జగన్ బంధువుతోపాటు మరో ఐదుగురు నేతలు టీడీపీకి రాజీనామా

ఆంధ్ర రాజకీయాలు గత కొద్ది రోజులుగా అనంతపురం చుట్టూ తిరుగుతున్నాయి. టీడీపీ కంచుకోటగా ఉన్న అనంతపురంలో టీడీపీకి వరుసగా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. సిఐ గోరంట్ల మాధవ్ పదవికి రాజీనామా చేసి వైసీపీలో చేరుతున్నారని వార్తలు రావడం, అనంతపురం అర్బన్ మాజీ ఎమ్మెల్యే టీడీపీ ని వదిలి వైసీపీలో చేరడానికి సిద్ధం అవుతుండటం టీడీపీ నేతలకి మింగుడు పడని విషయంగా మారింది. అయితే ఆదివారం అనంతపురం అర్బన్ మాజీ ఎమ్మెల్యే మరియు తనతోపాటు మరో ఐదుగురు నేతలు టీడీపీకి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. దీనిపై మరింత సమాచారం కింద ఉంది చదవండి.

అనంతపురం అర్బన్ మాజీ ఎమ్మెల్యే గుర్నాధ్ రెడ్డి టీడీపీకి రాజీనామా చేస్తున్నట్టు శుక్రవారం తెలుగురాజ్యం ప్రచురించింది. ఆయన తన పార్టీకి రాజీనామా చేసి వైసీపీలో చేరనున్నారు అని ముందుగానే గుర్నాధ్ అత్యంత సన్నిహితవర్గాల ద్వారా సమాచారం అందడంతో ఈ కధనం ప్రచురించింది. చెప్పినట్టుగానే, గుర్నాధ్ ఆయనతోపాటు మరో ఐదుగురు టీడీపీ కార్పొరేటర్లు కూడా రాజీనామా చేస్తున్నట్లు ఈరోజు మీడియా ఎదుట వెల్లడించారు. చంద్రబాబు నాయుడు పాలనకు ఆకర్షితుణ్ణి అయ్యి పార్టీలోకి వచ్చానని చెప్పిన గుర్నాధ్ ఇప్పుడు టీడీపీలో చేరి తప్పు చేశా అనడం గమనార్హం. బాబు ప్రజల్లో విశ్వాసం కోల్పోయారని విమర్శించడం విశేషం. త్వరలో ఆయన ఏపార్టీలో చేరనున్నారు? తదుపరి కార్యాచరణ ఏమిటి? అనే విషయాలు వెల్లడించనున్నట్టు మీడియాకి తెలిపారు.

గుర్నాధ్ రెడ్డి జర్నీ: వైసీపీ టూ టీడీపీ, టీడీపీ టూ వైసీపీ

అనంతపురం అర్బన్ మాజీ ఎమ్మెల్యే గుర్నాథ్ రెడ్డి గతేడాది వైసీపీని వీడి టీడీపీ తీర్ధం పుచ్చుకున్నారు. పార్టీలో తాను ఏ పదవిని ఆశించడం లేదని కేవలం నియోజకవర్గం అభివృద్ధి కోసమే టీడీపీలో చేరుతున్నట్టు పేర్కొన్నారు. అయితే అనూహ్యంగా ఆయన తిరిగి సొంత గూటికి చేరనున్నట్టు తెలుస్తోంది. దీనిపై మరిన్ని వివరాలు తెలియాలంటే కింద ఉన్న మ్యాటర్ చదవండి.

అనంతపూర్ అర్బన్ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే గుర్నాథ్ రెడ్డి 2009 లో కాంగ్రెస్ తరపున ఎన్నికయ్యారు. 2014 లో వైసీపీ తరపున పోటీ చేసిన ఈయన టీడీపీ అభ్యర్థి ప్రభాకర్ చౌదరి చేతిలో పరాజయం పాలయ్యారు. జగన్ ప్రజాసంకల్ప యాత్ర చేపట్టి అనంతపూర్ లోకి ఎంటర్ అయ్యేముందే 2017 నవంబర్ 30 న టీడీపీలో జాయిన్ అయ్యారు.

