ఒకప్పటి టాలీవుడ్ హీరో శివాజీ 2019 ఎన్నికలకు ముందు చేసిన కొన్ని వ్యాఖ్యలు రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం అయ్యాయి. అయితే 2020 లో ఒక ఇంటర్వ్యులో విశాఖ ఉక్కుని అమ్మాలని కేంద్రం భావిస్తుందని ఎవరూ దాన్ని అడ్డుకోలేరు అని ఆయన వ్యాఖ్యలు చేసారు. ఇప్పుడు అదే నిజం అయింది. అసలు ఆయన ఆ ఇంటర్వ్యూలో ఏం చెప్పారో చూద్దాం… ఎవరికీ తెలియని రహస్యం ఒకటి మీకు చెబుతున్నా.. దక్షణ కొరియాకి సంబంధించిన ఓ ఐరన్ కంపెనీ.. పోస్కో! ఈ పోస్కో కంపెనీని ఇక్కడకు తీసుకురావడం కోసం విశాఖపట్నం ఉక్కు కర్మాగారాన్ని చంపేస్తున్నారు అని అన్నారు.
ఇది నిజం. ఇవాళ విశాఖ ఉక్కు పరిశ్రమంలో 40 వేల మంది ఉద్యోగులు పని చేస్తున్నారు. దాదాపు లక్ష మంది డైరెక్ట్‌గా ఇన్ డైరెక్ట్‌గా ఉపాధి పొందుతున్న విశాఖ ఉక్కు కర్మాగారం త్వరలో మూతపడబోతోంది అని ఆయన వ్యాఖ్యానించారు. 60 వేల ఎకరాల భూములు ఇచ్చిన రైతుల త్యాగం విశాఖ ఉక్కు అని వెల్లడించారు. ‘విశాఖ ఉక్కు- ఆంధ్రుల హక్కు’ అనే నినాదంతో ఏపీ, తెలంగాణ ప్రాంత ప్రజల త్యాగాల ఫలితంగా వచ్చిన విశాఖ ఉక్కు కర్మాగారం త్వరలో కనుమరుగవ్వబోతుంది అని అన్నారు. మీలో ఎవరికైనా ఈ రహస్యం తెలుసా? ఇది నిజం కాదని కేంద్ర ప్రభుత్వాన్ని చెప్పమనండి అని ఆయన సవాల్ చేసారు. కేంద్ర ఉక్కుశాఖ మంత్రి.. ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి గారి దగ్గరకు ఎప్పుడు వచ్చారో ఒకసారి గుర్తుతెచ్చుకోండి అని ప్రశ్నించారు.
ఆ రోజు వీళ్లు మర్యాదపూర్వకంగా కలిశాం అని చెప్పారు. కాని అది నిజం కాదు. రహస్య ఒప్పందం ప్రకారమే కలిశారు అని అన్నారు. ఆ రోజు పోస్కో కంపెనీ విశాఖలో రెండు వేల ఎకరాలు కావాలని.. ఆ భూమి ఇస్తే విశాఖలో ఈ కంపెనీ పెడతాం అని వస్తే.. వాళ్ల ఒప్పందాల కోసం వచ్చారు అని అన్నారు. ఈరోజు నేను చెప్తున్నా, రాసిపెట్టుకోండి.. విశాఖ ఉక్కు కర్మాగారం చచ్చిపోతోంది అని ఆయన వ్యాఖ్యానించారు. ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న రైతులు ఎంతమంది వాళ్లకు అండగా నిలబడతారో నేనూ చూస్తా. తప్పకుండా నిలబడండి అని… పోస్కో కంపెనీని ఒరిస్సా వాళ్లు తన్ని తరిమేస్తే.. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ వస్తోంది అన్నారు.
ఈ విశాఖపట్నానికి ఎవరు మీడియేటర్ ఉన్నారో మీరే ఆలోచించండి. ఆ వ్యక్తి ఎవరో నాకు తెలుసు గాని.. ఆ పేరు చెప్పడం ఇష్టం లేదు అని అన్నారు. తెలుగు వ్యక్తే.. ఢిల్లీలో పదవిలో ఉన్న వ్యక్తే అని ఆయన అన్నారు. దమ్ముంటే విశాఖ ఉక్కుని కాపాడండి అని సవాల్ చేసారు. “సాటి రైతుకి అన్యాయం జరుగుతుందంటే ముందుకు రాని వాళ్లు రేపటి రోజున ఉక్కు కర్మాగారాన్ని మూసేసినా పట్టించుకోరు. త్వరలో విశాఖ ఉక్కు కార్మికులు రోడ్డు మీదికి రాబోతున్నారు. మీరు రాసిపెట్టుకోండి! మరో ఆరు నెల్లో విశాఖ ఉక్కు మూసివేత వార్త బయటకు రానుంది. అప్పట్లో విశాఖ ఉక్కు కోసం 60 వేల ఎకరాలు ఇచ్చారు. వైజాగ్ అంటేనే స్టీల్ ఫ్యాక్టరీ.. త్వరలో అది కనుమరుగవ్వబోతోంది అని ఆయన అన్నారు.
మన ముఖ్యమంత్రి జగన్‌ని దమ్ముంటే దీన్ని ఆపమనండి చూద్దాం. వైజాగ్ మీద అంత ప్రేమ ఉందంటున్న జగన్‌ను విశాఖ ఉక్కు మూసివేతను ఆపమనండి అని సవాల్ చేసారు. విశాఖ ఉక్కు కోసం పార్లమెంట్‌లో పోరాడమనండి అని వాళ్లు పోస్కో గురించి పోట్లాడతారు ఖచ్చితంగా. ఎందుకంటే ఆ కంపెనీ తరుఫున విశాఖ ఉక్కుకు సంబంధించిన 60 వేల ఎకరాల్లో 2 వేల ఎకరాలు పోస్కో కంపెనీకి ఇవ్వమని అడుగుతున్నారు అని ఇక్కడ విశాఖ ఉక్కు కంపెనీ ఉండగా.. వేరే ఉక్కు కంపెనీ ఎందుకు? ఇది కుట్ర కాదా? విశాఖ ఉక్కుకి సొంత గనులు లేవు.. గనులు కేటాయించమనండి చూద్దాం అని సవాల్ చేసారు.