టిడిపితో పొత్తు నేపథ్యంలో తెలంగాణ పిసిిస చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డికి 12 అంశాలపై క్లారిటీ ఇవ్వాలంటూ టిఆర్ఎస్ నేత, ఇరిగేషన్ శాఖ మంత్రి హరీష్ రావు బహిరంగ లేఖ రాశారు. ఈ విషయమై టిఆర్ఎస్ ఎల్పీలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి వివరాలను వెల్లడించారు. హరీష్ రావు రాసిన బహిరంగలేఖలో ఉన్న 12 అంశాలు ఇవే. వీటిపై టిడిపి అధినేత చంద్రబాబు నుంచి స్పష్టమైన వైఖరి తీసుకున్నారా లేదా అంటూ ఉత్తమ్ ను నిలదీశారు హరీష్ రావు. లేఖలోని 12 అంశాలు చదవండి.
1 తెలంగాణ రాకుండా చంద్రబాబు అడ్డుకునే ప్రయత్నం చేశారు. తెలంగాణ వచ్చిన తర్వాత కూడా తెలంగాణ అభివృద్ధికి ఆటంకం కల్పించారు. మరి ఇకపై తెలంగాణ అభివృద్ధిని అడ్డుకోకుండా ఉండేందుకు టిడిపి పొలిట్ బ్యూరోలో ఏమైనా తీర్మానం చేశారా?
2 హైకోర్టు విభజన, సాగునీటి ప్రాజెక్టులు, ఉద్యోగుల విభజనలో చంద్రబాబు వ్యతిరేకంగా ఉన్నట్లు మనకు కనబడుతున్నది. ఆయన వాదనలు కూడా అలాగే వినిపిస్తున్నారు. తెలంగాణ వ్యతిరేక వైఖరి విడనాడతానని బాబు నుంచి ఏమైనా హామీ తీసుకున్నారా?
3 కేంద్రాన్ని బ్లాక్ మెయిల్ చేసి 7 మండలాలను ఆంధ్రాలో కలుపుకున్నారు. ఆ 7 మండలాలను తిరిగి తెలంగాణలో కలిపేందుకు చంద్రబాబు నుంచి కాంగ్రెస్ ఏమైనా హామీ తీసుకున్నదా?
4 150 మీటర్ల ఎత్తులో పోలవరం కడుతున్నారు. పోలవరం డిజైన్ మార్పు కోసం తెలంగాణ సర్కారు కోరుతున్నది. పోలవరం మార్పుకు బాబు ఒప్పుకున్నరా? బాబు వైఖరేంటి?
5 చంద్రబాబు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును ఎట్టి పరిస్థితుల్లో కట్టనే కట్టొద్దు, ఇది అక్రమ ప్రాజెక్టు అని కేంద్రానికి 30 లేఖలు రాశారు. ఆయన స్వయంగా వెళ్లి ఫిర్యాదు కూడా చేశారు కేంద్రానికి. ఈ ప్రాజెక్టు నల్లగొండ, రంగారెడ్డి, పాలమూరు ప్రజల కోసం కడుతున్నది. మరి ఆ లేఖలు వాపస్ తీసుకుని ప్రాజెక్టు నిర్మాణానికి బాబు సహకరిస్తానని ఏమైనా హామీ ఇచ్చారా?
6 కాళేశ్వరం, తమ్మిడిహట్టి, పెన్ గంగ, రామప్ప పాకాల, ప్రాజెక్టుల మీద చంద్రబాబు కేంద్రానికి ఫిర్యాదులు చేశారు. ఈ ఫిర్యాదులన్నీ బాబు ఉపసంహరించుకున్నారా? బాబు ఏమైనా లేఖ ఇచ్చారా?
7 కృష్ణా, గోదావరి నదుల మీద అప్పటి ట్రిబ్యూనల్స్ తీర్పులు చెప్పాయి. పోలవరం కు 2009లో అనుమతులు వచ్చాయి. పోలవరం లో 45 టిఎంసిల నీరు తెలంగాణకు కేటాయించాలని అపెక్స్ కమిటీలో కేసిఆర్ కోరారు. అప్పుడు బాబు ఇవ్వడానికి వీలు లేదు అని అడ్డంగా వాదించారు. 45 టిఎంసిలు మాకు దక్కాల్సిందే అని అపెక్స్ కమిటీలో మేము వాదించాము. కానీ దానిపై చంద్రబాబు సుప్రీంకోర్టులో కేసు వేశారు. 45 టిఎంసిల నీరు తెలంగాణకు ఇవ్వడానికి ఒప్పుకున్నారా? 45 టిఎంసిలు ఇస్తాననేలా బాబును ఒప్పిస్తారా?