2019 ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ముందుకు పోతున్న జగన్… బలాలు, బలహీనతలు బేరీజు వేసుకుని ఒక మైనారిటీ నేతకు నియోజకవర్గ టికెట్ ను కేటాయించారు. దీంతో హర్ట్ అయిన పార్థసారథి పార్టీలో తనకి తగిన గుర్తింపు దక్కలేదని టీడీపీలో జాయిన్ అయ్యారు. అయితే జేసీ వర్గీయులకు, అనంతపూర్ అర్బన్ నియోజకవర్గ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి వర్గీయులకు పొసగదు అనేది బహిరంగ సత్యమే. ఈ కారణంగా ప్రభాకర్ చౌదరికి చెక్ పెట్టేందుకు గుర్నాధ్ రెడ్డిని టీడీపీలో చేర్పించే దిశగా జేసీ దివాకర్ రెడ్డి పావులు కదిపారు అంటుంటారు. వీటికి బలాన్ని చేకూర్చినట్టే గుర్నాధ్ వర్గం టీడీపీలో చేరే సమయంలో జేసీ అక్కడే ఉండటం, ఆ కార్యక్రమానికి ప్రభాకర్ చౌదరి గైర్హాజరవడం జరిగింది.

గుర్నాథ్ రెడ్డి ఫ్యామిలీకి, వైఎస్సార్ ఫ్యామిలీకి దశాబ్దాలుగా సత్సంబంధాలు ఉన్నాయి. అటువంటిది ఆయన జగన్ పాదయాత్ర మొదలైన కొద్ది రోజులకే అది కూడా అనంతపూర్ జిల్లాలోకి ప్రవేశించడానికి ముందే ఆయన టీడీపీలో చేరడం వైసీపీ నేతలను, అభిమానులను విస్మయానికి గురి చేసింది. అనంతపూర్ జిల్లాలో టీడీపీకే ఆధిక్యం ఎక్కువ. అటువంటిది అనంతపూర్ అర్బన్ నియోజకవర్గంలో వైసీపీకి ఉన్న బలమైన అభ్యర్థి పార్టీ మారడం పార్టీకి లోటే. గుర్నాధ్ కి టికెట్ ఇవ్వనప్పటికీ ఆయన పార్టీలో ఉండటం వైసీపీకి బలం. రెడ్డి సామాజికవర్గం ఓట్లు పార్టీకి ప్లస్ అయ్యేవి.

ఈ అంశాలన్నీ దృష్టిలో పెట్టుకుని ఆయన్ని తిరిగి పార్టీలోకి తీసుకురావడానికి వైసీపీ అధిష్టానం కూడా ప్రయత్నాలు చేసినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. వైసీపీ స్కెచ్ సక్సెస్ అయినట్టు తెలుస్తోంది. కాగా కరువు ప్రాంతమైన రాయలసీమకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నీటి సదుపాయం కల్పించారు అదే నన్ను పార్టీ మారేలా చేసింది అని సమర్ధించుకున్న గుర్నాథ్ రెడ్డి, టీడీపీలో చేరినప్పటి నుండి పార్టీలో ఇమడలేక సతమవుతున్నారట.

పార్టీపై అసంతృప్తితో ఉన్న గుర్నాథ్ రెడ్డిని తిరిగి తమ పార్టీలోకి తెచ్చుకోవడానికి వైసీపీ ముఖ్యనేతలు మంతనాలు జరిపి, అందులో విజయం సాధించారని తెలుస్తోంది. ఇక అనంతపూర్ లో మరింత బలాన్ని చేకూర్చుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్న టీడీపీ అధినేత చంద్రబాబుకి గుర్నాథ్ రెడ్డి పార్టీ వీడి సొంత గూటికి చేరడం షాక్ కి గురి చేసే అంశమే.