దేశ వ్యాప్తంగా కోవిడ్ వ్యాక్సినేషన్ డ్రైవ్ కొనసాగుతోంది. ప్రభుత్వాలు, అధికారులు ముందుగానే అన్ని చర్యలు తీసుకోవడంతో వ్యాక్సినేషన్ కార్యక్రమం ప్రశాంతంగా జరుగుతోంది. అయితే, విజయవాడలో వ్యాక్సినేషన్ సందర్భంగా కొంత టెన్షన్ నెలకొంది. నగరంలోని జీజీహెచ్ ఆసుపత్రిలో వ్యాక్సిన్ వేయించుకున్న రాధ అనే హెల్త్ వర్కర్ స్వల్ప అస్వస్థతకు గురయ్యారు.
వ్యాక్సిన్ వేసిన వెంటనే ఆమె కళ్లు తిరిగి పడిపోయారు. దీంతో, అక్కడే ఉన్న డాక్టర్లు ఆమెకు వెంటనే అత్యవసర చికిత్స అందించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి నిలకడగా ఉంది.కోలుకున్న తర్వాత రాధ మాట్లాడుతూ, వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత కళ్లు తిరిగినట్టు అనిపించిందని, చాలా చలిగా అనిపించిందని చెప్పారు.
ప్రస్తుతం కొంత చలిగా ఉన్నా, బాగానే ఉందని తెలిపారు. మరోవైపు, వ్యాక్సిన్ తీసుకున్న ప్రతి వ్యక్తిని అబ్జర్వేషన్ లో పెడుతున్నారు. టీకా వేయించుకున్న 30 నిమిషాల తర్వాత వారిని చెక్ చేసి, అంతా బాగుందని నిర్ధారించుకున్న తర్వాతే పంపిస్తున్నారు. వ్యాక్సిన్ తీసుకున్న వారికి ఏవైనా ఇబ్బందులు తలెత్తితే వెంటనే చికిత్స అందించడానికి డాక్టర్లు అందుబాటులో ఉన్నారు.