ఎంపీ వైఎస్ అవినాష్ కు హైకోర్టు షాక్!

దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి సోదరుడు, మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసుకు సంబంధించి కడప వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి తెలంగాణ హైకోర్టులో షాక్ తగిలింది. మాజీ మంత్రి వివేకా హ‌త్య కేసులో త‌న‌పై తొంద‌ర‌పాటు చ‌ర్య‌లు తీసుకోవ‌ద్ద‌ని, విచార‌ణ‌పై స్టే ఇవ్వాల‌ని ఎంపీ అవినాశ్ రెడ్డి దాఖ‌లు చేసిన పిటిష‌న్ల‌ను తెలంగాణ హైకోర్టు కొట్టేసింది. ఇదే క్రమంలో… వివేక హ‌త్య కేసులో సీబీఐ విచార‌ణ‌కు స‌హ‌క‌రించాల‌ని అవినాష్ కు సూచించిన న్యాయస్థానం… అరెస్టు చేయొద్ద‌ని సీబీఐని తాము ఆదేశించ‌లేమ‌ని సృష్టం చేసింది.

కాగా కొద్ది రోజుల క్రితం తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన అవినాష్ రెడ్డి తనపై సీబీఐ తీవ్రమైన చర్యలు తీసుకోకుండా ఆదేశించాలంటూ విన్నవించిన సంగతి తెలిసిందే. అంతేగాకుండా తనను విచారిస్తున్నప్పుడు ఆడియో వీడియోల ద్వారా రికార్డు చేయాలని ఆయన న్యాయస్థానాన్ని కోరారు. ఇదేసమయంలో… విచారణ సందర్భంగా తన న్యాయవాదిని కూడా అనుమతించాలని అవినాష్ తన పిటిషన్ లో కోరారు. తన వాంగ్మూలానికి సంబంధించిన ప్రతులను అందజేసేలా దర్యాప్తు అధికారిని ఆదేశించాలని కోర్టుకు విన్నవించారు.

అయితే అవినాష్ రెడ్డి కోరినట్టు ఆడియో – వీడియో రికార్డింగ్స్ చేయాలని కోర్టు అధికారులను ఆదేశించింది. ఈ పిటిషన్ లో అవినాష్ కి దక్కిన ఒకేఒక్క ఉపశమనం ఇదే! ఇక, విచారణకు తనతోపాటు తన న్యాయవాదిని అనుమతించాలని కోరిన కోరికకు కూడా… “కుదరదు” అని తేల్చిచెప్పింది న్యాయస్థానం!

అయితే ఈ కేసుకు సంబందించి ఇప్పటికే అవినాష్ రెడ్డిని సీబీఐ నాలుగు సార్లు విచారించింది. ఇప్పుడు ఐదోసారి విచారించనుంది. అలాగే అవినాష్ తండ్రి పులివెందుల వైసీపీ ఇంచార్జి వైఎస్ భాస్కరరెడ్డిని సైతం సీబీఐ త్వరలో విచారించనుంది!