జోగయ్య డెడ్ లైన్… లేటెస్టే కాదు లాస్ట్ డిమాండ్ కూడా!

టీడీపీ – జనసేన పొత్తు ఒకెత్తు అయితే… ఆ పొత్తులో భాగంగా సీట్ల సర్దుబాట్లు మరొకెత్తు అయితే… ఈ సందర్భంగా జనసేన ప్రత్యేక సలహాదారుడిగా సీట్ల ఎంపీక విషయంలో పవన్ కల్యాణ్ కు హరిరామ జోగయ్య రాసే లేఖలు, వాటిలో చేసే సూచనలు, ఇచ్చే హెచ్చరికలు ఇంకొకెత్తు! ఈ సమయంలో బీజేపీ కూడా పొత్తులో జాయిన్ అవుతుందని భావించారో.. లేక, చంద్రబాబుని మరీ ఇబ్బంది పెట్టకూడదని అనుకుంటున్నారో.. అదీగాక, ప్రస్తుతానికి ఇవి గెలవగలిగితే చాలని ఫిక్సయ్యారో తెలియదు కానీ… ఒక మెట్టు దిగారు జోగయ్య.

అవును… జనసేనకు అనధికారిక సలహాదారుగా వర్క్ చేస్తున్నట్లు కనిపిస్తున్న హరిరామ జోగయ్య తాజాగా మరో మెట్టు దిగారు. అయితే ఇదే లాస్ట్ స్టెప్ అని.. ఇదే డెడ్ లైన్ అని.. ఇక ఇక్కడ నుంచి కిందకు దిగే అవకాశం లేకపోవచ్చని అంటున్నారు. ఇందులో భాగంగా… మొదట్లో ఏపీలో ఉన్న 175 సీట్లలోనూ 100 సీట్లలో టీడీపీ, 75 సీట్లలో జనసేన పోటీ చేయాలని కోరిక జోగయ్య… అనంతరం ఎందుకో కాస్త తగ్గారు. వాటిని గొంతమ్మ కోరికలుగా భావించారో ఏమో కానీ తర్వాత కాలంలో 60 సీట్లు తగ్గకూడదని చెప్పుకొచ్చారు.

ఆ తర్వాత కాలంలో కనీసం 50 సీట్లు తగ్గకూడదని.. తగ్గితే కాపు ఓటు బ్యాంకు టీడీపీకి షిప్ట్ అవ్వదని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ప్రధానంగా గోదావరి జిల్లాలో మెజారిటీ స్థానాలు జనసేనకు ఇవ్వనిపైక్షంలో నష్టం టీడీపీకే అనేస్థాయిలో తనదైన హెచ్చరికలూ జారీ చేశారు. ఈ నేపథ్యంలో… తాజాగా మరో మెట్టు దిగిన జోగయ్య… ఫైనల్ గా నలభై ఒక్క అసెంబ్లీ ఆరు ఎంపీ సీట్లు తీసుకోవాలని పవన్ ని కోరుతున్నారు. ఇది లేటెస్ట్ డిమాండే కాదు లాస్ట్ డిమాండ్ కూడా అయ్యి ఉండొచ్చని తెలుస్తుంది.

వాస్తవానికి జోగయ్య కోరినట్లుగా పవన్ కల్యాణ్ … చంద్రబాబుని కోరినా నలభై ఒక్క సీట్లు టీడీపీ ఇస్తుందా అనే చర్చ మొదలైంది. జనసేనకు 20లోపు టిక్కెట్లు ఇవ్వాలని చంద్రబాబు భావిస్తున్నారని చర్చ నడుస్తున్న నేపథ్యంలో… 41 సీట్లు అంటే ఆల్ మోస్ట్ డబుల్ అని అంటున్నారు. ఇదే సమయంలో ఆరు ఎంపీ సీట్లు విషయం కూడా బాబు అంగీకారానికి దూరంగా ఉన్న నెంబరే అనేది మరో మాట. అయినప్పటికీ జోగయ్య మాత్రం పవన్ కి నిత్యం ఏదో ఒక సూచన చేస్తూ లేఖలు సంధిస్తూనే ఉన్నారు.

అయితే జోగయ్య చెబుతున్న మాటలు, పెడుతున్న కండిషన్లు, ఇస్తున్న సూచనలు జనసేనకు చాలా లాభించేవనే మాటలు జనసనికుల నుంచి వినిపిస్తుంటాయి. ఇదే సమయంలో పొత్తులకు జోగయ్య డిమాండ్లు ఎక్కడ చిక్కులు తెచ్చిపెడతాయో అన్న బెంగ జనసేనానికి ఉంటుందా అనే చర్చ కూడా తెరపైకి వస్తుంటుంది. మరోపక్క పలికేది జోగయ్య అయినా పలికించేది పవనే అని కూడా టాక్ నడుస్తోంది. తాను చెప్పలేకపోతున్న విషయాలను పవనే ఇలా జోగయ్యతో చెప్పిస్తున్నారని కూడా అంటుంటారు!

ఏది ఏమైనా లేటెస్ట్ గా జోగయ్య చేసిన డిమాండే లాస్ట్ డిమాండ్ అనే చర్చ జనసేన వర్గాల్లో నడుస్తుంది. ఈ లెక్కన చూసుకుంటే… 41 అసెంబ్లీ, 6 లోక్ సభ స్థానాలు జనసేనకు ఇవ్వడానికి బాబు అంగీకరిస్తారా.. లేదా అనేది వేచి చూడాలి. ఇదే సమయంలో మరో రెండు మూడు రోజుల్లో బీజేపీతో పొత్తు విషయంపై కూడా క్లారిటీ రావొచ్చన్ని అంటున్నారు. అప్పుడు ఈ నెంబర్స్ పై ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.