హరీష్ ను ఇరికించబోయిన వంటేరు ప్రతాప్ రెడ్డి ‘మిస్ ఫైర్’

రాజకీయాల్లో హత్యలు ఉండవు. ఆత్మహత్యలే… ఈ డైలాగ్ ఎవరు కనిపెట్టారో కానీ ఇది చాలా కరెక్టు మాట అని చాలాసార్లు రుజువైంది. రాజకీయ పార్టీల్లో నాయకులు వేసే స్టెప్స్ ఒక్కటి తేడా పడినా వారి రాజకీయ జీవితం ప్రమాదంలో పడ్డట్లే లెక్క. అంత పక్కాగా ఉంటేనే రాజకీయాల్లో నిలబడగలరు. ఈ విషయంలో గజ్వేల్ కాంగ్రెస్ నేత వంటేరు ప్రతాప్ రెడ్డి లేవనెత్తిన చర్చ తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ దుమారం రేపుతోంది. కానీ ఆయన వ్యూహం మిస్ ఫైర్ అయిందా అంటే అవుననే అంటున్నాయి రాజకీయ వర్గాలు.  

‘‘హరీష్ రావు నాకు ప్రయివేటు నెంబరు (అన్ నోన్ నెంబర్) తో ఫోన్ చేసిండు. కేసిఆర్ ను ఓడించాలని చెప్పిండు. కేసిఆర్ ను ఓడిచేందుకు డబ్బు సాయం చేస్తా అన్నడు. కేసిఆర్ ను ఓడిస్తేనే తెలంగాణలో కుటుంబ పాలన అంతమైతదన్నడు. తండ్రీ కొడుకులు (కేసిఆర్, కేటిఆర్) ఇద్దరూ నన్ను సతాయిస్తున్నరు అని హరీష్ బాధపడ్డడు. హరీష్ రావు రాహుల్ గాంధీతో టచ్ లో ఉన్నడు. హరీష్ రావును టిఆర్ఎస్ నుంచి ఎలగొడతరు. నెలరోజుల్లోపట సోనియాగాంధీ సమక్షంలో హరీష్ కాంగ్రెస్ పార్టీలో చేరతాడు. ఇది ముమ్మాటికీ నిజం’’ ఈ మాటలు అన్నదెవరో మనకు తెలుసు. గజ్వేల్ కాంగ్రెస్ నేత వంటేరు ప్రతాప్ రెడ్డి. తాను ఈ మాట మీద కట్టుబడి ఉన్నానని, ఇది నిజమని ఎక్కడ ప్రమాణం చేయమన్నా చేయడానికి రెడీ అని స్పష్టం చేశారు వంటేరు.

అయితే వంటేరు అలా కామెంట్స్ చేయడంతో హరీష్ కూడా అంతే స్థాయిలో కౌంటర్ ఎటాక్ చేశారు. గజ్వేల్ లో వంటేరును రాజకీయంగా మట్టికరిపించే వరకు కదలబోనని స్పష్టం చేశారు. రాజకీయ లబ్ధి కోసమే వంటేరు చిల్లర మాటలు మాట్లాడుతున్నాడని విమర్శించారు. అంతేకాకుండా వంటేరుపై పోలీసులకు ఫిర్యాదు కూడా చేసినట్లు హరీష్ చెప్పారు.

వంటేరు ఏ ఉధ్దేశంతో ఈ కామెంట్స్ చేశారన్నది పక్కన పెడితే దీనివల్ల ఆయనకు వచ్చిన మైలేజీ మాత్రం పెద్దగా లేదనే చెబుతున్నారు. ఒకవేళ నిజంగా హరీష్ రావు అలా మాట్లాడి ఉన్నా కూడా అది బయట పెట్టడం ద్వారా వంటేరు కొరివితో నెత్తి గోక్కునే ప్రయత్నమే తప్ప మరొకటి కాదని అంటున్నారు. అలాంటి తెర వెనుక మాట్లాడిన విషయాలను తెర మీదకు తీసుకురావడం వల్ల నష్టం వంటేరుకే తప్ప టిఆర్ఎస్ కు కానీ, హరీష్ కు కానీ ఏముంటుదని హరీష్ మనుషులు అంటున్నారు.

