ప్రశాంత్ కిశోర్ ‘జీరో’ స్థాయికి వచ్చేశాడా.?

ప్రశాంత్ కిశోర్ గురించి దేశంలో తెలియని రాజకీయ నాయకులు ఎవరుంటారు.? ఐ-ప్యాక్ పేరుతో దేశ రాజకీయాల్లో కొత్త తరహా ‘స్కిల్’ ప్రవేశపెట్టాడాయన. ఐఐటీ గ్రాడ్యుయేట్స్‌ని, పోస్టు గ్రాడ్యుయేట్స్‌ని రంగంలోకి దించి మరీ, దేశంలో ఎన్నికల తీరు తెన్నుల్ని మార్చేశాడాయన.

ఏ నియోజకవర్గంలో ఎలాంటి పరిస్థితులు వున్నాయి.? ఆ పరిస్థితుల్ని ఫలానా పార్టీకి అనుకూలంగా ఎలా మార్చాలి? అన్నదానిపై ప్రశాంత్ కిషోర్ చేసిన వర్క్ అంతా ఇంతా కాదు. దేశంలో పలు రాజకీయ పార్టీల కోసం ఆయన పని చేశాడు. ఫీజులు ఏకంగా వందల కోట్లలో లాగేశాడు. రెండు వేల కోట్లు.. ఆ పైన కూడా.. అనే ప్రచారం వుంది లెండి.. అది వేరే సంగతి.

టీమ్‌లో అలాంటి సిబ్బంది వుంటారు. ఐఐటియన్లు అంటే మాటలా.? లక్షల్లో వేతనాలు ఇవ్వాలి. గ్రామ స్థాయిలో సిబ్బందిని తిప్పాలంటే, దానికీ ఖర్చులు బోలెడన్ని. విశ్లేషణలు, వగైరాలు.. అది వేరే కథ. వేవ్‌ని తనక్కావాల్సిన విధంగా మార్చేసే ‘చావు’ తెలివితేటలూ ప్రశాంత్ కిషోర్ సొంతం.

అప్పట్లో వైసీపీకీ, ఆ తర్వాత తృణమూల్ కాంగ్రెస్ పార్టీకీ.. ఇలా దేశంలో చాలా పార్టీల కోసం పని చేశాడు ప్రశాంత్ కిషోర్. ఇప్పుడాయన టీడీపీ వైపుకు వెళుతున్నాడు. డీల్ సెట్ అయ్యిందో లేదో ఇంకా తెలియదు. కానీ, సెట్ అయ్యేలానే వుంది.

కాగా, ఇప్పటిదాకా ప్రశాంత్ కిషోర్‌ని వాడుకున్న వైసీపీ, ఎప్పుడైతే ఆయన టీడీపీ వైపు తిరిగాడో, ఆ వెంటనే అతని బుర్రలో గుజ్జు అయిపోయిందని ఎద్దేవా చేస్తోంది. ‘జాగ్రత్త మీ పార్టీలో ముఖ్యమైన టిక్కెట్ ఎగిరిపోతుందేమో..’ అంటూ టీడీపీని ఉద్దేశించి ఉచిత సలహా పారేస్తున్నారు వైసీపీ నేతలు.

అంటే, వైసీపీ కోసం పని చేసినప్పుడు ఏ పెద్ద తలకాయకి ప్రశాంత్ కిషోర్ స్కెచ్ వేసి, వర్కవుట్ చేశాడు.? అన్న అనుమానాలు సహజంగానే తెరపైకొస్తాయ్. ప్రశాంత్ కిషోర్ బుర్రలో గుజ్జు అయిపోయిందని అనుకోలేం. ఆయన కోసం ప్రత్యేక విమానాన్ని టీడీపీ సమకూర్చింది. 2 వేల కోట్ల డీల్ అట కూడా.!

‘జీరో’కి వచ్చేశాడంటూ వైసీపీ నేతలు ప్రశాంత్ కిషోర్ మీద సెటైర్లు వేస్తున్నారుగానీ, ఏమో.. వైసీపీనే ఆయన జీరోకి తెచ్చేస్తాడేమో కూడా.! అంతటి ‘క్రిమినల్ బ్రెయిన్’ (టీడీపీ గతంలో ఇదే విమర్శ చేసింది ఆయన మీద) ప్రశాంత్ కిషోర్‌కి వుందని అనుకోవచ్చు.