అసలు పార్టీతో సంబంధం లేని వ్యక్తిని రాత్రికి రాత్రి తీసుకొచ్చి, మాట వరసకైనా నాతో చెప్పకుండా, నియోజకవర్గ బాధ్యతలు ఆమెకు అప్పగించేసి, నన్ను తప్పించడమేంటి.? అంటూ హిందూపూర్ వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ అగ్గి మీద గుగ్గిలం అవుతున్నారట.
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దగ్గరే పంచాయితీ తేల్చుకుందామని అమరావతికి వెళ్ళిన గోరంట్ల మాధవ్‌కి, సజ్జల రామకృష్ణా రెడ్డి దగ్గరే బ్రేక్ పడింది. వైఎస్ జగన్ అపాయింట్మెంట్ దొరక్కపోవడంతో, సజ్జలతో చర్చలకే పరిమితమవ్వాల్సి వచ్చింది గోరంట్ల మాధవ్.
ఈ క్రమంలో గోరంట్ల మాధవ్ – సజ్జల రామకృష్ణా రెడ్డి మధ్య మాటా మాటా పెరిగిందని అంటున్నారు. టీడీపీ అను‘కుల’ మీడియా అయితే, సజ్జల రామకృష్ణా రెడ్డి మీద చెయ్యి చేసుకునేదాకా గోరంట్ల మాధవ్ ఓవరాక్షన్ చేశారంటూ ప్రచారం షురూ చేసింది.
నిజానికి, గోరంట్ల మాధవ్ ఒకింత ఆవేశపరుడు. ఆయన్ని కూల్ చేయడం సజ్జల రామకృష్ణా రెడ్డికి అంత తేలికైన విషయం కాదు. కాకపోతే, అంత సీన్ గోరంట్ల మాధవ్‌కి వుంటుందా.? అన్నదే అసలు ప్రశ్న. పూర్వాశ్రమంలో ఆయన దుందుడుకు స్వభావం కలిగిన పోలీస్ అధికారి అయితే అయి వుండొచ్చుగానీ, ఆనాటి ఫైర్ గోరంట్ల మాధవ్‌లో ఇప్పుడు లేదు. వున్నా, రాజకీయాల్లో ఇలాంటి ఫైర్ తేడా కొట్టేస్తుంది.
‘నేను చేసిన తప్పేంటి.? నాతో కనీసం చర్చించకుండా ఈ నిర్ణయాలేంటి.?’ అంటూ గోరంట్ల మాధవ్ ఆవేదన వ్యక్తం చేయడం వరకూ ఓకే.! ముఖ్యమంత్రి నిర్ణయం తీసేసుకున్నారంటూ సజ్జల చెప్పాక, గోరంట్ల మాధవ్ చేయడానికేమీ వుండదు.
పార్టీ మారేంత రిస్క్ గోరంట్ల మాధవ్ చేయకపోవచ్చు. చేసినా, ఆయన ఏ పార్టీలోకీ వెళ్ళలేరు. రాజకీయ సన్యాసమే గతి.! సో, గట్టిగా అరిచి, గీ పెట్టి.. సైలెంటయిపోవడమే.!