ఇప్పుడేం జరిగింది? వంటేరు మాటల తర్వాత గజ్వేల్ లో కేసిఆర్ మెజార్టీ 50 వేల కంటే ఒక్క ఓటు తక్కువ వచ్చినా తాను దేనికైనా రెడీ అని హరీష్ రావు టిఆర్ఎస్ నేతల వద్ద అంటున్నారట. మెదక్ జిల్లాలో మిగతా సీట్ల కంటే ఎక్కువగా ఆయన గజ్వేల్ మీదే దృష్టి కేంద్రీకరించే అవకాశాలున్నట్లు చెబుతున్నారు. టిఆర్ఎస్ పార్టీలో ట్రబుల్ షూటర్ గా హరీష్ కు పేరుంది. ఆయన ఒక్కసారి రంగంలోకి దిగిండంటే అవతల ఎంత పెద్ద పొలిటీషియన్ అయినా వార్ వన్ సైడే అని టిఆర్ఎస్ నేతలు చెబుతారు. నిన్నమొన్నటి వరకు హరీష్ రావు గజ్వేల్ నియోజకవర్గాన్ని సీరియస్ గా తీసుకున్నారో లేదో కానీ ఇప్పుడు మాత్రం సీరియస్ గా తీసుకుని బంపర్ మెజార్టీతో తన మామ కేసిఆర్ ను గెలిపించడం ఖాయం అని కాంగ్రెస్ వర్గాల్లో కూడా టాక్ మొదలైంది. ఒకవేళ రేపటినాడు కేసిఆరే ఓడిపోతే ఆ నష్టం హరీష్ కు కూడా ఎక్కువగానే ఉండే చాన్స్ ఉంటుందని అంటున్నారు.

వంటేరుకు హరీష్ ఫోన్ నిజమేనా? 

వంటేరు ప్రతాపరెడ్డి గజ్వేల్ నియోజకవర్గంలో పట్టున్న నాయకుడే. రేపటి ఎన్నికల్లో కేసిఆర్ ను ఢీకొట్టే వ్యక్తి వంటేరు మాత్రమే అన్న చర్చ ఉంది. కానీ ఆయన చేసిన కామెంట్స్ ఇప్పుడు ఆయన బలాన్ని తగ్గించాయా? పెంచాయా అన్నది చర్చ జరుగుతున్నది.

మరి వంటేరుకు హరీష్ నిజంగానే ఫోన్ చేశారా?

ప్రయివేట్ నెంబరుతో మాట్లాడారా?

ఏం లేనిదే వంటేరు అంత బలంగా ఎందుకు ఆరోపణలు చేస్తారు?

పైగా ఏ గుడిలో ప్రమాణం చేయమన్నా తాను చేయడానికి రెడీ అని ఎందుకు అంటారు?

ఇప్పుడు కాదు గతంలో ఫోన్ చేసి చెప్పిండంటూ వంటేరు ఎందుకు బల్లగుద్ది చెబుతారు?

ఈ అంశంలో ఈరకమైన ప్రశ్నలన్నీ ఉత్పన్నమవుతున్నాయి. అయితే హరీష్ ఫోన్ చేశారా లేదా అన్నది తేలకపోయినా హరీష్ రావు కొంతకాలం టిఆర్ఎస్ లో ఇబ్బంది పడ్డ మాట మాత్రం వాస్తవమే అని టిఆర్ఎస్ వర్గాల్లోనూ టాక్ నడుస్తోంది. కొంగర కలాన్ సభ తర్వాత సుమారు నెలరోజులపాటు టిఆర్ఎస్ అనుకూల మీడియా నమస్తే తెలంగాణ పత్రికలో, టిన్యూస్ లో హరీష్ రావు ప్రసారాలు జరగలేదు. టిఆర్ఎస్ లో నెంబర్ 2 స్థాయిలో ఉన్న నాయకుడి వార్తలు ఎందుకు బ్యాన్ చేయబడ్డాయి అన్న అనుమానాలు ఇప్పటికీ ఉన్నాయి. ఒకవేళ నిజంగా హరీష్ ఫోన్ చేసి ఉంటే ఆ గ్యాప్ ఉన్న సమయంలోనే చేశారేమో అని కాంగ్రెస్ శ్రేణుల్లో టాక్ నడుస్తోంది.

ఏది ఏమైనా ఈ విషయాన్ని బయటకు తెచ్చి వంటేరు ప్రతాప్ రెడ్డి ఇరకాటంలో పడ్డారని మాత్రం రాజకీయ వర్గాల్లో వినబడుతున్నమాట. రేపు హరీష్ గజ్వేల్ నుంచి కాలు బయట పెట్టకుండా ప్రచారం చేస్తే ఆ నష్టం వంటేరుకు తీరనిదే అవుతుందని అంటున్నారు. ఇది వంటేరు స్ట్రాటజీ  మిస్ ఫైర్ అయినట్లా? లేక కేసిఆర్, హరీష్ మధ్య గ్యాప్ పెంచడంలో సక్సెస్ అయిండా అన్నది మాత్రం ఆచరణలో తేలాల్సిన ముచ్చట.