Hijab Row : కర్నాటకలో హిజబ్ రగడ దేశంలో అలజడి సృష్టిస్తోంది. విద్యా సంస్థల్లో హిజబ్ ధారణపై అభ్యంతరాలే ఇందుకు నిదర్శనం. ముస్లిం మహిళలు హిజబ్ ధరించడం అనేది ఓ సంప్రదాయంగా వస్తోంది. ఆ హిజబ్ ఇప్పుడు వివాదాలకు కారణమవుతోంది.
హిజబ్ కారణంగా ‘యూనిఫాం’ అన్న మాటకే అర్థం లేకుండా పోతోందనీ, అందరూ సమానమేనన్న భావనకు ఈ హిజబ్ ధారణ వల్ల ఇబ్బందులు వస్తున్నాయన్నది ఓ ఆరోపణ. అయితే, మహిళలు ఏం ధరించాలన్నదాన్ని నిర్ణయించేందుకు ఎవరికీ హక్కు లేదని ఇంకొందరు వాదిస్తున్నారు.
హిజబ్‌ని తాము వ్యతిరేకిస్తున్నామనేవారూ వున్నారు.. హిజబ్‌ని సమర్థిస్తున్నవారూ వున్నారు. నిజానికి, ఇది చాలా సున్నితమైన అంశం. అంతర్జాతీయ స్థాయిలో మలాలా లాంటివాళ్ళూ ఈ అంశంపై స్పందించడంతో, ఈ వివాదం ముదిరి పాకాన పడుతోంది.
అయ్యప్ప స్వామి మాల ధారణ సమయంలో విద్యార్థులు, నల్లటి దుస్తుల్ని ధరిస్తే, వాటిని విద్యా సంస్థల యాజమాన్యాలు నిషేధించిన సందర్భాలు.. ఈ క్రమంలో తలెత్తిన వివాదాల గురించి కొత్తగా చెప్పేదేముంది.? నిజానికి, ఇలాంటి వివాదాలు.. రాజకీయ కోణంలో తప్ప, ఈ వివాదాల వల్ల ఎవరికీ ఎలాంటి ఉపయోగమూ లేదు.
కేవలం రాజకీయ లబ్ది కోసం హిజబ్ వివాదాన్ని కొందరు హైలైట్ చేస్తున్నారు. కొందరు సినీ ప్రముఖులూ ఈ వివాదంపై అనవసర వ్యాఖ్యలు చేస్తూ, వివాదం ముదిరి పాకాన పడేందుకు తమవంతుగా అగ్నికి ఆజ్యం పోస్తున్నారని అనొచ్చేమో.
విడవమంటే పాముకి కోపం, కరవమంటే కప్పకు కోపం అన్న చందాన తయారైన ఈ వివాదానికి ముగింపు ఎలా పడుతుందోగానీ, అసాంఘీక శక్తులు పేట్రేగిపోయేందుకు ఆస్కారమిచ్చే ఇలాంటి వివాదాల పట్ల భారతీయులంతా అప్రమత్తంగా వుండాల్సిందే.