కృష్ణాజిల్లాలోని పెనమలూరు నియోజకవర్గం టిడిపి ఎంఎల్ఏ బోడె ప్రసాద్ పై కోర్టు నమోదు చేయాల్సిందిగా హైకోర్టు ఆదేశించింది. ఆమధ్య ఎంఎల్ఏ బోడె ప్రసాద్ కు వైసిపి ఎంఎల్ఏ ఆర్ కె రోజాకు మాటల యుద్ధం జరిగిన విషయం గుర్తుండే ఉంటుంది. రోజాను ఉద్దేశించి ప్రసాద్ మాట్లాడుతూ, రోజాకు గుండు కొట్టిస్తానంటూ వ్యాఖ్యలు చేయటం అప్పట్లో పెద్ద దుమారాన్నే రేపింది. అంతేకాకుండా వ్యక్తిగతంగా కూడా చాలా అసహ్యంగా కామెంట్ చేశారు.
బోడె వ్యాఖ్యలపై రోజా వెంటనే పోలీసులను ఆశ్రయించింది. తనను అవమానించారంటూ బోడెపై వైసిపి ఎంఎల్ఏ ఇచ్చిన ఫిర్యాదును పోలీసులు లైట్ గా తీసుకున్నారు. ఎంతైనా అధికారపార్టీ ఎంఎల్ఏ అందునా రాజధాని ప్రాంతవాసి కదా ? అందుకనే రోజా ఫిర్యాదును పోలీసులు పట్టించుకోలేదు. దాంతో రోజా ఎంఎల్ఏతో పాటు పోలీసులపైన కూడా హై కోర్టులో కేసు వేసింది.
ఆ కేసుకు సంబంధించే హైకోర్టు ఇపుడు స్పందించింది. రోజా ఫిర్యాదుపై బోడె ప్రసాద్ పై ఎందుకు కేసు ఫైల్ చేయలేదంటూ పోలీసులపై న్యాయస్ధానం మండిపడింది. తర్వాత ఫిర్యాదు ఆధారంగా వెంటనే బోడె ప్రసాద్ పై కేసు నమోదు చేసి కోర్టుకు వివరాలు అందించాలంటూ ఆదేశాలు జారీ చేసింది.