ఆంధ్రప్రదేశ్ లో పొలిటికల్ హీట్ రోజు రోజుకీ పెరుగుతూ పోతుంది. ఓవైపు యాత్రలు, పాదయాత్రలు, సభలు, సమావేశాలతో ఫుల్ ఎన్నికల సందడి నెలకొంది. ఇక ఆ సభావేధికపై చేస్తున్న సవాళ్లు, ఆరోపణలు, విమర్శలు పీక్స్ కి చేరుకుంటున్నాయి. ఈ సమయంలో లేఖలు కూడా హాట్ టాపిక్ గా మారాయి.
ఇప్పటికే ఏపీలో రెండు లేఖలు హాట్ టాపిక్ గా మారాయి. పవన్ తనపై పరోక్షంగా చేసిన విమర్శలపై ముద్రగడ రెండు లేఖలు రాశారు. మొదటి లేఖలో కాస్త స్మూత్ గా దింపిన ముద్రగడ… రెండో లేఖతో ఘాటెక్కించేశారు. దీంతో జనసేన సైలంట్ అయిపోవడంతోపాటు.. కార్యకర్తలెవరు స్పందించొద్దని సూచించింది.
ఈ సమయంలో సీనియర్ రాజకీయ నాయకుడు, మాజీ మంత్రి హరిరామ జోగయ్య ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డికి బహిరంగ లేఖ రాశారు. గతంలో సీఎం వైఎస్ జగన్ తో పాటు కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం కి లేఖలు రాసిన ఆయన.. ఈ సారి సీఎం జగన్ కు మాత్రమే ఒక లేఖ రాశారు. ఈ లేఖలో సంచలన విషయాలు పేర్కొన్నారు.
అవును… “మీపై సీబీఐ, ఈడీ విచారణ చేసి క్విడ్ ప్రోకో కింద, మనీ ల్యాండరింగ్ కింద 11 సీబీఐ కేసులు, ఆరు ఈడీ కేసులు బనాయించటం జరిగింది. 16 నెలలు జైలు శిక్ష అనుభవించి బెయిల్ పై విడుదలయ్యారు. క్విడ్ ప్రోకో కింద మీరు.. మీ తండ్రి రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో వారి అధికారాన్ని దుర్వినియోగం చేయడం ద్వారా, పారిశ్రామికవేత్తలు కొందరికి ఉపయోగపడటం ద్వారా వారికి లబ్ధి చేకూర్చారని, తద్వారా వారితో సాక్షి టీవీ, ఛానల్, భారతి సిమెంట్, సిందూర్ పవర్ ప్రాజెక్ట్ లాంటి అనేక కంపెనీలలో పెట్టుబడులు పెట్టించి అక్రమాస్తులు కూడగట్టుకోవడం ద్వారా కోట్ల రూపాయలు అక్రమార్జన చేశారని సీబీఐ, ఈడీ అభియోగాలు మోపటం జరిగింది”.
ఈ క్రమంలో… “కోర్టులు ఏ కారణం చేతైనా మిమ్మలను దోషులుగా ప్రకటిస్తే.. సీఎం పదవికి రాజీనామా చేయాల్సి వస్తే.. మీ వారసులుగా రెడ్డి కులస్తులను ముఖ్యమంత్రిగా ప్రకటిస్తారా..? లేక కాపు బడుగు బలహీన వర్గాల వారిని వారసులుగా ప్రకటిస్తారా? చెప్పగలిగితే అందరం సంతోషిస్తాం. దీని ద్వారా బడుగు బలహీన వర్గాలపై మీకున్న కమిట్ మెంట్ చూసి గర్వపడతాం” అని లేఖలో పేర్కొన్నారు.
అయితే ఆటలో అరటిపండులా అసలు ఈ లేఖ ఎందుకు రాశారో జోగయ్యకైనా తెలుసా అంటూ కామెంట్లు పెడుతున్నారు నెటిజన్లు. జగన్ కేసులను విచారించాలంటూ హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేస్తే హైకోర్టు తలంటి పంపించిన అంశం మరిచారా అంటూ సెటైర్లు వేస్తున్నారు. జగన్ జైలుకెళ్తే… పోనీ తమరు వచ్చి కూర్చోండంటూ సూచిస్తున్నారు. ఏది ఏమైనా… ఈ లేఖపై వైసీపీ నేతలు స్పందిస్తారో లేదో వేచి చూడాలి.
ఇదే సమయంలో ఈ లేఖపై పేర్ని నాని స్పందిస్తే పర్లేదు.. వ్యవహారం స్మూత్ గా జరిగిపోద్ది కానీ… కొడాలి నాని మైకందుకుంటే పెద్దాయన ఆరోగ్యానికి హానికరం అంటూ సెటైర్లు కనిపిస్తుండటం కొసమెరుపు.