Priyanka Self Goal : ప్రియాంక సెల్ఫ్ గోల్: బికినీ ధరించి విద్యా సంస్థలకు ఎవరైనా వెళ్ళొచ్చా.?

Priyanka Self Goal : అసలు ఇదేం ప్రశ్న.? మనం నాగరిక సమాజంలో వున్నామా.? ఇంకెక్కడన్నా వున్నామా.? విద్యాసంస్థలకు వెళ్ళే విద్యార్థినులు బికినీల్లో వెళతారా.? ఛాన్సే లేదు. మరెందుకు ఈ ప్రశ్న వస్తోంది.? ఎందుకంటే, కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ కుమార్తె ప్రియాంక గాంధీ.. కర్నాటకలో హిజబ్ వివాదంపై స్పందిస్తూ వేసిన ట్వీట్ అలాంటిది మరి.!

బికినీ కావొచ్చు.. హిజబ్ కావొచ్చు.. ఏం ధరించాలన్నది మహిళల ఇష్టం, దాన్ని ఎవరూ ప్రశ్నించజాలరు.. అన్నది ప్రియాంక గాంధీ వేసిన ట్వీటు సారాంశం. నిజానికి, ప్రియాంక ట్వీటుని ఇంకో కోణంలో చూడకపోతే, అందులో తప్పేమీ లేదు.

కానీ, హిజబ్ – బికినీ.. ఈ రెండిటినీ ముడిపెట్టి ట్వీటేయడమేంటి.? పైగా, హిజబ్ వివాదం నడుస్తున్న సమయంలో బికినీ ప్రస్తావన ఎవరైనా తీసుకొస్తారా.? కాంగ్రెస్ పార్టీకి వేరే శతృవులు అవసరం లేదు. నానాటికీ దిగజారిపోతున్న కాంగ్రెస్ పార్టీని ఓ వైపు రాహుల్ గాంధీ, ఇంకో వైపు ప్రియాంక గాంధీ.. మరింత కష్టపడి కిందికి లాగేస్తున్నారనడానికి ఇంతకన్నా నిదర్శనం ఇంకోటి అవసరం లేదేమో.!

డ్రెస్ కోడ్ విషయమై కర్నాటకలో రచ్చ జరుగుతోంది. ‘సమానత్వం’ పేరుతో హిజబ్ మీద నిషేధాజ్ఞలు విధిస్తున్నారన్నది ఓ ఆరోపణ. ఈ నేపథ్యంలోనే ఆందోళనలు జరుగుతున్నాయి.. విద్యా సంస్థలకు సెలవుల్ని ప్రకటించేయాల్సి వచ్చింది.

సున్నితమైన ఇలాంటి అంశం పట్ల ప్రియాంక గాంధీ ఎందుకు అంత బాధ్యతారాహిత్యంతో కూడిన వ్యాఖ్యలు చేశారోగానీ, ప్రియాంక ‘బికినీ’ ట్వీటు ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్ అయిపోయింది.