హలో ఏపీ.. బైబై వైసీపీ.! జనసేనాని చెప్పదలచుకున్నదేంటి.?

హలో ఏపీ.. అంటున్నారు.. బై బై వైసీపీ.. అంటున్నారు.! అంతా బాగానే వుంది. ‘జై జనసేన’ అని కూడా అంటున్నారు. ఇదీ ఓకే.! మరి, టీడీపీతో పొత్తు సంగతేంటి.? టీడీపీతో పొత్తు పెట్టుకుంటే, జనసేన ఎలా అధికారంలోకి వస్తుంది.?

‘మొత్తం అన్ని స్థానాల్లోనూ మేమే పోటీ చేస్తాం’ అని జనసేనాని చెప్పడంలేదు. పోనీ, ‘పొత్తు పెట్టుకున్నా మెజార్టీ స్థానాల్లో మేమే పోటీ చేసి గెలుస్తాం..’ అని కూడా అనడంలేదు. కాలం కలిసొస్తే ముఖ్యమంత్రినవుతానంటున్నారు. అదేం లెక్క.?

వాస్తవానికి, ‘హలో ఏపీ.. బైబై వైసీపీ’ అంటూ జనసేనాని చేసిన నినాదం, క్షణాల్లో వైరల్ అయిపోయింది. ‘ఈ నినాదం చాలు, జనసేన పార్టీ బంపర్ విక్టరీ కొట్టడానికి..’ అంటున్నారు జనసైనికులు. కానీ, టీడీపీతో పొత్తునే జనసైనికులు జీర్ణించుకోలేకపోతున్నారు.

‘మాతో జనసేన పొత్తు పెట్టుకుంటే, పది పదిహేను సీట్ల కంటే ఎక్కువ ఇవ్వబోం..’ అని టీడీపీ నేతలు చెబుతున్న సంగతి తెలిసిందే. అలాంటప్పుడు, ఈ నినాదాలతో జనసేనాని సాధించేదేంటి.?

వారాహి యాత్ర పేరుతో జనసేనాని పర్యటిస్తున్న నియోజకవర్గాలన్నిటిలోనూ అయినా జనసేన పార్టీ పోటీ చేస్తుందా.? అందుకు టీడీపీ అనుమతిస్తుందా.? వీలుకానప్పుడు ఎందుకీ ‘బై బై వైసీపీ’ నినాదాలు.? అవసరానికి మించి, శక్తికి మించి జనసేనాని చేసే ఈ నినాదాలే జనసేన పార్టీకి శాపంగా మారుతున్నాయి.

కానీ, తప్పదు.! జనసేనాని అంతే. జనంలోకి వెళితే ఆవేశంతో ఊగిపోతారు. జనసేనకి వేరే శతృవులు అవసరం లేదు.