చేగొండ హరిరామజోగయ్య గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. మిగతా విషయాల సంగతెలా ఉన్నా.. జనసేన అధినేత విషయంలో సంచలన వ్యాఖ్యలు చేయడంలో ఈయనది ప్రత్యేక స్థానం ఈ క్రమంలో మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు ఈ పెద్దాయన. అవును… పవన్ ను ఇరుకునపెట్టే కామెంట్లు చేయడంలో దిట్ట అని ఆయనగురించి కొందరంటుంటే… పరోక్షంగా పవన్ మేలుకోరేవారిలో ప్రథముడనే మరికొందరు చెబుతుంటారు!
ఈ క్రమంలో తాజాగా స్పందించిన మాజీ మంత్రి, కాపు సంక్షేమ సేన నాయకుడు చేగొండి హరిరామజోగయ్య… టీడీపీతో జనసేన పొత్తుపై హాట్ కామెంట్స్ చేశారు. తాజాగా ఒక ప్రకటన విడుదల చేసిన ఆయన… ఏపీలో టీడీపీతో జనసేన పొత్తు పెట్టుకుంటే.. అది పూర్తిగా పవన్ కే చేటు చేస్తుందని కుండబద్ధలు కొట్టారు.
ఇదే క్రమంలో… తెలుగుదేశం పార్టీ చుట్టూ… వంగవీటి మోహన రంగా హత్య ఉదంతంతో పాటు, కేవలం ఒక సామాజికవర్గానికే మేలు చేస్తుందన్న కుల ముద్ర కూడా ఉందని.. అదేవిధంగా ఎన్నో అవినీతి ఆరోపణలు ఉన్నాయని, మరెన్నో తప్పులు తెలుగుదేశం పాలనలో జరిగాయని… అలాంటి టీడీపీతో పొత్తు పెట్టుకుంటే అవన్నీ జనసేనకు కూడా చుట్టుకుంటాయని ఆయన ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
అందువల్ల… జనసేన పొత్తులకు దిగకుండా ఒంటరిగానే పోటీ చేయాలని సూచిస్తున్నారు. అలా కాదూ కూడదు తెలుగుదేశంతో పొత్తు పెట్టుకోవాలి.. అని పవన్ భావిస్తే.. మొత్తం 175 అసెంబ్లీ నియోజకవర్గాలను ఫిఫ్టీ ఫిఫ్టీ షేర్ గా పంచుకోవాలని సూచించారు. ఉమ్మడి శత్రువు అయిన వైసీపీని గద్దె దించడమే పవన్ ఆలోచన అయితే.. పొత్తులకే మొగ్గు చూపడం అనివార్యం అని భావిస్తే… ఈ ఫార్ములానే అనుసరించడంతోపాటు.. ముఖ్యమంత్రి పీఠాన్ని కూడా రెండున్నరేళ్లు, రెండున్నరేళ్లుగా పంచుకోవాలని సూచిస్తున్నారు.
జోగయ్య లాంటి సీనియర్ నేతలు, కాపు సంక్షేమ నాయకులు ఈ స్థాయిలో ఆలోచిస్తూ.. పవన్ రేంజ్ ని ఎక్కడికో తీసుకెళ్లాలని భావిస్తుంటే… పవన్ మాత్రం… టీడీపీలో తెలుగుదేశం పొత్తుకోసం చకోరపక్షిలా ఎదురుచూస్తున్నారని ఫీలవుతున్నారు జనసైనికులు. వారి ఆవేదనను, జోగయ్య ఆవేశాన్ని పవన్ అర్ధం చేసుకోవాలని సూచిస్తున్నారు!
