పవన్ కు ఉచిత సలహాలు ఇచ్చే విషయంలో ఎప్పుడూ ముందుండే మాజీ మంత్రి చేగొండి హరిరామ జోగయ్య.. మరోసారి ఒక లేఖ విడుదల చేశారు. ఎన్ డీయే కూటమి సమావేశానికి వెళ్లి వచ్చిన పవన్.. ఏ పార్టీతో పొత్తు పెట్టుకోవాలనే విషయంపై ఆయన ఒక ఉచిత సలహా ఇచ్చారు.
అవును… పవన్ ఢిల్లీ టూర్, ఎన్డీయే మీటింగులో పాల్గొనడం వంటి వాటి మీద తనదైన శైలిలో రాజకీయ విశ్లేషణ చేస్తూ ఒక బహిరంగ లేఖ విడుదల చేశారు హరిరామ జోగయ్య. గతంలో కూడా పశ్చిమ గోదావరి జిల్లాలోనే పోటీ చేయాలని… నరసాపురం, తాడేపలి గూడెం, భీమవరం లలో ఏదో ఒక నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని సూచించారు.
అంటే… నిన్న పవన్ ఎక్కడి నుంచి పోటీ చేయాలో చెప్పిన జోగయ్య.. ఇప్పుడు ఏ పర్టీతో పొత్తులో వెళ్లాలో కూడా చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. నిన్నమొన్నటివరకూ… పవన్ ఒంటరిగా వెళ్తే సీఎం అవుతారని చెప్పిన జోగయ్య… ఇప్పుడు టీడీపీతో కలిసి వెళ్లమని సూచిస్తున్నారు. బీజేపీతో అంటకాగొద్దని హెచ్చరిస్తున్నారు.
ఏపీలో బీజేపీ పవన్ కి ఉన్న గ్లామర్ ని తనకు అనుకూలంగా వాడుకోవాలని చూస్తోందని జోగయ్య అంటున్నారు. ఏపీలో బీజేపీ జనసేన పొత్తులకు వెళ్తే కేవలం రెండు శాతం మాత్రమే గత ఎన్నికల కంటే అధికంగా జనసేనకు ఓట్ల శాతం పెరగవచ్చు అని అంటున్నారు. అంతకుమించి ఒరిగేది ఏమీ ఉండదనేది ఆయన అభిప్రాయంగా ఉంది.
ఇదే సమయంలో… టీడీపీతో పొత్తు వల్ల జనసేనకు బాగా కలసి వస్తుందని అంటున్నారు. టీడీపీతో జనసేన పొత్తు వల్ల మంచి ఫలితాలు వచ్చే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు. పైగా చంద్రబాబుకు మంచి పాలనా దక్షుడిగా పేరుందని, అది జనసేనకు కలిసి వస్తోందని అంటున్నారట.
దీంతో… గత ఐదేళ్లలో చంద్రబాబు గ్రాఫ్ ఏమంత పెరిగిపోయింది.. ఇంతకాలం చంద్రబాబులో కనిపించని కార్యదక్షత కొత్తగా ఏమొచ్చిందని ప్రశ్నిస్తున్నారు ఏపీ జనాలు. ఎక్కడ నుంచి పోటీ చేయాలి, ఎవరితో పోటీ చేయాలి అనే విషయాలు పవన్ చూసుకుంటారని.. ఇచ్చిన ఉచిత సలహాలు చాలని జనసేన కార్యకర్తలు అంటున్నారని తెలుస్తుంది.
మరికొంతమందైతే… జోగయ్య కు ఏమీ ఊసుపోవడం లేనట్లుంది.. గుంటూరు పార్టీ ఆఫీసులో ఏదో ఒక పదవి ఇచ్చి కుర్చోబెట్టమని పవన్ కు సలహా ఇస్తున్నారని అంటున్నారు.