8 తెలుగు జాతి అన్నది బాబుకు వర్కవుట్ కాదు. ఎన్టీఆర్ కు చెల్లుతుంది తెలుగు జాతి అన్న నినాదం. మిషన్ భగీరథ ప్రారంభించింది తెలంగాణ సర్కారు. దానికి కృష్ణా, గోదావరి నుంచి నీళ్లు వాడుకుంటున్నాము. మీ ఇల్లు హైదరాబాద్ లోనే ఉంటది. మంచినీళ్లు ఇచ్చే మిషన్ భగీరథ మీద కూడా బాబు ఫిర్యాదు చేశారు. తాగే నీళ్లకు హక్కు లేదన్న చంద్రబాబు పశ్చాత్తాపాన్ని వ్యక్తం చేశారా?
9 విభజన హక్కు చట్టంలో లేకపోయినా అక్రమంగా బిజెపితో పొత్తులో భాగంగా 460 మెగావాట్ల లోయర్ సీలేరు పవర్ ప్రాజెక్టును బాబు గుంజుకున్నారు. ఐదు వేల కోట్ల విలువైన లోయర్ సీలేరు ప్రాజెక్టులో తెలంగాణకు వాటా లేకుండా రాత్రికి రాత్రే అక్రమంగా లాక్కున్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా 365రోజులు జల విద్యుత్ జరుగుతున్నది. జనరల్ గా ఏ ప్రాజెక్టులో అయినా 50 రోజులో, 60 రోజులో నీటి విద్యుత్ వస్తది. కానీ సీలేరు అలా కాదు. రాత్రికి రాత్రి లోయర్ సీలేరు లాక్కోవడం వల్ల రోజుకు కోటి రూపాయల నష్టం తెలంగాణకు జరుగుతున్నది. దీన్ని వెనక్కు ఇవ్వడానికి చంద్రబాబు ఒప్పుకుంటరా?
10 విద్యుత్ వివాదంలో 1200 మంది విద్యుత్ ఉద్యోగులను ఆంధ్రప్రదేశ్ కు బదిలీ చేశారు. వారిని చేర్చుకోకుండా కోర్టుకు పోయి పెండింగ్ లో పెట్టారు చంద్రబాబు. వారికి తెలంగాణ సర్కారే జీతం ఇస్తున్నది. కోర్టులో కేసులు ఉపసంహరించుకుంటాం. 1200 మందిని చేర్చుకుంటామని బాబు హామీ ఇచ్చారా?
11 నిజాం కాలంలో తెలంగాణకు సంక్రమించిన వారసత్వ సంపదలో వాటా కావాలని బాబు అడుగుతున్నాడు. కోర్టుల్లో కేసులు వేసి వాదిస్తున్నారు. వాటిని ఉపసంహరించుకుని ఆ సందప తెలంగాణకే దక్కాలని బాబు అంగీకరించారా?
12 హైకోర్టు విభజనతోపాటు అనేక ప్రభుత్వ రంగ సంస్థల విభజనలో ఎపి సర్కారు సహాయ నిరాకరణ అవలంభిస్తున్నది. సచివాలయం, అసెంబ్లీ కట్టుకున్నారు కానీ హైకోర్టు కట్టుకోకుండా హైకోర్టు విభజనకు అడ్డుకుంటున్నారు. హైకోర్టు విభజనకు, సత్వర ఆస్తుల విభజనకు బాబు హామీ ఇచ్చారా? దీనికి ఉత్తమ్ సమాధానం చెప్పాలి.
ఈ పన్నెండు అంశాలను మీరు ఏర్పాటు చేయబోయే కామన్ మినిమం ప్రోగ్రాంలో చేరుస్తారా లేదా ? ఉత్తమ్ సమాధానం చెప్పాలి అని హరీష్ రావు కోరారు. అసలు ఈ అంశాలు మీ సిఎంపిలో ఉంటాయా? ఉండవా అని ప్రశ్నించారు. దీనిపై చంద్రబాబు సంతకాలు చేస్తారా? అనేది స్పష్టం చేయాలన్నారు. దీనిపై తెలంగాణ ప్రజల్లో భయాందోళనలు, అనుమానాలు ఉన్నాయన్నారు. వాటిని నివృత్తి కావాలంటే కామన్ మినిమం ప్రోగ్రామ్ లో ఈ అంశాలు పెట్టాలని కోరుతున్నామన్నారు. పొత్తులు పెట్టుకుంటే మాకు అభ్యంతరం లేదు కానీ.. పొత్తుల వల్ల రాజకీయ ప్రయోజనాలు ఉంటాయేమో కానీ రాష్ట్ర ప్రయోజనాలకు నష్టం కలగరాదన్నది మా లక్ష్యం అన్నారు.
ఈ 12 అంశాలపైనా బాబు వైఖరి స్పష్టం చేయకుండా మీ సిఎంపిలో ఈ అంశాలను పొందుపరచకుండా పొత్తు పెట్టుకుంటే తెలంగాణ ప్రజానీకం హర్షించదు అన్నారు హరీష్. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ 12 అంశాలను పరిగణలోకి తీసుకుని జనాల్లో ఉన్న కన్ఫ్యూజన్ తొలగించాలని కోరుతున్నట్లు చెప్పారు.