జగన్ పై దాడి కేసు: ఏపీ ప్రభుత్వానికి హైకోర్ట్ షాక్

ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై జరిగిన దాడి కేసులో హైకోర్టు ఏపీ ప్రభుత్వానికి షాక్ ఇచ్చింది. జగన్ వేసిన రిట్ పిటిషన్ స్వీకరించిన హైకోర్టు, దీనిపై విచారణ చేపట్టింది. ఇదే ఘటనపై వైసీపీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యులు వైవీ సుబ్బారెడ్డి కూడా హైకోర్టులో పిటిషన్ వేశారు. దీనిపై ప్రజావ్యాజ్యం కూడా దాఖలైంది.

రాష్ట్ర ప్రభుత్వ విచారణపై విశ్వాసం లేదని సిబిఐ ఎంక్వైరీ జరిపించాలని పిటిషన్ లో విజ్ఞప్తి చేశారు. తనపై జరిగిన దాడి కుట్ర పూరితంగా హత్యాయత్నమే అని, ఏపీ ప్రభుత్వ వైఫల్యం వలనే అని స్పష్టంగా ఆయన పిటిషన్ లో పేర్కొన్నారు. సిబిఐ కాకపోయినా ప్రభుత్వానికి సంబంధించిన కేంద్ర దర్యాప్తు సంస్థతో అయినా విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేసారు.

దీనిపై స్పందించిన హైకోర్టు విచారణ జరుపుతోంది. ఈ విచారణలో భాగంగా సిట్ దర్యాప్తు రిపోర్టును షీల్డ్ కవర్ లో కోర్టుకు సమర్పించాలని హై కోర్టు ఆదేశించింది. దర్యాప్తు నివేదికను సమర్పించడాన్ని కొంత టైం కావాలని ఏపీ ప్రభత్వ తరపు న్యాయవాది కోరారు. మంగళవారంలోపు సిట్ నివేదిక అందించాలని ఏపీ ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అంతేకాదు పిటిషన్ అర్హతపై న్యాయస్థానం ప్రశ్నించింది.

కాగా తదుపరి విచారణని శుక్రవారానికి వాయిదా వేసింది హైకోర్టు. ఏపీ ప్రభుత్వ న్యాయవాది ఏపీ ప్రభత్వం తరపున వాదనలను వినిపించనున్నారు. అయితే జగన్ పై విశాఖ ఎయిర్పోర్టులో జరిగిన దాడి ఘటన కేసు ఇంకా కొలిక్కి రాలేదు. ఇరు పార్టీల నేతలు వాదోపవాదనలు చేసుకుంటున్నారు. వైసీపీ కోడి కత్తి డ్రామా చేస్తోందని అధికార టీడీపీ నేతలు విమర్శిస్తుంటే… మా అధినేతపై టీడీపీ హత్యాయత్న కుట్ర చేసిందని వైసీపీ వర్గాలు ఆరోపిస్తున్నాయి.

దాడి జరిగి 15 రోజులు అవుతున్నా నిజాలు తేల్చలేదని వైసీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జగన్ పై ముమ్మాటికీ హత్యాయత్నమే జరిగిందని వారు ఆరోపిస్తున్నారు. హత్యాయత్న కుట్ర బయటపడుతుందేమో అని అధికార ప్రభుత్వం, అధికారులు కేసును తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నిస్తున్నారని దుయ్యబడుతున్నారు.