేయాలి, ఏమి చేయకూడదు? ఎంతలో ఉంచాలి.. ఎక్కడ ఉపయోగించుకోవాలి? ఎక్కడ దూరం పెట్టాలి? అన్న విషయాలన్నీ బీజేపీ హస్తిన పెద్దల డైరెక్షన్ లోనే ఏపీలో సాగుతున్నాయని అర్ధం చేసుకోవచ్చని అంటున్నారు విశ్లేషకులు! ఫలితంగా… పవన్ అంటే అంత లోకువా? అని ఇకపై జనసైనికులు బీజేపీ జాతీయ స్థాయి నేతలపై విరుచుకుపడతారో ఏమో వేచి చూడాలి!