ఇప్పటివరకూ రెడ్డి, కమ్మ సామాజిక వర్గాల మధ్యే దోబూచులాడుతున్న రాజ్యాధికారంపై కాపు, బలిజ, వాటి అనుబంధ కులాలు కన్నేశాయి. రాజ్యాధికారం సాధించడానికి అవసరమైన ఓటు బలం ఉన్నప్పటికీ ఇప్పటికీ ఎందుకు ఇలా ఉండిపోయామనే ఆలోచన ఈసారి బలంగా మొదలైందని తెలుస్తుంది. అయితే పరిపూర్ణమైన నాయకత్వ లోపం, ఐకమత్య లోపం ఇందుకు బలమైన కారణం అనే కామెంట్లు నిత్యం వినిపిస్తూనే ఉంటుంటాయి! అయితే ఈసారి మాత్రం అలా కాకూడదని బీషించుకుని కూర్చున్నారని అంటున్నారు!
1+1=2 కాదని తెలిసినా ఏపీలో పవన్ రూపంలో కాపు ఓటు బ్యాంకుపై బలంగా కన్నేశారు చంద్రబాబు. పవన్ ను 25 సీట్ల వరకూ ఇచ్చి 150 స్థానాల్లో కాపు ఓట్లను గంపగుత్తగా గుద్దించుకోవచ్చనే ఆలోచన చేసినట్లు కనిపిస్తుంది! అయితే ప్రజారాజ్యం సమయంలో కూడా కాపులు “జై చిరంజీవ” అని చెప్పినా… రాజకీయాలకు వచ్చే సరికి లెక్కలు మారాయి! తదనుగుణంగా ఫలితాలూ మారాయి!
అయితే ఆ తప్పు మరోసారి జరగకూడదని హరిరామజోగయ్య లాంటి వారు మొత్తుకున్నా పవన్ కల్యాణ్ ఇంతకాలం వినలేదు! కారణం ఏమిటో తెలియదు కానీ… గత కొన్ని రోజులుగా పవన్ కాపు నాయకులతో చర్చలమీద చర్చలు జరుపుతున్నారు. తెరవెనుక అసలు సిసలు రాజకీయానికి తెరలేపారని తెలుస్తుంది. ఇందులో భాగంగానే “జనసేనలోకి ముద్రగడ” అనే బ్రేకింగ్ ని తెరపైకి తెచ్చారు. దీంతో లెక్కలు మారుతున్నాయి.
ఈ నేపథ్యంలో కాపు సేన నాయకుడు, పవన్ కళ్యాణ్ – జనసేన శ్రేయోభిలాషి అయిన మాజీ మంత్రి చేగొండి హరి రామజోగయ్య హైదరాబాద్ లో పవన్ కళ్యాణ్ ని కలిశారు. ఈ సందర్భంగా ఆయన పవన్ తో సుదీర్ఘంగా చర్చించినట్లు తెలుస్తుంది. ఇదే సమయంలో కాపుల ఓట్లు చీలకుండా జగ్రత్తలు తీసుకోవాలని చెప్పారని సమాచారం.
అంతకంటే ప్రధానంగా… పొత్తులో భాగంగా వీలైనన్ని ఎక్కువ సీట్లు.. అవసరమైతే అత్యధిక సీట్లు జనసేన తీసుకోవాలని చెప్పినట్లు తెలుస్తుంది. ఈ విషయంలో ఏమాత్రం వెనక్కి తగ్గాల్సిన అవసరం లేదని… జనసేనకు టీడీపీ అవసరం కంటే, టీడీపీకి జనసేన అవసరం ఎక్కువగా ఉందనే విషయం మదిలో ఉంచుకోవాలని.. అప్పుడు ఎలాంటి బెరుకూ ఉండదని.. తగ్గాలన్న ఆలోచన రాదని హితబోద చేసినట్లు తెలుస్తుంది.
ఇదే సమయంలో మరింత ప్రధానంగా పొత్తులో భాగంగా జనసేన – టీడీపీ చెరిసమానంగా సీట్ల వరకూ పట్టుబట్టాలని… అందులో ఎవరికి ఎక్కువ సీట్లు వస్తే వారే ముఖ్యమంత్రి అవుతారని కూడా చంద్రబాబు వద్ద పట్టుబట్టాలని.. కండిషన్స్ వినడమే కాదు, పెట్టేలా ఉండాలని పెద్దాయన పనిగట్టుకుని హైదరాబాద్ వెళ్లి మరీ పవన్ కు హితబోద చేశారని సమాచారం!
మరి హరిరామ జోగయ్య చేసిన హితబోదను, రాజకీయ మెలుకువలను, టీడీపీ ముందు పెట్టాల్సిన కండిషన్స్ ను ఏ మేరకు పాటిస్తారు, ఆచరిస్తారు అనేది వేచి చూడాలి!